TET cum TRT
-
టెట్ అభ్యర్థులకు తీపి కబురు... ఆ పోస్టులకు అర్హులే!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (ఈఎం ఆర్ఎస్) ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 3,400 పోస్టుల భర్తీకి ఈ నోటి ఫికేషన్‌ను జారీ చేయగా, అందులో తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 262 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో 168 టీజీటీ పోస్టులు ఉండగా, ఆయా పోస్టు లకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో (సీటెట్) అర్హత సాధించిన వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, టెట్‌లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే 11 ప్రిన్సిపాల్ పోస్టులు, 6 వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు, 77 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతల వివరాలను తమ వెబ్సైట్లో (https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/Page/Page?PageId=5)పొందొచ్చని వివరించింది. మెుత్తంగా రాష్ట్రంలోని 262 పోస్టుల భర్తీకి గురువారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిన ఎన్టీఏ.. అభ్యర్థులు ఈనెల 30 వరకు nhttps://recruitment.nta.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్లైన్ పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని తెలిపింది. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్‌టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను, 2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
ఇంకా నాన్చుడే
నెల్లూరు(విద్య) : ఊరించి ఊరించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పష్టతలేని నోటిఫికేషన్‌తో అభ్యర్థులు అనేక ఇబ్బందులుపడ్డారు. ఎట్టకేలకు టెట్‌కమ్ టీఆర్టీను నిర్వహించారు. ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రోజుకో అనుమానం అభ్యర్థుల్లో తలెత్తుతోంది. టెట్ కమ్ టీఆర్టీలో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని ఊహాగానాలు వాస్తవమయ్యేలా ఉన్నాయి. ఆ జాబితాను అనుసరించి పోస్టులు భర్తీ చేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా నుంచి రోస్టర్ పాయింట్, మెరిట్ జాబితాను హైదరాబాద్‌కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు అందుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అలాగైతే జిల్లాస్థాయిలో డీఎస్సీ నిర్వహించడం ఎందుకని విద్యార్థుల్లో ప్రశ్నలు రేగుతున్నాయి. జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను సేకరించి జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఈసారి జరిగిన డీఎస్సీలో నియామక ప్రక్రియ ఉంటుందని వస్తున్న ఊహాగానాలతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాస్థాయిలోనే ఎంపికలు జరుగుతుంటే పలువురికి అన్యాయాలు జరిగిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్ స్థాయిలో ఎంపికలు జరిగితే అవకతవకలు జరిగితే తెలిసేదెలా అని అభ్యర్థుల్లో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మాటేమిటి..? : ఈనెల15న కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేసే సమయంలో గంటాపథంగా చెప్పారు. అయితే ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ సైతం విడుదల చేయలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో జాప్యం జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయం అభ్యర్థులను వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అందరినీ ఒకేచోటకు చేర్చి నియామకపత్రాలు అందజేస్తారా లేదా జిల్లాస్థాయిలోనే పోస్టింగ్ ప్రక్రియ జరుగుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తర్జనభర్జన...: తాజాగా వెబ్ కౌన్సెలింగ్‌ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఈప్రయోగం ఫలిస్తుందా? అనే సందేహం లేకపోలేదు. ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ర్యాంకుల ఆధారంగా ఆన్లైన్లోనే వారికి కావాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. దీంతో డీఈఓ కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచి నియామకాలు చేపట్టాలంటున్నారు. నోటిఫికేషన్ నుంచి అనేక మలుపులు తిరిగినా డీఎస్సీ నియామకాల్లో సైతం పలు ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం గమనార్హం. -
ప్రశాంతంగా టెట్ కమ్ టీఆర్టీ
నెల్లూరు (అర్బన్) : టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి ఆదివారం ఉదయం లాంగ్వేజ్ పండిట్స్‌కు నగరంలోని 13 కేంద్రాల్లో, మధ్యాహ్నం రెండు కేంద్రాల్లో పీఈటీలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షకు 2985 మందికి గాను 2573 మంది హాజరయ్యారు. 412 మంది గైర్హాజరయ్యారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగులో 2306 మందికిగాను 2046 మంది హాజరయ్యారు. 260 మంది గైర్హాజరయ్యారు. హిందీలో 629 మందికిగాను 489 మంది హాజరుకాగా 140 మంది గైర్హాజరయ్యారు. ఉర్దూలో 50 మందికి గాను 38 మంది హాజరుకాగా 12 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. పీఈటీ పరీక్షకు 447 మందికి గాను 384 మంది హాజరుకాగా 63 మంది గైర్హాజరయ్యారు. డీకేడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రాన్ని డీఈఓ పరిశీలించారు. నేడు స్కూల్ అసిస్టెంట్స్ పరీక్ష టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలో భాగంగా సోమవారం లాంగ్వేజ్ పండిట్స్ (స్కూల్ అసిస్టెంట్స్‌కు 14 కేంద్రాల్లో, నాన్ లాంగ్వేజ్‌కు 33 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. లాంగ్వేజ్ పండిట్స్ 3038, నాన్ లాంగ్వేజెస్‌కు సంబంధించి 7762 మంది పరీక్ష రాయనున్నారు. -
టెట్ కమ్ టీఆర్టీ ప్రారంభం
తొలిరోజు ప్రశాంతం నెల్లూరు (అర్బన్) : టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలో ఏర్పాటుచేసిన 9 కేంద్రాల్లో ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరిగింది. పరీక్షకు 2,142 మందికి గాను 1,913 మంది హాజరయ్యారు. 229 మంది గైర్హాజరయ్యారు. తెలుగు మీడియం అభ్యర్థులు 2,103 గాను 1,895 మంది, ఉర్దూ మీడియం అభ్యర్థులు 39 మందికి గాను 18 మంది పరీక్షకు హాజరైనట్లు డీఈఓ ఆంజనేయులు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు చాలామంది ముందే రోజే నగరానికి చేరుకున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులకు కొంతమేర ఇబ్బందులు తప్పాయి. కొందరు అభ్యర్థులు పరీక్షకు టైం అయిపోతోందని ఆఖరి నిమిషాల్లో హడావుడిగా కేంద్రాలకు చేరుకున్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో వికలాంగ అభ్యర్థులు, ఓ బాలింత సహాయకుల సాయంతో వచ్చి పరీక్ష రాశారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, డీఈఓలు డీకేడబ్ల్యూ, కృష్ణచైతన్య, వీఆర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరాతీశారు. నేడు లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు లాంగ్వేజ్ పండిట్స్‌కు పరీక్ష జరగనుంది. 2,985 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పీఈటీలకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలకు పరీక్ష జరగనుంది. 447 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. -
సజావుగా డీఎస్సీ
డీఎస్సీ-2014లో భాగంగా తొలి రోజు శనివారం గుంటూరులోని 17 కేంద్రాల్లో జరిగిన ఎస్జీటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,987 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు ఎడ్యుకేషన్ : డీఎస్సీ-2014లో భాగంగా ఉపాధ్యాయ అర్హత-నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ) శనివారం సజావుగా జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్న పరీక్షల్లో భాగంగా తొలి రోజు గుంటూరులోని 17 కేంద్రాల్లో జరిగిన ఎస్జీటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,987 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన 3,520 మంది అభ్యర్థుల్లో 533 మంది గైర్హాజరయ్యారు. డీఎడ్ పూర్తి చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు ఉన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడి నగరానికి చేరుకున్నారు. ఎస్జీటీ పరీక్షలకు ఏర్పాటు చేసిన కేంద్రాల చిరునామా కనుక్కోవడంలో పలువురు అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న అధికారుల ప్రకటనతో దూర ప్రాంతాల నుంచి వచ్చి కేంద్రాల చిరునామా తెలుసుకోవడంలో ఇబ్బం దులకు గురైన అభ్యర్థులు ఆందోళన చెందారు. జిల్లా అదనపు జేసీ వెంకటేశ్వరరావు, పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నేడు ఎల్పీటీ, పీఈటీ పరీక్షలు డీఎస్సీలో భాగంగా ఆదివారం భాషా పండిట్, పీఈటీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగే ఎల్పీటీ పరీక్షకు 3401 మంది, మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు 4 కేంద్రాల్లో జరిగే పీఈటీ పరీక్షలకు 780 మంది హాజరుకానున్నారు. -
టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
* మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ పరీక్షలు * 9,061 పోస్టుల భర్తీకి ‘టెట్ కమ్ టీఆర్టీ’ * షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా * డిసెంబర్ 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ * టెట్‌లో అర్హత సాధించినా పరీక్ష రాయాల్సిందే * నేడు నోటిఫికేషన్ జారీ * వెబ్సైట్లో జిల్లాలవారీగా ఖాళీలు, సిలబస్ వివరాలు వెల్లడించనున్న విద్యాశాఖ * ఐటీడీఏ, గురుకుల స్కూళ్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ * ఎస్జీటీ పోస్టులపై బీఈడీలకు నిరాశ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 9,061 టీచ ర్ పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11వ తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లను విడివిడిగా నిర్వహించగా ఈసారి రెండింటినీ కలిపి ‘టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంటు టెస్ట్’(టెట్ కమ్ టీఆర్టీ) పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు వివరించారు. 1,849 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 812 భాషా పండితుల పోస్టులు, 156 పీఈటీ పోస్టులు, 6,244 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని పోస్టులకు మాత్రమే ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. ఐటీడీఏ, గురుకులాలు తదితర స్కూళ్లలోని పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తాయన్నారు. టీచర్ పోస్టు ల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్ష ఫీజు, విధివిధానాలను అందులో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రొఫార్మాను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందవచ్చు. షెడ్యూల్‌తో పాటు సి లబస్, నిబంధనలు, మార్గదర్శకాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు వెబ్సైట్లో ఉంటాయి. కేటగిరీల ప్రకారం అర్హత మార్కులు టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలో ఓసీలు 60 శాతానికి పైగా, బీసీలు 50 శాతానికి పైగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతానికి పైగా మార్కులు సాధిస్తేనే టీచర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2012 తరువాత టీచర్ పోస్టుల భర్తీ జరగనందున వయోపరిమితి పెంచినట్లు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో ఐదేళ్లు సడలింపు ఉంటుందని, వికలాంగులకు 50 ఏళ్లుగా నిర్ధారించామన్నారు.గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారు సైతం ఈ పరీక్షలు రాస్తేనే టీచర్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం లభిస్తుందన్నారు.ఆదర్శ పాఠశాలల్లో 491 పీజీటీ నియామకాలు పూర్తి చేశామన్నారు. 498 టీజీటీ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులున్నందున భర్తీ చేయలేకపోయామని మంత్రి వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి అధర్‌సిన్హా, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ పాల్గొన్నారు. బీఈడీలకు మొండిచేయి ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల ముందునుంచి చెబుతూ వచ్చిన టీడీపీ సర్కారు ఆపేరిట టీచర్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తూ వచ్చింది. తమకు అవకాశం దక్కుతుందని ఆశపడ్డ బీఈడీ అభ్యర్ధుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. కేంద్రం అనుమతి ఇవ్వనందున బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పించలేకపోతున్నామని,అవి డీఈడీ అభ్యర్థులకేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇకనుంచి ఏటా భర్తీ చేపడతామన్నారు. వచ్చే ఏడాది బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. టెట్, టీఆర్టీ కింద ఒక్కటే పరీక్ష పత్రం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్, ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీఆర్టీ) కలిపి ఒకటే పరీక్ష, ఒకే ప్రశ్నపత్రం ఉంటుందని వివరించింది. టెట్, టీఆర్టీకి సంబంధించిన ప్రశ్నలు ఒక్క పరీక్షలోనే ఉంటాయంది. పరీక్ష పేపర్లో టెట్, టీ ఆర్టీలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలుంటాయా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాల విద్యాశాఖ గురువారం సాయంత్రం మరో ప్రకటన జారీచేసింది. ‘గతంలో టెట్ పరీక్షలో అర్హత సాధి ంచిన అభ్యర్ధులు కూడా తప్పనిసరిగా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షకు హాజరుకావాలి. టెట్‌లో అర్హత పొందిన వారికి 20 శాతం ప్రాధాన్యమిస్తారు. టెట్‌కమ్ టీఆర్టీలో వచ్చిన మార్కులతో పోల్చి ఏవి ఎక్కువైతే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు’ అని వివరించింది. డీఎస్సీలో మునిసిపల్, ఐటీడీఏ ఖాళీలు ఏవి?: యూటీఎఫ్ తాజాగా ప్రకటించిన డీఎస్సీ-2014లో మునిసిపల్ పాఠశాలలకు చెందిన 1,252, ఐటీడీఏలోని 314 ఖాళీలు ప్రకటించకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్రఅధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ముగ్గురు వినతులు చేయగా, ఖాళీలు సేకరించినా, ప్రభుత్వం వాటిని నోటిఫికేషన్లో ప్రకటించకపోవడాన్ని ఖండించారు. డీఈడీలకు మంచి చాన్స్! బీఈడీ అభ్యర్ధులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేయటంతో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పోటీ చాలా తగ్గనుంది. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 6,244 ఉండగా బీఈడీ వారికి ఎస్ఏ పోస్టులు 1,849 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో డీఈడీ పూర్తి చేసిన వారికన్నా బీఈడీ చేసిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. డీఈడీ చేసిన వారు 70 వేలమంది కన్నా ఎక్కువగా లేరని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదే బీఈడీలకు వచ్చే సరికి నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు.