చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ.. | Telangana Inter Results 2023 Govt Colleges Poor Students Talent | Sakshi
Sakshi News home page

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు.. సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు

Published Wed, May 10 2023 7:59 AM | Last Updated on Wed, May 10 2023 1:11 PM

Telangana Inter Results 2023 Govt Colleges Poor Students Talent - Sakshi

హుజూర్‌నగర్‌/మంచిర్యాల అర్బన్‌/సాక్షి, హైదరాబాద్‌: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్‌ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్‌వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్‌ సురేంద్ర కుమార్‌ పెయింటర్‌ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. 

కూలీ బిడ్డ... 
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్‌తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌లో మల్టీ పర్పస్‌హెల్త్‌ వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్‌ ఫలితాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. 

అత్యధికం 994! 
ఇంటర్‌లో 994 మార్కులు టాప్‌ర్యాంక్‌గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్‌ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్‌కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్‌కు చెందిన పి.రాజేశ్‌ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్‌ బోర్డ్‌ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. 

► నిజామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. 
► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్‌ వర్ష (బైపీసీ), సీహెచ్‌ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు.  
► ఖమ్మంలోని ఏఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది.  
► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి.  
► నిర్మల్‌ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్‌ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్‌ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్‌ 462/470 మార్కులు సాధించింది.
చదవండి: అమ్మాయిలదే హవా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement