తొలిరోజు ప్రశాంతం
నెల్లూరు (అర్బన్) : టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలో ఏర్పాటుచేసిన 9 కేంద్రాల్లో ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరిగింది. పరీక్షకు 2,142 మందికి గాను 1,913 మంది హాజరయ్యారు. 229 మంది గైర్హాజరయ్యారు. తెలుగు మీడియం అభ్యర్థులు 2,103 గాను 1,895 మంది, ఉర్దూ మీడియం అభ్యర్థులు 39 మందికి గాను 18 మంది పరీక్షకు హాజరైనట్లు డీఈఓ ఆంజనేయులు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు చాలామంది ముందే రోజే నగరానికి చేరుకున్నారు.
విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులకు కొంతమేర ఇబ్బందులు తప్పాయి. కొందరు అభ్యర్థులు పరీక్షకు టైం అయిపోతోందని ఆఖరి నిమిషాల్లో హడావుడిగా కేంద్రాలకు చేరుకున్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో వికలాంగ అభ్యర్థులు, ఓ బాలింత సహాయకుల సాయంతో వచ్చి పరీక్ష రాశారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, డీఈఓలు డీకేడబ్ల్యూ, కృష్ణచైతన్య, వీఆర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరాతీశారు.
నేడు లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు పరీక్ష
ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు లాంగ్వేజ్ పండిట్స్‌కు పరీక్ష జరగనుంది. 2,985 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పీఈటీలకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలకు పరీక్ష జరగనుంది. 447 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు.
టెట్ కమ్ టీఆర్‌టీ ప్రారంభం
Published Sun, May 10 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement