నెల్లూరు(విద్య) : ఊరించి ఊరించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పష్టతలేని నోటిఫికేషన్‌తో అభ్యర్థులు అనేక ఇబ్బందులుపడ్డారు. ఎట్టకేలకు టెట్‌కమ్ టీఆర్‌టీను నిర్వహించారు. ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రోజుకో అనుమానం అభ్యర్థుల్లో తలెత్తుతోంది. టెట్ కమ్ టీఆర్‌టీలో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని ఊహాగానాలు వాస్తవమయ్యేలా ఉన్నాయి. ఆ జాబితాను అనుసరించి పోస్టులు భర్తీ చేస్తారని చెప్పుకుంటున్నారు.
జిల్లా నుంచి రోస్టర్ పాయింట్, మెరిట్ జాబితాను హైదరాబాద్‌కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు అందుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అలాగైతే జిల్లాస్థాయిలో డీఎస్సీ నిర్వహించడం ఎందుకని విద్యార్థుల్లో ప్రశ్నలు రేగుతున్నాయి. జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను సేకరించి జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది.
అందుకు భిన్నంగా ఈసారి జరిగిన డీఎస్సీలో నియామక ప్రక్రియ ఉంటుందని వస్తున్న ఊహాగానాలతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాస్థాయిలోనే ఎంపికలు జరుగుతుంటే పలువురికి అన్యాయాలు జరిగిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్ స్థాయిలో ఎంపికలు జరిగితే అవకతవకలు జరిగితే తెలిసేదెలా అని అభ్యర్థుల్లో నైరాశ్యం చోటు చేసుకుంటుంది.
ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మాటేమిటి..? : ఈనెల15న కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేసే సమయంలో గంటాపథంగా చెప్పారు. అయితే ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ సైతం విడుదల చేయలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో జాప్యం జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయం అభ్యర్థులను వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అందరినీ ఒకేచోటకు చేర్చి నియామకపత్రాలు అందజేస్తారా లేదా జిల్లాస్థాయిలోనే పోస్టింగ్ ప్రక్రియ జరుగుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
తర్జనభర్జన...: తాజాగా వెబ్ కౌన్సెలింగ్‌ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఈప్రయోగం ఫలిస్తుందా? అనే సందేహం లేకపోలేదు. ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే వారికి కావాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. దీంతో డీఈఓ కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచి నియామకాలు చేపట్టాలంటున్నారు. నోటిఫికేషన్ నుంచి అనేక మలుపులు తిరిగినా డీఎస్సీ నియామకాల్లో సైతం పలు ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇంకా నాన్చుడే
Published Thu, Jun 18 2015 4:26 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement