ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయుల బదిలీలు, ఆదర్శ పాఠశాలలపై ఉత్కంఠ నెలకొంది. తొలుత బుధవారం టీచర్ల బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వస్తుందని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యాశాఖాధికారులు రోజంతా ఎదురు చూశారు. కానీ రాత్రి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో గురువారం ఏదో ఒక నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయానికొచ్చారు. జిల్లాలో 3,321 ప్రాథమిక పాఠశాలలున్నాయి.
ఏజెన్సీ ప్రాంతంతో పాటు వాగులు, వంకలు, గెడ్డలు, రైల్వే ట్రాకులకు దగ్గరగా ఉన్న స్కూళకు, మైనార్టీ, ఎయిడెడ్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు హేతుబద్ధీకరణ నుంచి మినహాయింపునిచ్చింది. ఇవన్నీ పోగా 2,600 స్కూళ్లున్నాయి. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు పరిధిలో రెండుకు మించి పాఠశాలలుంటే అందులో 80 మంది పిల్లలున్న స్కూలుని మోడల్‌గా గుర్తించి, రెండో పాఠశాలలను మూసివేస్తారు. అందులో పిల్లలను మోడల్ స్కూల్‌కు బదలాయిస్తారు.
ఇలా జిల్లాలో 162 ప్రైమరీ స్కూళ్లు మూతపడనున్నాయి. వీటితో పాటు కిలోమీటరు లోపు, 80 మందికిపైగా విద్యార్థులున్న 142 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చనున్నారు. అలాగే 80 కంటే తక్కువ హాజరున్న బడులను పాజిటివ్ కన్సాలిడేషన్ స్కూళ్లుగా నడపనున్నారు. వీటిలో 30 మంది పిల్లలకు ఒకరు, 60 మంది ఉంటే ఇద్దరు చొప్పున టీచర్లను కేటాయిస్తారు. ప్రైమరీ మోడల్ స్కూల్లో మాత్రం 20 మందికి ఒకరు చొప్పున 80 మందికి నలుగురు టీచర్లను నియమిస్తారు.
12న విజయవాడలో డీఈఓలతో మంత్రి గంటా భేటీ
విజయవాడలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలతో టీచర్ల బదిలీలు, సీనియారిటీ, విద్యార్థుల ఆధార్ సీడింగ్, పాఠశాలల్లో మరుగుదొడ్ల ప్రగతి తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 12న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఒక అభిప్రాయానికొచ్చే దాకా బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా మంగళవారం నాటికి ఉన్న ఆదేశాల మేరకు 2013లో బదిలీ అయి రిలీవ్ కాని 33 మంది స్కూల్ అసిస్టెంట్లు, 124 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆయా స్కూళ్లలో బుధవారం చేరాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేని కారణంగా ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది.