పక్కాగా పర్యవేక్షణ
-
పాఠశాలల పనితీరుపై సాంకేతిక నిఘా
-
క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ ట్యాబ్‌లలో నిక్షిప్తం
-
అవినీతి రహిత చర్యల నిరోధానికి విద్యాశాఖ అడుగులు
బాలాజీచెరువు (కాకినాడ) :
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని గుర్తించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షించి పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్‌లో పొందుపరచి వాటిని జిల్లా అధికారులలు పరిశీలించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారులకు ట్యాబులు పంపిణీ చేసి వారి నుంచి అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలు, సమస్యలుస వివరాలను తెలుసుకుంటున్నారు. లోపాలున్న చోట జిల్లా అధికారులు స్పందించేలా చర్యలు చేపట్టారు.పాఠశాల పనితీరు పర్యవేక్షణకు ఈ విధానం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విద్యాంజలి యాప్..
విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఇంటర్‌నెట్‌లో నిక్షిప్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖ, ఏస్‌ఏస్‌ఏ సంయుక్తంగా విద్యాంజలి యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ సమయానికి హాజరౌతున్నారు, మ«ధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థుల సామర్థ్యాలు ఇందులో పొందుపరుస్తారు. జిల్లా అధికారులు ఎక్కడి నుంచైనా వాటిని సమీక్షించే అవకాశం ఉంది. ట్యాబుల్లో స్కైప్‌ను డౌన్‌లోడ్ చేసి వీడియోకాల్ ద్వారా హెచ్‌ఎంలతో మాట్లాడేలా చర్యలు చేపట్టారు. తద్వారా విద్యాశాఖ తీరును గాడిలో పెట్టి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో..
జిల్లాలో సర్వ శిక్షాభియాన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల హెచ్‌ఎంలు, కేజీబీ వీల ప్రత్యేక అధికారులు, ఆదర్శ, కేజీవీబీ ప్రత్యేక అధికారులకు ట్యాబ్‌లను అందజేశారు. వీరు ఎప్పటికప్పుడు వారికి అందిన సమాచారంతో సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సరిచేయాలన్న లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడుతుంది
మండల స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక పాఠశాలల అధికారులకు ట్యాబ్‌లు ఇవ్వడం ద్వారా పాఠశాలల పనితీరు ఎప్పటికప్పుడు గమనించి లోపాలుంటే సరిచేయవచ్చు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పర్యవేక్షించే పనిలేకుండా ఈ ట్యాబ్‌లో ఉన్న డేటా ఆధారంగా చర్యలు చేపట్టవచ్చు. - టీవీజే కుమార్. సర్వశిక్షా అభియాన్ ఇన్‌చార్జి పీఓ