టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
* మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ పరీక్షలు
* 9,061 పోస్టుల భర్తీకి ‘టెట్ కమ్ టీఆర్టీ’
* షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా
* డిసెంబర్ 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* టెట్‌లో అర్హత సాధించినా పరీక్ష రాయాల్సిందే
* నేడు నోటిఫికేషన్ జారీ
* వెబ్‌సైట్లో జిల్లాలవారీగా ఖాళీలు, సిలబస్ వివరాలు వెల్లడించనున్న విద్యాశాఖ
* ఐటీడీఏ, గురుకుల స్కూళ్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్
* ఎస్జీటీ పోస్టులపై బీఈడీలకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 9,061 టీచ ర్ పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11వ తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లను విడివిడిగా నిర్వహించగా ఈసారి రెండింటినీ కలిపి ‘టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంటు టెస్ట్’(టెట్ కమ్ టీఆర్టీ) పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు వివరించారు. 1,849 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 812 భాషా పండితుల పోస్టులు, 156 పీఈటీ పోస్టులు, 6,244 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని పోస్టులకు మాత్రమే ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. ఐటీడీఏ, గురుకులాలు తదితర స్కూళ్లలోని పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తాయన్నారు. టీచర్ పోస్టు ల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్ష ఫీజు, విధివిధానాలను అందులో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రొఫార్మాను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. షెడ్యూల్‌తో పాటు సి లబస్, నిబంధనలు, మార్గదర్శకాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు వెబ్‌సైట్లో ఉంటాయి.
కేటగిరీల ప్రకారం అర్హత మార్కులు
టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలో ఓసీలు 60 శాతానికి పైగా, బీసీలు 50 శాతానికి పైగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతానికి పైగా మార్కులు సాధిస్తేనే టీచర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2012 తరువాత టీచర్ పోస్టుల భర్తీ జరగనందున వయోపరిమితి పెంచినట్లు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో ఐదేళ్లు సడలింపు ఉంటుందని, వికలాంగులకు 50 ఏళ్లుగా నిర్ధారించామన్నారు.గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారు సైతం ఈ పరీక్షలు రాస్తేనే టీచర్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం లభిస్తుందన్నారు.ఆదర్శ పాఠశాలల్లో 491 పీజీటీ నియామకాలు పూర్తి చేశామన్నారు. 498 టీజీటీ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులున్నందున భర్తీ చేయలేకపోయామని మంత్రి వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి అధర్‌సిన్హా, పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ పాల్గొన్నారు.
బీఈడీలకు మొండిచేయి
ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల ముందునుంచి చెబుతూ వచ్చిన టీడీపీ సర్కారు ఆపేరిట టీచర్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తూ వచ్చింది. తమకు అవకాశం దక్కుతుందని ఆశపడ్డ బీఈడీ అభ్యర్ధుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. కేంద్రం అనుమతి ఇవ్వనందున బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పించలేకపోతున్నామని,అవి డీఈడీ అభ్యర్థులకేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇకనుంచి ఏటా భర్తీ చేపడతామన్నారు. వచ్చే ఏడాది బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు.
టెట్, టీఆర్టీ కింద ఒక్కటే పరీక్ష పత్రం
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్, ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీఆర్టీ) కలిపి ఒకటే పరీక్ష, ఒకే ప్రశ్నపత్రం ఉంటుందని వివరించింది. టెట్, టీఆర్టీకి సంబంధించిన ప్రశ్నలు ఒక్క పరీక్షలోనే ఉంటాయంది. పరీక్ష పేపర్లో టెట్, టీ ఆర్టీలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలుంటాయా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాల విద్యాశాఖ గురువారం సాయంత్రం మరో ప్రకటన జారీచేసింది. ‘గతంలో టెట్ పరీక్షలో అర్హత సాధి ంచిన అభ్యర్ధులు కూడా తప్పనిసరిగా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షకు హాజరుకావాలి. టెట్‌లో అర్హత పొందిన వారికి 20 శాతం ప్రాధాన్యమిస్తారు. టెట్‌కమ్ టీఆర్టీలో వచ్చిన మార్కులతో పోల్చి ఏవి ఎక్కువైతే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు’ అని వివరించింది.
డీఎస్సీలో మునిసిపల్, ఐటీడీఏ ఖాళీలు ఏవి?: యూటీఎఫ్
తాజాగా ప్రకటించిన డీఎస్సీ-2014లో మునిసిపల్ పాఠశాలలకు చెందిన 1,252, ఐటీడీఏలోని 314 ఖాళీలు ప్రకటించకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్రఅధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ముగ్గురు వినతులు చేయగా, ఖాళీలు సేకరించినా, ప్రభుత్వం వాటిని నోటిఫికేషన్‌లో ప్రకటించకపోవడాన్ని ఖండించారు.
డీఈడీలకు మంచి చాన్స్!
బీఈడీ అభ్యర్ధులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేయటంతో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పోటీ చాలా తగ్గనుంది. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 6,244 ఉండగా బీఈడీ వారికి ఎస్‌ఏ పోస్టులు 1,849 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో డీఈడీ పూర్తి చేసిన వారికన్నా బీఈడీ చేసిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. డీఈడీ చేసిన వారు 70 వేలమంది కన్నా ఎక్కువగా లేరని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదే బీఈడీలకు వచ్చే సరికి నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు.