డీఎస్సీ-2014లో భాగంగా తొలి రోజు శనివారం గుంటూరులోని 17 కేంద్రాల్లో జరిగిన ఎస్జీటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,987 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : డీఎస్సీ-2014లో భాగంగా ఉపాధ్యాయ అర్హత-నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ) శనివారం సజావుగా జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్న పరీక్షల్లో భాగంగా తొలి రోజు గుంటూరులోని 17 కేంద్రాల్లో జరిగిన ఎస్జీటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,987 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన 3,520 మంది అభ్యర్థుల్లో 533 మంది గైర్హాజరయ్యారు. డీఎడ్ పూర్తి చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు ఉన్నారు.
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడి నగరానికి చేరుకున్నారు. ఎస్జీటీ పరీక్షలకు ఏర్పాటు చేసిన కేంద్రాల చిరునామా కనుక్కోవడంలో పలువురు అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న అధికారుల ప్రకటనతో దూర ప్రాంతాల నుంచి వచ్చి కేంద్రాల చిరునామా తెలుసుకోవడంలో ఇబ్బం దులకు గురైన అభ్యర్థులు ఆందోళన చెందారు. జిల్లా అదనపు జేసీ వెంకటేశ్వరరావు, పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
నేడు ఎల్పీటీ, పీఈటీ పరీక్షలు
డీఎస్సీలో భాగంగా ఆదివారం భాషా పండిట్, పీఈటీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగే ఎల్పీటీ పరీక్షకు 3401 మంది, మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు 4 కేంద్రాల్లో జరిగే పీఈటీ పరీక్షలకు 780 మంది హాజరుకానున్నారు.
సజావుగా డీఎస్సీ
Published Sun, May 10 2015 2:30 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement