inter 1st year
-
‘నారాయణ’ కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
మీర్‌పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి, టార్చర్ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు. ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. -
ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!
కోదాడ (సూర్యాపేట): ఇంటర్ ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రాల బండిల్ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు. గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది. దీంతో బల్క్ సెంటర్ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. -
ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్‌తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్‌కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్‌కు పంపగలంఅని ఇంటర్ బోర్డ్ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి. స్పాట్‌కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ముదురుతున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఇక చర్యలు తప్పవు మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్ కాలేజీలు రిలీవ్ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. –ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆందోళన తప్పదు మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. –మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ అధ్యాపకులే లేరు.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో? –అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
మళ్లీ మనమే టాప్
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ► బాలికలదే హవా ► వరుసగా 11 సార్లు మొదటిస్థానం ► జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత లబ్బీపేట : జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తమ హవా కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పదేళ్లు అగ్రస్థానంలో ఉన్న జిల్లా విద్యార్థులు.. నవ్యాంధ్రలోను మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్‌లో జిల్లాకు ఎదురులేదని నిరూపించారు. విజయవాడ విద్యలవాడగా తన పేరు నిలబెట్టుకుంటూ విజయపరంపర కొనసాగి స్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంట ర్మీడియెట్ మొదటి సంవత్సర ఫలితాలను తొలిసారిగా నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నూతన ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తన అగ్రస్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 62.98 శాతం ఉండగా దాదాపు 13 శాతం ఎక్కువగా అంటే 76 శాతం ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఇది గత ఏడాది కంటే రెండు శాతం అధికం కావడం విశేషం. గత సంవత్సరం జిల్లా విద్యార్థులు 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఈ సంవత్సరం 63,164 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47,989 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 33,702 మంది బాలురు పరీక్షలు రాయగా 25,039 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 74 శాతంగా ఉంది. బాలికలు 29,462 మంది పరీక్షలు రాయగా 22,950 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 78 శాతంగా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాది 75 శాతం ఉండగా, ఈ ఏడాది 78 శాతానికి పెరగడం విశేషం. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు రాసిన 1,126 మందిలో 544 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత 48 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత 55 శాతం ఉండగా, ఈ ఏడాది ఏడు శాతం తగ్గింది. జిల్లాలో టాపర్లు వీరే ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ టాప్ ర్యాంకులు జిల్లాకు రాకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో ఎక్కువ మంది నిలిచారు. వారిలో ఎంపీసీలో ఎం.శర్వాణి 466/470 సాధించి జిల్లాలో టాపర్‌గా నిలవగా, చీమకుర్తి సాయి వరుణ్, వెనిగళ్ల మౌనిక, గుంటూరు సౌమ్య, మద్దాల నాగసాయి శ్రీ హరీష్‌లు 464/470 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో మహ్మద్ అర్బాజ్, మర్రెడ్డి మేఘనారెడ్డి, కోడూరు సాయి యామిని, పెద్దిరెడ్డి గ్రీష్మబిందు, కూసమ్ వెంకట రాహుల్‌రెడ్డి, సయ్యద్ ఆయేషా, పి.లక్ష్మీ పూజిత, కొట్టా గాయత్రి సాయి గీతాంజలి 436 మార్కులతో జిల్లాలో టాపర్లుగా నిలిచారు. అదే విధంగా పి.చాంద్‌బాషా, బొడ్డపాటి దేవనందినిలు 435 మార్కులు సాధించగా, ఆచంట శ్రీలాస్య, శ్రీ తేజకృష్ణలు 434 మార్కులు సాధించారు. కాగా శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపీసీలో ఒకరు 466 మార్కులు సాధించగా, 11 మంది 465 మార్కులు, 45 మంది 464 మార్కులు, 530 మంది 460 మార్కులు సాధించారు. బైపీసీలో 436 మార్కులు ఇద్దరు సాధించగా, 435 మార్కులు 12 మంది, 434 మార్కులు 44 మంది, 428 మార్కులు 428 మంది సాధించి సత్తా చాటారు. కాగా గడిచిన ఐదేళ్లలో జిల్లాలో అత్యధికంగా 76 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ప్రభుత్వ కాలేజీల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైతం ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది 37.8 శాతం ఉండగా, ఈ ఏడాది 45 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే 2013లో జిల్లాలో ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం 46.1గా ఉంది.