నేటి నుంచి ఈనెల 14లోగా సర్దుబాటు పూర్తి చేయాలని ఆదేశం
టీచర్ల అభిప్రాయాలు తీసుకుని, కొత్త మార్గదర్శకాలు ఇచ్చామన్న సర్కారు
పాతవాటినే కొత్తగా ఇచ్చారంటున్న ఉపాధ్యాయ సంఘాలు.. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ మార్గదర్శకాలు..
» ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు (ఎస్‌ఏ), ఎస్‌జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి
» అర్హత గల మిగులు ఎస్‌జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్‌లో సర్దుబాటు చేస్తారు
» ఒక స్కూల్‌లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్‌ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు
» ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు
» యూపీ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తరగతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు.
» కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు
» ఎస్‌ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు
రెండు దశల్లో సర్దుబాటు
కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్‌మెంట్ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.
ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇంటర్ మేనేజ్‌మెంట్ కింద రెండో దశలో డివిజన్ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్జెక్టు ఉన్నవారికి అదే డివిజన్‌లో, డివిజన్‌లోని ఇంటర్ సబ్జెక్ట్, ఎస్‌జీటీలను డివిజన్ పరిధిలో స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. కేడర్ సీనియారిటీలో అత్యంత జూనియర్‌ను మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు. ఎక్కడ సబ్జెక్టు టీచర్, ఎస్‌జీటీలు లేరో ఆ స్కూల్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
పాత నిబంధనలే కొత్తగా
పాఠశాల విద్యా శాఖ ఆదివారం ప్రకటించిన మార్గదర్శకాల్లో ‘కేడర్ సీనియారిటీ’ మినహా మిగిలినవన్నీ పాతవే. తొలుత ఈనెల 9న ఒకసారి మార్గదర్శకాలు విడుదల చేయగా, ఉపాధ్యాయవర్గాలు పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. పలు సూచనలు చేశాయి. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
సోమవారం సర్దుబాటు ప్రక్రియ చేపట్టనుండగా ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో అన్నీ పాతవే ఉన్నాయి. వాటినే కొత్తగా ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, మరెందుకు చర్చలకు పిలిచారని ప్రశి్నస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment