
సాక్షి,విజయవాడ: ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్‌కు పరీక్షలను నిర్వహించకూడదని, నేరుగా రెండో సంవత్సరంలోనే పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. అయితే..
ఈ నిర్ణయం అందరి ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారామె. ఈ విషయమై తల్లిదండ్రులు తమ అభిప్రాయం తెలపాలని, వాళ్లు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అన్నారామె. ఇందుకోసం జనవరి 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఏకాభిప్రాయం కుదిరితే గనుక వచ్చే విద్యా సంవత్సరం(2025-26 ) నుంచి నుంచి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ప్రవేశ పెడతామని కృతికా శుక్లా తెలిపారు.
ఇక.. ఇంటర్ బోర్డు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకపోయినప్పటికీ.. ఆయా కాలేజీలు ఇంటర్నల్‌గా ఎగ్జామ్స్ నిర్వహిస్తాయని తెలిపారామె. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందన్నారు.
‘‘దాదాపు 15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం. అలాగే పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తీసుకొస్తాం. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుంది.’’ అని అన్నారామె.