'మా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజు చెల్లించాలి'
ఈ ఏడాది డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో పది వేల టీచర్ల పోస్ట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బుధవారం గంటా హైదరాబాద్లో మాట్లాడుతూ... టెట్ను రద్దు చేస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం గందరగోళంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్ను బలిచేయవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి గంటా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండగా స్థానికతను వివాదం చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని గంటా డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్పై సీమాంధ్ర విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. జూలై 4వ తేదీన అల్లూరి జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే మానవహక్కులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని గంటా తెలిపారు.