6,100 పోస్టులతో డీఎస్సీ | DSC Recruitment With 6,100 Posts By Andhra Pradesh CM YS Jagan Govt, Details Inside - Sakshi
Sakshi News home page

AP DSC Notification 2024: 6,100 పోస్టులతో డీఎస్సీ

Published Thu, Feb 1 2024 3:33 AM | Last Updated on Thu, Feb 1 2024 3:53 PM

DSC Replacement with 6100 posts By Andhra Pradesh CM Jagan Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ - 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యా­యులను నియమించనుంది. ఎస్సీఈ­ఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ సిలబస్‌) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి విద్యార్థులు ‘ఐబీ’ బోర్డు సర్టిఫికేషన్‌ పరీక్షలు రాసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఫిబ్రవరి 16న నుంచి చివరి విడత ‘వైఎస్సార్‌ చేయూత’ పంపిణీ చేపట్టనున్నారు. సుమారు 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ప్రభుత్వం రూ.5,060.40 కోట్లు జమ చేయనుంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 

2.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు!
మెగా డీఎస్సీ 2024లో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. అంతకంటే ముందు 8 రోజుల పాటు డీఎస్సీ అర్హత కోసం టెట్‌ పరీక్ష నిర్వహిస్తాం.

డీఎస్సీ 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్లు వయో పరిమితిని నిర్దేశించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు కల్పించాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఒక్క విద్యా రంగంలోనే 14,219 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల విధానాన్ని తేవడంతో 7,761 పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు.

డీఎస్సీతో పాటు అటవీ శాఖలో ఫారెస్టు రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నాం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఒక్కసారే 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఇలా వివిధ శాఖల్లో కలిపి ఇప్పటికే 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించాం. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7 వేల పోస్టులతో కలిపి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుంది. 

‘చేయూత’తో రూ.19,188 కోట్లు
పేద మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ‘వైఎస్సార్‌ చేయూత’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. తద్వారా వారి జీవనోపాధిని పెంపొందిస్తూ నెలకు అదనపు ఆదాయం కింద రూ.7 వేల నుంచి రూ.10 వేలు సంపాదించేలా తోడ్పాటునిచ్చారు. 14 లక్షల మంది స్వయం ఉపాధి మార్గాలతో సంతోషంగా జీవిస్తున్నారు.

2020లో చేయూతను ప్రారంభించగా మొదటి విడతగా 24,00,11 మందికి రూ.4500.20 కోట్లు, రెండో విడతలో 24.95 లక్షల మందికి రూ.4,679 కోట్లు, మూడో విడతలో 26.39 లక్షల మంది రూ.4.949 కోట్లు పంపిణీ చేశాం. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పలేదు. తాజాగా నాలుగో విడతలో 27 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5,060 కోట్లు జమ చేస్తాం. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జగనన్న చేయూత కార్యక్రమం కొనసాగుతుంది. పథకం కింద నాలుగు విడతల్లో కలిపి సుమారు రూ.19,188 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నాం.

ఎస్‌ఈఆర్టీతో ఐబీ భాగస్వామ్యం..
పేదలకు, సంపన్నులకు తేడా నాణ్యమైన విద్య మాత్రమే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ తీసుకొస్తున్నాం. ఐబీ విద్యా విధానంలో చదవడానికి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.36 లక్షల దాకా ఖర్చవుతుంది. సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే డిజిటల్‌ సదుపాయాలు, ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌లను పేద పిల్లలకు కూడా అందుబాటులోకి తేవడంతో మార్పు మొదలైంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ బోధనలో ఐబీని భాగస్వామ్యం చేస్తున్నాం. ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందుకోవాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం. ప్రభుత్వంతో ఒప్పందానికి ఐబీ సంస్థ ముందుకు వచ్చింది.

సంపన్నుల పిల్లలకే కాదు నిరుపేదలకూ తాము సేవలందిస్తామని ప్రకటించింది. 2024–25లో ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికార్లకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంచిన తర్వాత 2025–26 విద్యా సంవత్సరం జూన్‌ నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ మొదలవుతుంది. 2026–27 విద్యా సంవత్సరం నాటికి రెండో తరగతికి విస్తరిస్తాం. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి ప్లస్‌ 2 తరగతి విద్యార్థులు ఐబీ బోర్డు జాయింట్‌ సర్టిఫికేషన్‌తో పరీక్షలు రాస్తారు. ఈ సర్టిఫికెట్‌తో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ వర్శిటీల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ బడుల్లో ఐబీ భాగస్వామ్యం చేయాలన్న ప్రతిపాదనను మంత్రి మండలి హర్షధ్వానాలతో ఆమోదించింది. 
 
ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు
రాష్ట్రంలో విండ్, సోలార్, గ్రీన్‌ ఎనర్జీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. ఇందులో భాగంగా గ్రీన్‌కో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 1,500 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు నంద్యాల జిల్లా గడివేముల మండలం చిన్నక్కపల్లెలో 1,272.07 ఎకరాలు, మిడ్తూరు మండలం మాసాపేట, నాగలూటి గ్రామాల్లో 1,011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో అవసరమైన భూములను గుర్తించనుంది. సోలార్, విండ్‌తో సహా పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ఇండోసోల్‌ సోలార్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు అవసరమైన భూములు కేటాయించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ రూ. 12,065 కోట్ల పెట్టుబడులతో 3,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా 3,350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది. వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌లో 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పుతుంది.  

► నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ రూ.1,287 కోట్ల పెట్టుబడితో 171.60 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.

► ఆగ్వా గ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1,000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుంది.

► ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,350 కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌ను స్థాపిస్తోంది. తద్వారా 200 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

 ► రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనుంది.

► అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో భాగంగా 150 మెగావాట్లు చొప్పున 9 యూనిట్లు ఏర్పాటుకు పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయాలన్న ఏపీ జెన్‌కో ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. రూ.12,264.36 కోట్లతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది.

బయో ఎనర్జీ, రీసైక్లింగ్, సిమెంట్‌ పరిశ్రమలు..
► వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండు విడతల్లో రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏసీసీ సిమెంట్స్‌ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం. దీని ద్వారా ఏడాదికి 8 మిలియన్‌ టన్నుల క్లింకర్, 4 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి 36 నెలల్లో పూర్తి చేయనుంది. దీనివల్ల 800 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

► అగర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మూడు విడతల్లో రూ.3200 కోట్లతో లిథియం అయాన్‌ రీసైక్లింగ్, ఇ–వేస్ట్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రత్యక్షంగా 3,200 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.

► రాష్ట్రంలో రిలయన్స్‌ బయో ఎనర్జీ లిమిటెడ్‌ రెండు విడతల్లో 15 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. రూ.1,920 కోట్ల పెట్టుబడితో 1,920 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందించనుంది.

► పట్టాభి ఆగ్రో ఫుడ్స్‌ లిమిటెడ్‌ రెండు విడతల్లో రూ.1,153 కోట్ల పెట్టుబడితో బియ్యం ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 2,500 మందికి ఉపాధి కల్పించనుంది.

పులిచింతల నిర్వాసితుల ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు..
► పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిధిలో 5,376 నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన రూ.52 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రూ.8 కోట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల మినహాయింపు.
► పల్నాడు జిల్లా నరసరావుపేటలో జామియా మసీదు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో ఆస్తి పన్ను మినహాయింపునకు ఆమోదం.
► నేచురల్‌ గ్యాస్‌పై వ్యాట్‌ 24.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
► లార్జ్‌ అండ్‌ మెగా ప్రాజెక్టులకు వివిధ పాలసీల్లో భాగంగా రాయితీలు ఇవ్వాలన్న స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ప్రతిపాదనలకు ఆమోదం.
► 4వ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ రిపోర్టు, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌ రూల్స్‌ 2024 ప్రతిపాదనలకు ఆమోదం.
► చట్టసభలకు కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు అధికారులు, చట్టసభల సిబ్బంది తదితరులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటు, డైరెక్టర్‌(నాన్‌ కేడర్‌) పోస్టుకు కేబినెట్‌ ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌లో 27 పోస్టుల భర్తీ, ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ యాక్ట్‌ –1987కి సవరణలు, ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్స్‌ క్లర్క్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ యాక్ట్‌ –1992 సవరణలకు ఆమోదం.
► ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి కోలగట్ల అలనా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 500 గజాలు, అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేనికి 1,000 చదరపు గజాల నివాస స్థలం కేటాయింపు. 
► తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లవారిపాలెంలో ఐఐఐటీ శ్రీసిటీలో ఏర్పాటుకు 42.23 ఎకరాల కేటాయింపు.

మరికొన్ని అంశాలకూ ఆమోదం
► రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు.
► ప్రతి గ్రామ పంచాయితీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం.
► ఏపీ డిస్కమ్‌లకు రూ.1,500 కోట్ల రుణాలపై ప్రభుత్వ గ్యారంటీ.
► అత్యంత మారుమూల ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పీవీజీటీ) ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు రూ.89.98 కోట్లతో ఏపీ డిస్కమ్‌లు రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement