మినీ మహానాడులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా
కడప రూరల్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక మేడా కన్వర్షన్‌లో నిర్వహించిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కార్యకర్తలు సూచించిన పనులను అధికారులు చేయాలన్నారు.
మినీ మహానాడులో ఆయా నియోజకవర్గాల వారీగా వచ్చిన సమస్యల పరిష్కారం గురించి హైదరాబాద్‌లో జరిగే మహానాడులో చర్చిస్తామన్నారు. విభజన కారణంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కడప నగరంలో ఒక ఎకరా స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చేయూత నివ్వాలన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు సుధాకర్ యాదవ్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, విజయమ్మ తదితరులు మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగే మహానాడులో జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను అధికారులు గౌరవించాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, జిల్లా పేరును గతంలోలా ‘కడప’గానే ఉంచాలని, మైదుకూరులో కేపీ ఉల్లి ఎగుమతి కేంద్రం ఏర్పాటు, చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని, రాజంపేటలో ఆల్సిన్ ఫ్యాక్టరీని తెరిపించాలని, కమలాపురంలో డ్రైనేజీ వ్యవస్థ, రైల్వేకోడూరులో మినీ ప్రాజెక్టుల నిర్మాణం, బద్వేలులో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు పలు ప్రతిపాదనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బహ్మయ్య, గోవర్దన్‌రెడ్డి, ఎద్దుల సుబ్బరాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీకి పూర్వ వైభవం
Published Mon, May 25 2015 3:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement