బట్టీ చదువులే..!
- కానరాని సృజనాత్మకత..
- గైడ్లపైనే ఆధారపడుతున్న విద్యార్థులు
- సామర్థ్యాల ఆధారంగా మార్కులు శూన్యం
- నీరు గారుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం
- పర్యవేక్షణ బృందాల తనిఖీల్లో తేలిన నిజం
- నేటినుంచి సీసీఈపై రెండోవిడత మానిటరింగ్
‘చదువనేది నిరంతర ప్రక్రియ. ఒక పరీక్షతోనే ఎంత నేర్చుకున్నారో నిర్ణయించడం సాధ్యం కాదు. ప్రతి విషయంలో విద్యార్థి సాధించాల్సిన
సామర్థ్యాలు.. నాయకత్వ లక్షణాలు.. ఆరోగ్యం.. కళాత్మక విద్య.. పనిని.. తెలుసుకుంటూ వాటిని అభివృద్ధి చేస్తూ సరిదిద్దడానికి ఉపయోగపడేదే నిరంతర సమగ్ర మూల్యాంకనం.’ కాని క్షేత్రస్థాయికి వెళ్తే ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన సీసీఈ అవగాహన లోపంతో గాడితప్పుతోంది. బట్టీ విధానానికి స్వస్తిపలికి సొంత మాటల్లో జవాబులు రాసేలా విద్యార్థిని తీర్చిదిద్దాలన్న నూతన విధానం ఇంకా ఆచరణకు నోచుకోవడంలేదని పర్యవేక్షణ బృందాలు ఇచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర సమగ్రవిధానంపై కొంతమంది టీచర్లకు ఇప్పటికీ అవగాహన లేదన్న నిజం విద్యాశాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. – పాపన్నపేట
విద్యావిధానంలో సంస్కరణలు తేవాలన్న లక్ష్యంతో 2012–13లో 1 నుంచి 8 వ తరగతి వరకు, 2014–15లో 9,10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు నిర్మాణాత్మక మాల్యాంకనం (పార్మెటివ్ అసెస్‌మెంట్) సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్ అసెస్‌మెంట్) నిర్వహించాల్సి ఉంటుంది.‘ఎఫ్ ఏ ’కు 20 మార్కులు, ‘ఎస్ ఏ’కు 80 మార్కులు ఉంటాయి. జిల్లాలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన 21 మానిటరింగ్ బృందాలు జనవరి 5 నుంచి 10 వ తేదివరకు 187
► ప్రభుత్వ, 42 ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా టీంలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
► సామర్థ్యాలపై ఉపాధ్యాయులందరికీ ఇంకా అవగాహన కలగలేదు.
► విద్యార్థులు హోం వర్కులను స్వయంగా రాయకుండా గైడ్‌లను అనుసరిస్తున్నారు.
► సొంత మాటల్లో రాయలేక పోతున్నారు.
► హోంవర్కులను టీచర్లు సరిగ్గా కరెక్షన్ చేయడంలేదు. చేసిన దగ్గర ప్రతి ఫార్మెటివ్‌కు ఎన్ని మార్కులు కేటాయించారో తెలపాలి.
► పుస్తకంలోని ప్రశ్నలు పరీక్షలో రావని తెలిసినా విద్యార్థులు కొత్తప్రశ్నలు తయారు చేయలేక పోతున్నారు.
► సామర్థ్యాల ఆధారంగా మార్కులు కేటాయిండం లేదు.
► సామర్థ్యాలను నిర్ణీత నమూనాలో నిర్వహించలేకపోతున్నారు.
► నిరంతర సమగ్ర మూల్యాంకనం సృజనాత్మకతను పెంచేదిగా ఉండాలి. కాని అది జరగడం లేదు.
► గ్రేడ్‌ల విభజన పై అవగాహన లేదు.
► క్యుమ్యులేటివ్ రికార్డులు సరిగా ఉండటం లేదు.
► ఫార్మటివ్ లోని సామర్థ్యాలను విద్యార్థులందరు వైవిద్యాన్ని చూపకుండా, ఒకేలా రాస్తున్నారు.
► ఫార్మాటివ్‌లు సమ్మెటివ్‌లను ప్రభావితం చేయడం లేదు.
► స్లిప్‌టెస్టును ముందుగానే ప్రకటించి యూనిట్‌టెస్టులా నిర్వహిస్తున్నారు.
► చాలా పాఠశాలల్లో లైబ్రరీ, ల్యాబ్‌లు లేవు.