ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ‘ఆ కాలనీలో అపార్ట్‌మెంటు వాచ్‌మెన్ చులకనగా మాట్లాడి పంపాడు.. మరో చోట కనీసం మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకుండా వెళ్లిపొమ్మన్నారు..’ఇవీ పలువురు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు ఓ చోట కలసి చెప్పుకొంటున్న బాధలు. వాస్తవానికి ఇప్పుడు వారికి వేసవి సెలవులు. కానీ వారంతా కాళ్లరిగేలా వీధి వీధి తిరుగుతున్నారు. ఎందుకంటే కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు పెట్టిన టార్గెట్ల వల్లే. వేసవిలో నెల జీతం రావాలంటే.. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో చేసేది లేక కొత్త పిల్లలను స్కూళ్లల్లో చేర్పించేందుకు రోడ్డున పడుతున్నారు.
అసలు కారణం ఇదే!
ప్రైవేటు టీచర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. రూ.8 వేల నుంచి మొదలవుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి విద్యాపరంగా బాగా పేరున్న ప్రాంతాల్లో మహా అయితే రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు. అది కూడా 10 నెలలకే. ఇంకొందరు 11 నెలలు ఇస్తారు. ఇక 12వ నెల జీతం కూడా రావాలంటే.. ఏప్రిల్, మేలో స్కూలు పరిసర కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ కాన్వాసింగ్ చేయాలి. ఇందుకు ఓ బస్సు ఏర్పాటు చేస్తారు. ఏ ఏరియాలో తిరగాలో లిస్టు ఇస్తారు. అపుడు టీచర్లంతా.. చిన్నారులున్న ఇళ్లను గుర్తించి, వారి ఫోన్ నంబర్లు సేకరించాలి. ఆ పిల్లలు స్కూలుకు లేదా కాలేజీకి వచ్చే వరకు వారికి రోజూ ఫోన్లు చేసి గుర్తు చేస్తుండాలి. అయితే టార్గెట్లు పూర్తి కాకపోతే వారికి 12వ నెల జీతం రాదు. ఒక్కోసారి ఉద్యోగం ఊడిపోవచ్చు కూడా. ఇంత చదువు చదివినా తమకన్నా ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల బతుకులే మేలని టీచర్లు, జేఎల్‌లు వాపోతున్నారు.
జేఎల్ పరిస్థితి మరీ దారుణం!
పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు జూనియర్ లెక్చరర్ల (జేఎల్)ను వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. తమకు తెలిసిన స్కూళ్లలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఫోన్ నంబర్లు, చిరునామాలు తీసుకుని వారి ఇంటికెళ్లి తమ కాలేజీలో చేరాలని వారి వెంటపడాలి. తల్లిదండ్రులు చీదరించినా, ఛీ కొట్టినా పట్టు వదలని విక్రమార్కుల్లా పొట్టకూటి కోసం ప్రతీ ఇల్లు తిరగాల్సిన దుస్థితి. రూ.10వేల లోపు వేతనాలు ఇస్తూ.. కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా 10 గంటలకు పైగా పనులు చేయించుకుంటున్నారు. వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు.
పీజీ, బీఈడీ చేసినా ఇంతే!
చాలామంది టీచర్లలో బీఈడీ, పీజీలు పూర్తి చేసిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ (టెట్), స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (సెట్) కూడా పాసయ్యారు. టీచర్లకు, లెక్చరర్లకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ఏ యాజమాన్యం కూడా వీరికి కనీస వేతనం అమలు చేయడానికి ముందుకు రావట్లేదు. పోనీ 10 గంటలు పనిచేశాక అయినా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అదీ లేదు. డెయిలీ టెస్టుల పేరుతో కూడా వారిని పేపర్ వాల్యూయేషన్, ఆబ్సెంట్ అయిన విద్యార్థి ఇంటికి ఫోన్లు చేస్తూ ఇంటికి వెళ్లాక కూడా కాలేజీ, స్కూలు కోసం పనిచేసేలా చేస్తున్నారు.
ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఏదీ?
రాష్ట్రంలో జేఎల్‌లుగా పనిచేసే చాలామంది పట్టభద్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మహిళా లెక్చరర్లు, టీచర్లు సాధింపులు, లైంగిక వేధింపులను దిగమింగుకుని బతుకుతున్నారు. ఇష్టానుసారంగా కాలేజీ వేళలు మార్చేస్తారు. ఆడవారని కూడా చూడకుండా క్యాంపస్‌లలో రాత్రిపూట ఉండాలని హుకూం జారీ చేస్తారు. పెళ్లయి, పిల్లలున్నా సరే కనికరం చూపరు. పండుగలు, పబ్బాలు, వేసవి సెలవుల్లోనూ పని చేయించుకుంటారు. ఎదురుమాట్లాడితే.. మర్నాడే ఉద్యోగం ఊడుతుంది. దీంతో బతుకు ఆగం అవుతుందని భయంతో అన్నింటినీ భరిస్తూ పోతున్నారు. కనీసం ఉద్యోగం నుంచి తీసేశాక పీఎఫ్ కూడా వారికి రాదు.
పిల్లలకు జ్వరమొస్తే..
ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్‌ఐ లేకపోవడంతో ఆరోగ్య భద్రత ఉండట్లేదు. పిల్లలకు మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే.. వారి బతుకు ఇంకా దయనీయంగా మారుతుంది. భార్యాపిల్లలకు వైద్యం చేయించేందుకు అప్పుల పాలవుతున్నారు. ఇక వారే రోడ్డు ప్రమాదాల బారిన పడితే.. వారి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment