అందుబాటులోకి రాని జిల్లాల వారీ వివరాలు
సబ్జెక్టుల వారీగా మార్కుల తెలియక అయోమయం
డీఎస్సీ అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం
విశాఖ ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షా ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జిల్లాల వారీ ఫలితాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్కులు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పూర్తిస్థాయిలో ఫలితాలు తెలియడానికి ఈ నెల 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, రోస్టర్ విధానం, క్వాలిఫై అయిన వారి వివరాలు 9వ తేదీ నాటికి అందిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లాలోని 1,056 పోస్టులకుగాను గత నెల 9,10,11 తేదీల్లో జరిగిన డీఎస్సీ పరీక్షలకు 36,490 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందరి మార్కులు కలిపి ప్రకటించడంతో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, ఎస్‌జీటీ, పీఈటీ విభాగాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. మార్కులు తెలిసినా పోస్టు వస్తోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. వెబ్‌సైట్‌లో అత్యధికంగా 166 మార్కులు వచ్చినట్టు ప్రకటించినా.. ఆ మార్కులు ఏ సబ్జెక్టుకు సంబంధించినవో ఆ అభ్యర్థికి తప్ప ఎవరికీ తెలియడంలేదు. ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు కూడా తెలియడం లేదు.
అభ్యర్థుల గందరగోళం: జిల్లాల వారీగా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ మార్కుల వివరాలు చూసుకుంటున్న అభ్యర్థులు, తాము ఏ స్థానంలో ఉన్నామో?, పోస్టు వస్తుందో? రాదో అనే గందరగోళంలో ఉన్నారు. గతంలో వచ్చిన డీఎస్సీ ఫలితాల్లో పూర్తిస్థాయి సమాచారం వెంటనే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల ఫలితాలు కలిపి ప్రకటించడంతో వెబ్‌సైట్‌లో మార్కులు చూసి కూడా అంచనాకు రాలేకపోతున్నారు. రిజర్వేషన్ ఉన్నవారు కటాఫ్ ఎంత ఉంటుందని తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 9వ తేదీ వరకు అభ్యర్థులకు తప్పదు.
మరోవారం ఉత్కంఠ
Published Tue, Jun 2 2015 11:50 PM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement