బతుకు చూపించే వాడే బడి పంతులు!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఒకప్పుడు బతకడానికి బడిపంతులు అనేవారని.. అయితే ఈరోజు బతుకు చూపించేవాడు బడిపంతులు అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర శివారులోని ఎంజీఎం ఫంక్షన్ హాలులో ప్రాంతీయ విద్యా సదస్సు మంగళవారం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ అధికారులు, ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకమన్నారు.
కొన్ని చోట్ల ఎక్కువమంది టీచర్లు తక్కువమంది విద్యార్థులు, మరి కొన్నిచోట్ల తక్కువ మంది టీచర్లు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దీనికి రేషనలైజేషన్ చేపట్టి నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని తెలిపారు. అంతేకాని ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. ప్రభుత్వ విద్య అమలులో కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, అలాంటి వృత్తికి వన్నె తేవాలని ఆకాంక్షించారు.
ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ మొక్కలు నాటాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ మార్పు టీచర్ల చేతుల్లో ఉందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల సాధనకు హెచ్‌ఎంలు ఈసారి బాగా కష్టపడ్డారన్నారు.
93 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషమే అయినా...తక్కిన ఏడు శాతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుదామని ప్రశ్నించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సొంతబడిగా భావించి బాధ్యతగా పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు మరుగుదొడ్లు కావాలని అడుగుతున్నా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు, హెచ్‌ఎంలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ యామినిబాల, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రమణకుమార్ పాల్గొన్నారు.