ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు? | Govt Colleges Faculty Strongly Opposed For Not Attending Private Lecturer For Inter Evaluation Telangana | Sakshi

ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?

Published Sat, Nov 13 2021 2:55 AM | Last Updated on Sat, Nov 13 2021 2:20 PM

Govt Colleges Faculty Strongly Opposed For Not Attending Private Lecturer For Inter Evaluation Telangana - Sakshi

తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్‌ వాల్యుయేషన్‌ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్‌తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్‌ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్‌కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్‌కు పంపగలంఅని ఇంటర్‌ బోర్డ్‌ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి.

స్పాట్‌కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.  

ముదురుతున్న వివాదం 
రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్‌ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్‌ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్‌ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్‌ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్‌ వాల్యుయేషన్‌ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు.


 ఇక చర్యలు తప్పవు
మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలు రిలీవ్‌ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. 
–ఒమర్‌ జలీల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి

ఆందోళన తప్పదు
మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్‌ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం.  
–మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్‌
 
అధ్యాపకులే లేరు..
స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో?
–అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement