నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం
నవనిర్మాణ దీక్షలో ఆర్థిక మంత్రి యనమల
సాక్షి, విశాఖపట్నం : నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాకుండా తీరని రెవెన్యూలోటుతో పాటు భారీ అప్పులను అంటగట్టారన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు.
విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఐజీ రవిచంద్ర, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావు నాయుడు, జేసీలు జె.నివాస్, డీవీ రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.