Private lecturers
-
ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్‌తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్‌కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్‌కు పంపగలంఅని ఇంటర్ బోర్డ్ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి. స్పాట్‌కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ముదురుతున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఇక చర్యలు తప్పవు మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్ కాలేజీలు రిలీవ్ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. –ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆందోళన తప్పదు మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. –మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ అధ్యాపకులే లేరు.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో? –అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
రోడ్డున పడ్డ టీచర్లు, లెక్చరర్లు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆ కాలనీలో అపార్ట్మెంటు వాచ్మెన్ చులకనగా మాట్లాడి పంపాడు.. మరో చోట కనీసం మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకుండా వెళ్లిపొమ్మన్నారు..’ఇవీ పలువురు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు ఓ చోట కలసి చెప్పుకొంటున్న బాధలు. వాస్తవానికి ఇప్పుడు వారికి వేసవి సెలవులు. కానీ వారంతా కాళ్లరిగేలా వీధి వీధి తిరుగుతున్నారు. ఎందుకంటే కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు పెట్టిన టార్గెట్ల వల్లే. వేసవిలో నెల జీతం రావాలంటే.. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో చేసేది లేక కొత్త పిల్లలను స్కూళ్లల్లో చేర్పించేందుకు రోడ్డున పడుతున్నారు. అసలు కారణం ఇదే! ప్రైవేటు టీచర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. రూ.8 వేల నుంచి మొదలవుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి విద్యాపరంగా బాగా పేరున్న ప్రాంతాల్లో మహా అయితే రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు. అది కూడా 10 నెలలకే. ఇంకొందరు 11 నెలలు ఇస్తారు. ఇక 12వ నెల జీతం కూడా రావాలంటే.. ఏప్రిల్, మేలో స్కూలు పరిసర కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ కాన్వాసింగ్ చేయాలి. ఇందుకు ఓ బస్సు ఏర్పాటు చేస్తారు. ఏ ఏరియాలో తిరగాలో లిస్టు ఇస్తారు. అపుడు టీచర్లంతా.. చిన్నారులున్న ఇళ్లను గుర్తించి, వారి ఫోన్ నంబర్లు సేకరించాలి. ఆ పిల్లలు స్కూలుకు లేదా కాలేజీకి వచ్చే వరకు వారికి రోజూ ఫోన్లు చేసి గుర్తు చేస్తుండాలి. అయితే టార్గెట్లు పూర్తి కాకపోతే వారికి 12వ నెల జీతం రాదు. ఒక్కోసారి ఉద్యోగం ఊడిపోవచ్చు కూడా. ఇంత చదువు చదివినా తమకన్నా ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల బతుకులే మేలని టీచర్లు, జేఎల్‌లు వాపోతున్నారు. జేఎల్ పరిస్థితి మరీ దారుణం! పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు జూనియర్ లెక్చరర్ల (జేఎల్)ను వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. తమకు తెలిసిన స్కూళ్లలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఫోన్ నంబర్లు, చిరునామాలు తీసుకుని వారి ఇంటికెళ్లి తమ కాలేజీలో చేరాలని వారి వెంటపడాలి. తల్లిదండ్రులు చీదరించినా, ఛీ కొట్టినా పట్టు వదలని విక్రమార్కుల్లా పొట్టకూటి కోసం ప్రతీ ఇల్లు తిరగాల్సిన దుస్థితి. రూ.10వేల లోపు వేతనాలు ఇస్తూ.. కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా 10 గంటలకు పైగా పనులు చేయించుకుంటున్నారు. వారికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు. పీజీ, బీఈడీ చేసినా ఇంతే! చాలామంది టీచర్లలో బీఈడీ, పీజీలు పూర్తి చేసిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ (టెట్), స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (సెట్) కూడా పాసయ్యారు. టీచర్లకు, లెక్చరర్లకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ఏ యాజమాన్యం కూడా వీరికి కనీస వేతనం అమలు చేయడానికి ముందుకు రావట్లేదు. పోనీ 10 గంటలు పనిచేశాక అయినా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అదీ లేదు. డెయిలీ టెస్టుల పేరుతో కూడా వారిని పేపర్ వాల్యూయేషన్, ఆబ్సెంట్ అయిన విద్యార్థి ఇంటికి ఫోన్లు చేస్తూ ఇంటికి వెళ్లాక కూడా కాలేజీ, స్కూలు కోసం పనిచేసేలా చేస్తున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఏదీ? రాష్ట్రంలో జేఎల్‌లుగా పనిచేసే చాలామంది పట్టభద్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మహిళా లెక్చరర్లు, టీచర్లు సాధింపులు, లైంగిక వేధింపులను దిగమింగుకుని బతుకుతున్నారు. ఇష్టానుసారంగా కాలేజీ వేళలు మార్చేస్తారు. ఆడవారని కూడా చూడకుండా క్యాంపస్‌లలో రాత్రిపూట ఉండాలని హుకూం జారీ చేస్తారు. పెళ్లయి, పిల్లలున్నా సరే కనికరం చూపరు. పండుగలు, పబ్బాలు, వేసవి సెలవుల్లోనూ పని చేయించుకుంటారు. ఎదురుమాట్లాడితే.. మర్నాడే ఉద్యోగం ఊడుతుంది. దీంతో బతుకు ఆగం అవుతుందని భయంతో అన్నింటినీ భరిస్తూ పోతున్నారు. కనీసం ఉద్యోగం నుంచి తీసేశాక పీఎఫ్ కూడా వారికి రాదు. పిల్లలకు జ్వరమొస్తే.. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్ఐ లేకపోవడంతో ఆరోగ్య భద్రత ఉండట్లేదు. పిల్లలకు మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే.. వారి బతుకు ఇంకా దయనీయంగా మారుతుంది. భార్యాపిల్లలకు వైద్యం చేయించేందుకు అప్పుల పాలవుతున్నారు. ఇక వారే రోడ్డు ప్రమాదాల బారిన పడితే.. వారి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. -
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేట్ టీచర్లు , లెక్చరర్లు
-
మా గోడు ఎవరికీ పట్టదా ?
కడప సెవెన్‌రోడ్స్ : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయుల, అధ్యాపకుల శ్రమను దోపిడీ చేస్తున్నా ప్రభుత్వానికి పట్ట డం లేదని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, లెక్చరర్ల యూనియన్ నాయకులు విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా శనివా రం కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు పనిభారం విపరీతంగా ఉం దని తెలిపారు. ఆదివారం, రెండో శనివారం, జాతీయ సెలవు దినాలు తమకు విద్యా సంస్థలు వర్తింప చేయడం లేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సైతం సమయం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 10 గంటలు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నప్పటికీ, వేతనాలు మాత్రం అరకొరగానే ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చే వేతనా లను తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక పనిగంటలకు ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. జీఓ నంబరు 1ని అమలు చేయాలని చేయాలన్నారు. తమకు చట్టపరంగా లభించాల్సిన పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలను యాజమాన్యాలు కల్పించడం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దపాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే తమ ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల తాము పొట్ట కూటికోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేయాల్సిన దుర్గతి దాపురించిందన్నా రు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆర్సీపీ నాయకుడు నరసింహా, ఆర్టీయూ నాయకులు గంగన్న, సుబ్బయ్యలు సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు రాజు, రాయపురెడ్డి, బాబానుబాష, వెంకటేష్ పాల్గొన్నారు. -
జూనియర్ లెక్చరర్లకూ బీఎడ్!
♦ కసరత్తు చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ♦ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన హెచ్ఆర్డీ కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల్లో బోధించే లెక్చరర్లు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) చేసి ఉండాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని చెబుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో (సీబీఎస్ఈ) 11, 12 తరగతులైనా, వాటికి సమానంగా తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఇంటర్ విద్య అయినా పాఠశాల విద్యలో భాగమే. సీబీఎస్సీలో 11, 12 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు బీఎడ్ తప్పనిసరిగా ఉన్నపుడు ఇంటర్‌కు బోధించే అధ్యాపకులకూ బీఎడ్ అవసరమే. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలన జరుపుతోంది. అన్ని రాష్ట్రాల్లో 11, 12 తరగతులకు, ఇంటర్‌కు కామన్ సిలబస్, ఒకే రకమైన పరీక్షా విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఇంటర్ బోధించే లెక్చరర్లకు కూడా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) తరహాలో మరేదైనా అర్హత పరీక్షను ప్రవేశ పెట్టాలన్న అంశాలను పరిశీలిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యా కార్యదర్శి సుభాష్‌చంద్ర కుంతియా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యతో భేటీ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, 3,750 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 1,800 మంది రెగ్యులర్, మినిమమ్ టైం స్కేల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2,850 ప్రైవేటు జూనియర్ కాలే జీల్లో దాదాపు 50 వేల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపికై పని చేస్తున్నారు. ఇక కాంట్రాక్టు లెక్చరర్లు, ప్రైవేటు లెక్చరర్లుగా ఎలాంటి పరీక్ష లేకుండా నియమితులవుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇంటర్.. పాఠశాల విద్యలో భాగంగా లేదని, ఉన్నత విద్యలో భాగం గా కొనసాగుతోందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పైగా ఇందులో ఉపన్యాస పద్ధతిలో (లెక్చర్ మెథడ్) బోధన విధానం ఉందని తెలిపారు. అలాంటప్పుడు బీఎడ్ ఉండాలనేది సరికాదని, నెట్, సెట్ తరహాలో ఏదైనా అర్హత పరీక్ష ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.