టెట్టా.. టెట్‌ కమ్‌ టీఆర్టీనా? | Unemployed People Looking forward to TET | Sakshi
Sakshi News home page

టెట్టా.. టెట్‌ కమ్‌ టీఆర్టీనా?

Published Sat, Sep 14 2019 4:23 AM | Last Updated on Sat, Sep 14 2019 4:23 AM

Unemployed People Looking forward to TET - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్‌ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్‌ రిక్రూట్‌మెంట్‌తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్‌ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. 

టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి..
ఏటా రెండుసార్లు టెట్‌ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్‌ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్‌మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్‌ కమ్‌టీఆర్టీని పెట్టారు.

కాలపరిమితి ముగుస్తుండడంతో..
ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్‌లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్‌లలో అర్హత సాధించలేని వారు టెట్‌ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి 
తాము అర్హత సాధించి టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్‌ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం 
ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్‌ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్‌ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్‌ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి.

టెట్‌ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్‌ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్‌ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్‌సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను,  2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్‌1లో 40,688 మంది, పేపర్‌2లో 115510 మంది అర్హత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement