private teachers
-
ప్రైవేట్ టీచర్లకు నగదు సాయమేది..!
సాక్షి, మంచిర్యాల: ప్రైవేట్ విద్యాసంస్థ బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే నగదు సాయంలో జాప్యం జరుగుతోంది. కరోనా అపత్కాలం కింద ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ప్రతీ నెల 20 నుంచి 22లోపు సాయం అందిస్తోంది. జూన్‌లో బియ్యం పంపిణీ చేసినా నగదు సాయం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. జూలై నెల ప్రారంభమైనా రాకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదురు చూడకతప్పడం లేదు. తొలివిడతలో 2115, మలివిడతలో 1500 మందికి ఈ సాయాన్ని అందిస్తూ వచ్చారు. తొలివిడతలో యూడైస్‌లో పేర్లు నమోదై ఉన్నవారికి మాత్రమే దక్కడంతో మిగిలిన వారిలో ఆందోళన మొదలైంది. బ్యాంకుల అనుసంధానంతో ఐఎఫ్ఎస్ నెంబర్లు మారడం.. కొందరు రేషన్‌కార్డు, దుకాణం నంబర్ల నమోదులో తప్పులు దొర్లడంతో సాయానికి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు సవరణలు చేసి డీఈవో కార్యాలయంలో అందజేశారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికార యంత్రాంగం డైస్లో నమోదు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వానికి నివేదించడంతో మిగిలిన వారందరికీ రెండో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి 25 కిలోలు, రూ.2వేల నగదు అందుతోంది. ప్రస్తుతం రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెలకు బియ్యం పంపిణీ చేసి నగదు రూ.2వేలు అందజేయకపోవడంపై ప్రైవేట్ ఉపాధ్యాయ, సిబ్బందిలో నిరాశ నెలకొంది. అధికారులు చోరవ తీసుకుని ప్రత్యక్ష బోధన జరిగే వరకు ఈసాయం అందించాలని కోరుతున్నారు. అపత్కాల భృతి అందించాలి కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రకటించిన అపత్కాల భృతి జూన్ నెలకు సంబంధించి రూ.2వేల నగదు ఉపాధాయులు, సిబ్బంది ఖాతాలో జమకాలేదు. ప్రభుత్వ సాయం రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అధికారుల తప్పిదం వల్ల చాలమంది ప్రీప్రైమరీ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, క్లీనర్లకు ఇప్పటివరకు అపత్కాల భృతి రాలేదు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – రాపోలు విష్ణువర్థన్‌రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సాయం అందించాలి ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకు అపత్కాల భృతి అందించాలి. మూడు నెలలకు సంబంధించి బియ్యం సకాలంలో అందించి, నగదు రూ.2వేలు రెండు నెలలు చెల్లించి, జూన్ మాసం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వం అందించే సాయం క్రమం తప్పకుండా అందించి ఆదుకోవాలి. – సుజాత, ఉపాధ్యాయురాలు చదవండి: ఏపీలో విద్య.. మహోన్నతం -
Private School Teachers: ప్రైవేట్ టీచర్లకు గురుదక్షిణ
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతోమంది బతుకు చిత్రం ఛిద్రమైంది. మహమ్మారి శాంతించిందనే తరుణంలోనే సెకండ్ వేవ్ రూపేణా విరుచుకుపడింది. విద్యారంగాన్ని కకావికలం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మళ్లీ మూతపడటంతో టీచర్లు, లెక్చరర్ల ఉపాధి అటకెక్కింది. వీరికి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ అది అందరికీ చేరట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నగరవాసి సుధీర్ బికుమాండ్ల ‘గురుదక్షిణ’ పేరుతో ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నిత్యావసర సరుకులను అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కలచివేసిన కష్టాలు.. ► అందరి భవిష్యత్‌కు మార్గదర్శకులు గురువులే. అలాంటి వారి జీవితాలు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారాయి. ఉన్నపళంగా ఉద్యోగాలు పోవడం, మళ్లీ చేర్చుకునే అవకాశాలు కనిపించకపోవడంతో దిక్కులేని పక్షులే అయ్యారు. ఈ తరుణంలో ఉగాది రోజున ‘గురుదక్షిణ’ కార్యక్రమం మళ్లీ మొదలుపెట్టారు సుధీర్ బికుమాండ్ల. ► ఇప్పటికే 800 మందికిపైగా ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు నిత్యావసర వస్తువులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సేవలను గతేడాది లాక్డౌన్లో ప్రారంభించి 2 వేల మందికిపైగా అందించినట్లు చెప్పారు. సెకండ్ వేవ్‌లో ఎందరో గురువులు కిరాణా షాపుల్లో పనిచేయడం, ఇంటింటికీ తిరిగి దినపత్రికలు వేయడం తనని కలచి వేసిందని, అందుకే తన అవసరాల కోసం దాచుకున్న లక్ష రూపాయలతో గురుదక్షిణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించానన్నారు. ► తను అందించే కిట్‌లో 20 కేజీల బియ్యం, పప్పులు, నూనె, రవ్వ, చక్కెర, చింతపండుతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. కర్మన్‌ఘాట్‌లోని ఇందిరా నాగేంద్ర థియేటర్ సమీపంలో ‘గురుదక్షిణ’ కేంద్రం ఉందని, అక్కడికి ప్రైవేట్ బోధనా సిబ్బంది ఎవరైనా సరే వచ్చి సరుకులు తీసుకోవచ్చని ఆయన సూచించారు. ► గురుదక్షిణ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తెలుసుకుని సుదూర ప్రాంతాల నుంచి టీచర్లు వస్తున్నారని వివరించారు. ముందుగానే ఉస్మానియా వర్సిటీ సహా పలు కాలేజీల్లో తిరిగి తన కార్యక్రమం గురించి వివరించినట్లు సుధీర్ బికుమాండ్ల చెప్పారు. (చదవండి: ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన కరోనా మహమ్మారి ) -
చితికిన జీవితం.. విద్యావలంటీర్ బలవన్మరణం
సాక్షి, నల్లగొండ క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఓ విద్యావలంటీర్ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో చోటుచేసుకుంది. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పాలకూరి శైలజ (30) భర్త అమరేందర్ సివిల్‌సప్లయ్ విభాగంలో అటెండర్‌గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం రెన్యువల్ కావాల్సి ఉండగా కాలేదు. దీంతో జీతం రావడం లేదు. శైలజ గతంలో విద్యావలంటీర్‌గా పని చేసేది. కరోనాతో ఏడాది కాలంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో విధుల్లోకి తీసుకోలేదు. ఇద్దరికీ వేతనాలు రావడం లేదు. ఆర్థికంగా చితికిపోవడంతో కుటుంబ జీవనం గడవడం దుర్భరంగా మారింది. భర్త ఆవేదనను భరించలేక శైలజ నల్లగొండలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. శైలజది ప్రభుత్వ హత్యే.. హైదరాబాద్: విద్యా వలంటీర్ శైలజది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్ షర్మిలమ్మ అనుచరురాలు ఇందిరాశోభన్ ఆరోపించారు. లోటస్‌పాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిలమ్మ బృందంలోని నాయకుడు పిట్టా రాంరెడ్డితో కలసి ఆమె మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నల్లగొండలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న పాలకూరి శైలజ మృతి పట్ల ఇందిర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆర్థిక ఇబ్బందులతో, తీవ్ర మనోవేదనకులోనై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తొడసం రామస్వామి అనే విద్యావలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలమంది విద్యా వలంటీర్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడం, పెండింగ్ వేతనాలను చెల్లించకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం -
ప్రైవేటు టీచర్లకు కార్డు లేకున్నా రేషన్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో ఆహార భద్రత (రేషన్) కార్డు లేకున్నా.. రూ.2 వేల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్న్బియ్యానికి ప్రైవేట్ టీచర్లు అర్హులే. నగరంలో సగం మందికిపైగా ప్రైవేట్ టీచర్లకు రేషన్ కార్డు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో సంబంధం లేకుండా విద్యాసంస్ధల్లో మార్చి 2020 నాటికి జీతాలు చెల్లించిన రికార్డుల ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు సమర్పించే ధ్రువీకరణ ప్రామాణికంగా ఆర్థిక సాయం అందజేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డు లేనివారికి వారి ప్రస్తుత చిరునామాతో రేషన్ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. శనివారం నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఉరుకులు పరుగులు అందుకుంటున్నారు. సగం ఇక్కడే.. రాష్ట్రం మొత్తంలో సగానికి పైగా ప్రైవేట్ విద్యా సంస్ధలు నగర పరిధిలోనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ టీచర్ల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. కరోనా నేపథ్యంలో విధుల నుంచి తొలగించిన వారి శాతం కూడా అధికమే. ఏడాది కాలంగా ఉపాధి లేక ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు అలమటిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రైవేట్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య లక్షన్నర పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా లబ్ధిదారులు గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల్లో సుమారు 66 వేలకుపైగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ( చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది ) -
ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారితో విద్యాసంస్థలు మూతపడి.. జీతాలు రాక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి సాంత్వన కలిగించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2,000 చొప్పున ఆపత్కాల ఆర్థికసాయం అందిస్తామని సీఎం గురువారం ప్రకటించారు. అలాగే ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరిచేదాకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినెలా ఈ సాయం అందనుంది. ఇందుకోసం ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు ఖాతా వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. విద్యాశాఖ సమన్వయంతో ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. నేడు కలెక్టర్లతో సమీక్ష! ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సహాయం అందజేతపై శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బీఆర్కేర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ డీఎస్ఓలు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఆర్థిక సహాయానికి సంబంధించిన విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక అమలుకు సూచనలు చేయనున్నారు. చదవండి: మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది చదవండి: ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్’ అనక తప్పదు -
ప్రైవేటు టీచర్లకు కటింగ్ ఫ్రీ..
జనగామ: కరోనా కష్టకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు జనగామ జిల్లా కేంద్రంలోని సోమేశ్వర హెయిర్ సెలూన్ యజమాని గడ్డం నరేశ్ అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు తన వంతు సాయంగా ఉచితంగా క్షవరం చేస్తున్నాడు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఈ సేవలపై ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, కరోనా సమయంలో తాను సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, తనలా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చేదోడుగా నిలవాలన్న భావనతోనే ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రిన్సిపాల్ టు టిఫిన్ సెంటర్
పైన ఫొటోలో దోశ వేస్తూ కనిపిస్తున్నది చిట్టిమళ్ల చిరంజీవి. ఈయనది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామం. భార్య, ఇద్దరు కుమార్తెలు, అమ్మా, నాన్నలు ఉన్నారు. ఆలుమగల సంపాదన మీదే కుటుంబం నడిచేది. భార్యాభర్తలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేసేవారు. చిరంజీవి ఎంఎస్సీ, బీఈడీ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఉన్నత తరగతులకు గణితం బోధించేవారు. ఆయనకు, భార్యకు కలిపి యాజ మాన్యం రూ.25 వేల వేతనం ఇచ్చేది. కుటుంబం హాయిగా గడిచేది. కరోనాతో పాఠశాలలు మూతపడి ఆర్థిక పరి స్థితులు తలకిందులయ్యాయి.కొందరు మిత్రుల సలహాతో టిఫిన్ సెంటర్ పెట్టాడు. చిరంజీవిని ‘సాక్షి’ పలకరించగా.. ‘నాతో పాటు కుటుంబసభ్యులు టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండటంతో రోజుకు ఖర్చులుపోను రూ.1,000 నుంచి 1,500 వరకు మిగులుతున్నాయి’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి, నెట్వర్క్ : పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే గురువులు వారు. సమాజంలో హోదా, గౌరవం. పది మంది చేతులెత్తి దండం పెట్టేవారు. ‘సారూ.. బాగున్నారా’ అంటూ అత్మీయ పలకరింపులు. పిల్లల చదువులపై ఆరాలు. పొద్దున లేస్తూనే బడి ధ్యాస. పాఠాలు, హోంవర్కులు... రోజంతా పిల్లలతో హడావుడి. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడింది. 10 నెలలుగా బడులు మూతపడ్డాయి. ప్రైవేటు మాస్టార్ల బతుకులు ఆగమయ్యాయి. జీతాలు ల్లేవు. జీవితాలు గడవాలి. కుటుంబాన్ని పోషించాలి. అక్షరాలు దిద్దించిన చేతులే అట్లు వేస్తున్నాయి. కరెంటు పని, మగ్గం నేత... ఏ పని వస్తే అది చేస్తున్నాయి. పట్ట ణాల్లో అద్దె భారమైంది. సొంతూళ్లకు వెళ్లిపోయారు. పొలంలోకి దిగారు. కూలి పనులకు వెళుతున్నారు. గురువులకు కరోనా నేర్పిన జీవిత‘పాఠం’ ఇది. భారంగా బతుకుబండిని లాగుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల ‘గోస’ ఇది.. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటేశ్వర్లుతోపాటు అతని భార్య ఇద్దరూ స్థానికంగా ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవారు. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. వీరికి పనులు లేకుండా పోయాయి. వెంకటేశ్వర్లు గతంలో నేర్చుకున్న ఎలక్ట్రీషియన్ పనిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నారు. ‘గతంలో మా ఇద్దరికి కలిపి రూ.20 వేలు వస్తుండేవి.. ఇప్పుడు అందులో సగం వచ్చినా.. సంసారం సాఫీగానే నడుస్తోంది’ అని వెంకటేశ్వర్లు ఒకింత ధైర్యంగా చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శ్రీనివాస్... లెక్కల మాస్టారు. 6 నెలల క్రితం ఎంతో గౌరవంగా బతికారు. పిల్లలకు లెక్కలు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారన్న పేరుంది. కానీ కరోనా తలకిందులు చేసింది. ఇప్పుడు మండల కేంద్రంలో దొరికే కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకువచ్చి చిన్నగదిలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ‘అటు పాఠశాల యాజమాన్యం.. ఇటు ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల టీచర్లను పట్టించుకోవడం లేదు. అయినా బతకాలంటే ఏదో పనిచేయాలి.. అందుకే కూరగాయలు అమ్ముతున్నా’అని శ్రీనివాస్ తెలిపారు. ఇన్నాళ్లు ‘నమస్తే సార్’అనే పిలుపుకు అలవాటుపడ్డ చెవులవి. ఇప్పుడా సంబోధన లేదు. మరో పిలుపు. పర్వాలేదు... కుటుంబ నావను నడిపించడంలో అవేమీ అడ్డుకావు అని సర్దుకుపోతున్నారు. సొంతకాళ్లపై నిలబడ్డామనే సంతృప్తి ఒకవైపు... గుండెను మెలిపెడుతున్న గత తాలూకు జ్ఞాపకాలు మరోవైపు. కోవిడ్–19తో లాక్డౌన్ కారణంగా గత ఏడాది మార్చిలో అన్ని విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఇక..ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. అందరినీ పక్కన పెట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని సాకాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. కొందరు గతంలో నేర్చుకున్న వృత్తులపై దృష్టి పెట్టగా, మరికొందరు సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొందరు కిరాణ, టిఫిన్ సెంటర్లు, పాలకేంద్రాలు తదితర వ్యాపారాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కరోనా గురువుల జీవితాల్లో ఎలాంటి కల్లోలం రేపింది.. ప్రత్యామ్నాయ ఉపాధిలో ఎలా ముందుకెళ్తున్నారు.. కుటుంబ నావను ఎలా నడిపిస్తున్నారనే అంశాలపై ‘సాక్షి’దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లను పలకరించి అందిస్తున్న ‘గ్రౌండ్ రిపోర్ట్’ఇది... – సాక్షి నెట్వర్క్ మగ్గం పనిచేస్తూ.. ఉపాధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నానచర్ల రమేష్ ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో పాఠశాలను మూసివేశారు. ఇంతవరకు తెరుచుకోలేదు. ఆన్లైన్ తరగతులు కూడా నడవని పరిస్థితి. పాఠశాల యాజమాన్యం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కుటుంబం గడవడం కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పు చేశారు. పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అతను ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన ఇంటి పక్కన ఉన్న పద్మశాలి ఇంట్లో మగ్గం పని నేర్చుకున్నాడు. అప్పట్లో నేర్చుకున్న మగ్గం పని ఇప్పుడు అక్కరకు వచ్చింది. స్థానికంగా ఉన్న నేతన్న దగ్గర పనికి కుదిరాడు. నెలకు రూ.17 వేల దాకా ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘సుమారు 10 నెలల నుంచి పాఠశాలలు తెరవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలా అని కుంగిపోలేదు. అప్పడు నేర్చుకున్న పని ఇప్పుడు అక్కరకు వచ్చింది’అని రమేష్ చెప్పారు. వాయిద్యాలతోనే పూట గడుస్తోంది ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ టీచర్లు. ఒకరు గంగారపు రాజయ్య, మరొకరు కాసగోని వెంకటేశ్వర్లు. రాజయ్య వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని సిలోయమ్ స్కూల్లో పీఈటీగా పని చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించేవారు. కాసగోని వెంకటేశ్వర్లు సైతం హన్మకొండ సమీపంలోని చింతగట్టు క్యాంపులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి వేయడంతో వీరికి జీవనోపాధి ఇబ్బందిగా మారింది. దీంతో వీరు కూలి పనులతో పాటు గ్రామాల్లో జరిగే శుభకార్యాలలో వాయిద్యాలు వాయిస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చేపలు అమ్ముతున్నా.. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. బీఎడ్ చేశాను. పదేళ్లు స్థానిక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాను. మా ఇంట్లో నలుగురు సభ్యులం. కుటుంబపోషణ భారం నాదే. కరోనా వల్ల కళాశాలలు తెరిచే పరిస్థితి లేనందున కుటుంబ పోషణ కోసం చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నా. ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా... అందుకే ధైర్యంగా చేపలు విక్రయిస్తూ ముందుకు సాగుతున్నాను. కళాశాలలు పునఃప్రారంభమైతే మళ్లీ లెక్చరర్‌గా పని చేస్తా. – సాయికుమార్, నిజామాబాద్ పొలం లీజుకు తీసుకున్న.. వ్యాయామ వృత్తి విద్య పూర్తి చేశాను. కరీంనగర్‌లోని సిద్ధార్థ పాఠశాలలో పీఈటీగా పనిచేశాను. కరోనా ప్రభావంతో స్కూల్ జీవితం ముగిసినట్లయ్యింది. మా సొంతూరు చిమ్మనపల్లి గ్రామం.. సిరికొండ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరీంనగర్లో రూం కిరాయి కట్టలేక ఖాళీ చేసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ మాకున్న రెండెకరాల పొలంలో పనిచేసుకుంటున్నాను. ఇంకా పక్క వారి మూడు ఎకరాలు లీజుకు తీసుకుని అందులో కూడా పొలం చేస్తున్నాను. స్కూల్ లైఫ్‌లో పొలం పని చేసేవాడిని కాను. చివరకు పెద్దల నుంచి వచ్చిన భూమి నాకు జీవనోపాధి అయింది. స్కూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను తప్ప అందరినీ ఆదుకుంది. ఇప్పటికైనా మాకు నిరుద్యోగ భృతి చెల్లించాలి.– బి.రఘుపతి, ప్రైవేటు పీఈటీ, రాజన్న సిరిసిల్ల జిల్లా. మాస్కులు, టాయ్స్, సానిటైజర్స్ అమ్ముతున్నా నేను కరీంనగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్ ఫీల్డ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. కరోనా వైరస్ వచ్చి అందరినీ అతలాకుతలం చేస్తుందని ఊహించలేదు. స్కూళ్లు మూతపడి... జీవనోపాధి కరువై ప్రైవేటు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఆర్థిక స్థోమత లేక... ఏం చేయాలో అర్థం కాకా చివరికి మాస్క్‌లు, టాయ్స్, సానిటైజర్స్, కర్చీఫ్స్ అమ్ముతూ బతుకుబండిని లాగిస్తున్నా. జగిత్యాల రోడ్ రేకుర్తి శివారులో చిన్న గుడిసెలో పెట్టి అమ్ముతున్నాను. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోండి లేదంటే పాఠశాలలు తెరవండి అని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నా. – ఎస్.సతీష్, కరీంనగర్ కిరాణం కొట్టులో పనికి కుదిరి.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన శిరీష స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నెలకు రూ.6 వేల వేతనంతో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. జీతాలు ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో ఓ కిరాణ కొట్టులో పనికి కుదిరింది. ‘ఇప్పటికైతే బాగానే ఉంది. పాఠాలు చెప్పడంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. పాఠశాలలు తెరుచుకుంటే తిరిగి టీచర్‌గా వెళ్తాను. లేదంటే ఇక్కడే పనిచేస్తాను’ అని శిరీష తెలిపింది. -
భారంగా బతుకు‘పాఠం’
పై ఫోటోలో పత్తి ఏరుతున్న ఈయన పేరు లింగమయ్య. కల్వకుర్తికి చెందిన ఈయన ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న లింగమయ్య.. కరోనా దెబ్బతో ఉద్యోగం కోల్పోయారు. సొంతూరుకు వెళ్లి జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా మారారు. సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పో యిన లక్షన్నర మంది టీచర్లు, అధ్యాపకుల జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. 6 నెలలుగా పని లేక.. జీవనం గడిచే దారిలేక కొంత మంది వ్యవసాయ, దినసరి వేతన కూలీలుగా మారితే.. మరికొంతమందిపరువు కోసం కడుపు మాడ్చు కొని ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. అర్ధాకలితో అవస్థలు పడుతూ ఎప్పుడు పరిస్థితులు చక్క బడుతాయో నని ఎదురుచూస్తున్నారు. ఇపుడు 75% స్కూళ్లు ఆన్లైన్ తరగ తులను ప్రారంభించి, ఫీజులూ వసూలు చేసుకుంటున్నాయి. ఫీజులు చెల్లించని వారి పిల్లలకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వకుండా వేధిస్తూ ఫీజులను పెంచి మరీ దండుకుంటున్నాయి. అయినా టీచర్లను స్కూళ్లకు రమ్మని పిలవడం లేదు. వెళ్లి అడిగినా పట్టించు కోవడం లేదు. చివ రకు గత విద్యా సంవత్సరపు వేతన బకాయి లను, కోత పెట్టినవేతనాలను చెల్లించడంలే దని, పీఎఫ్ డబ్బులు విడిపించు కునేందుకు అవకాశమివ్వట్లేదని వాపోతున్నారు. మళ్లీ వస్తామన్నా... తీసుకొనే వారేరీ? డిగ్రీ, పీజీలు, పీహెచ్‌డీలు చేసి పట్నం వచ్చి టీచర్లు, లెక్చరర్లుగా బతుకీడుస్తున్న అనేక మంది కరోనా వల్ల బతుకుదెరువు కోల్పోయారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వక, పట్టణాల్లోనే ఉండేందుకు డబ్బులు లేక, ఏదో ఒక పని చేసుకొని బతికేం దుకు ఏప్రిల్, మే నెలల్లోనే అనేక మంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి వద్దామని యాజమాన్యాలను సంప్ర దిస్తున్నా... అటు నుంచి స్పందన లేదు. చివరకు సగం జీతానికైనా పనిచేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని, తామెలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్ తరగతుల్లో 40 శాతం మందే.. విద్యాశాఖ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 10,912 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 1,27,790 మంది టీచర్లు పని చేస్తున్నారు. మరోవైపు 15 వేల మంది వరకు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇక 1,496 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 20 వేల మంది వరకు లెక్చరర్లు ఉన్నారు. మరోవైపు 187 ఇంజనీరింగ్ కాలేజీల్లో 90 వేల మందికి పైగా అధ్యాపకులు పని చేస్తున్నారు. అయితే వీరిలో ఇపుడు 40 శాతం మంది కూడా స్కూళ్లు, కాలేజీల్లో లేరు. మెజారిటీ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినా టీచర్లను వెనక్కి తిరిగి తీసుకోలేదు. 20–25 మంది టీచర్లు ఉన్న స్కూళ్లలో 10 మందిలోపు టీచర్లతోనే ఆన్లైన్ బోధనను కొనసాగిస్తున్నాయి. చాలా పాఠశాలలైతే ప్రైవేటు ఆన్లైన్ లెర్నింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకొని రికార్డెడ్ పాఠాలను ప్రసారం చేస్తున్నాయి. దీంతో వాటిని మానిటర్ చేసేందుకు ముగ్గురు నలుగురు టీచర్లను మాత్రమే స్కూళ్లకు రమ్మన్నాయి. అదీ సగం జీతాలతోనే పని చేయించుకుంటున్నాయి. మిగతా లక్షన్నర మందికి పైగా టీచర్లకైతే ఆ సగం జీతంతో కూడిన జీవితం కూడా లేకుండా పోయింది. క్లాసుకు ఇంతని దినసరి కూలీ స్కూళ్లకు వెళ్లి ఆన్లైన్ పాఠాలు చెబుతున్న వారి పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. చెప్పినా సగం జీతం కూడా ఇవ్వడం లేదు. వారికి వారంలో నాలుగు తరగతులను ఇచ్చి, ఒక్కో క్లాస్ రూ. 100 చొప్పున 400 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 2 వేలు కూడా పొందని టీచర్లు అనేక మంది ఉన్నారు. మరోవైపు చాలా మంది టీచర్లకు స్కూళ్లు ఫీజుల వసూలు టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, ఫీజులు చెల్లించేలా చేస్తే ఒక్కో ట్రాన్జాక్షన్పై రూ. 300 చొప్పున కూలీగా చెల్లిస్తున్నాయి. రూల్సా... లైట్ తీస్కో! విద్యాశాఖ జీవో 1 ప్రకారం ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాలకు, మరో 15 శాతం స్కూల్ అభివృద్ధికి, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చించాలి. మిగతా 5 శాతం డబ్బునే యాజమాన్యాలు లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అయినా విద్యాశాఖకు పట్టదు. ఈమె పేరు లావణ్య. లాక్డౌన్ ముందు వరకు ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యో గి. వీరికి ఇద్దరు పిల్లలు. చెరో ఉద్యోగం చేసుకుంటేనే ఇళ్లు గడిచే పరిస్థితి. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల స్కూల్ బంద్ అయింది. ఆమె ఉద్యోగం పోయింది. ఆర్నెల్లు అవుతోంది. భర్తకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నా: మహదేవ్ ఏప్రిల్ నుంచి జీతం లేదు. అడిగితే బెదిరిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటున్నారు. మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది. మీ డాటా వాళ్లకు పంపించి మీకు ఎక్కడా పని దొరక్కుండా చేస్తామని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నా. -
ముఖ్యమంత్రి సారూ.. స్పందించరూ..
లక్డీకాపూల్: తమను ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆకలి దీక్ష తలపెట్టారు. ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు చెల్లించలేకపోతున్న కరోనా కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేస్తున్నది. ఫోరం పిలుపు మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లోనే ఆదివారం ఆకలి దీక్షలో పాల్గొన్నట్టు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి పి.పట్టాభిరెడ్డి తెలిపారు. మూడు మాసాలుగా లెక్చరర్లకు జీతాలు లేవు, వచ్చే ఆగస్టు వరకు కూడా జీతాలు చెల్లించడం కుదరదని యాజమాన్యాలు తెగేసి చెపుతున్నాయని ఆవేదన చెందారు. తమ శ్రమ, నిబద్ధతతో వందల, వేల కోట్లు కూడబెట్టుకున్న ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ ధీనావస్థను గుర్తించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ దయనీయ స్థితిని పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఆకలి దీక్షను తలపెట్టామన్నారు. ఇకనైనా తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): పెద్దపెల్లి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2020–2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాల టార్గెట్ విధిస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని లేకుంటే భద్రత భరోసా ఇవ్వమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తమ కొలువులు ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లకోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. బోధనతోపాటు అదనపు తరగతులు, శనివారం, ఆదివారం సెలవు వచ్చిందంటే పాఠశాల అడ్మిషన్లుకోసం యాజమాన్యాలు వేధించడంతో కొందరు మానసికంగా శారీరకంగా తమ జీవితం నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 1950 మంది ప్రైవేటు టీచర్లు జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సుమారు 190 ఉన్నాయి. వీటిలో దాదాపు 1950 మంది డిగ్రీ , బీఎడ్, డీఎడ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు రాక గత్యంతరం లేక కుటుంబ పోషణకోసం ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు రెండునెలల ముందుగానే పాఠశాలకు పిలిపించి అడ్మిషన్ల టార్గెట్ విధించారు. వేసవిసెలవుల్లో కూడా అడ్మిషన్లు చేస్తేనే వచ్చే విద్యా సంవత్సరం పని చేస్తారని లేదంటే వేరే పని చూసుకోవచ్చని స్పష్టం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతున్నారు. తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను వేడుకుంటున్నారు ఇప్పటికే సంవత్సరంలో పదినెలల జీతం మాత్రమే చెల్లిస్తున్న యాజమాన్యాలు పని మాత్రం 12 నెలలు చేయించుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల తెల్లారేసరికి క్యాంపెయినింగ్ పేరుతో రోడ్డు ఎక్కుతున్నారు. పాఠశాలలోని సౌకర్యాలు, మీ పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్ అందిస్తామంటూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్మిషన్లు చేయకపోతే కాస్తోకూస్తో వచ్చే జీతం ఈ ఉద్యోగం ఊడిపోతుందని భయంతో ఉపాధ్యాయులు మార్కెటింగ్ ఏజెంట్ అవతారమెత్తి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చాలీచాలని జీతాలు ప్రైవేట్ పాఠశాలలో పని చేసే టీచర్లకి యాజమాన్యాలు ఇచ్చే వేతనం అరకొర మాత్రమే. ప్రాథమికస్థాయి విద్యాబోధనకు 3వేల నుంచి 5 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. హైస్కూల్ అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వం జీవో ప్రకారం విద్యార్థుల ఫీజు నుంచి వసూలు చేసిన వాటిలో 59శాతం టీచర్ల వేతనాలకు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా అమలు చేయడం లేదు. జీవో విడుదల చేసిన ఫలితం లేకుండా పోయింది. కష్టపడి పాఠాలు బోధించి విద్యార్థులకు ర్యాంకులు సాధించే పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెడుతున్న టీచర్లకు సరైన వేతనాలు ఇవ్వకుండా వారి కష్టాన్ని దోచుకొని యాజమాన్యాలు తమ జేబులు నింపుకుంటున్నాయనే అనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్ పూర్తి అయితేనే ఉద్యోగం ఇచ్చిన అడ్మిషన్ పూర్తి చేస్తేనే రెండు నెలల వేసవి సెలవుల్లో జీతం ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు విధిస్తున్నాయి. ఒక ఉపాధ్యాయుడు 10 నుంచి పదిహేను మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్చాలని నిబంధనలు విధించారు. -
శ్రీచైతన్య విద్యాసంస్థల వద్ద ప్రైవేట్ టీచర్స్ నిరసన
-
రోడ్డున పడ్డ టీచర్లు, లెక్చరర్లు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆ కాలనీలో అపార్ట్మెంటు వాచ్మెన్ చులకనగా మాట్లాడి పంపాడు.. మరో చోట కనీసం మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకుండా వెళ్లిపొమ్మన్నారు..’ఇవీ పలువురు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు ఓ చోట కలసి చెప్పుకొంటున్న బాధలు. వాస్తవానికి ఇప్పుడు వారికి వేసవి సెలవులు. కానీ వారంతా కాళ్లరిగేలా వీధి వీధి తిరుగుతున్నారు. ఎందుకంటే కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు పెట్టిన టార్గెట్ల వల్లే. వేసవిలో నెల జీతం రావాలంటే.. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో చేసేది లేక కొత్త పిల్లలను స్కూళ్లల్లో చేర్పించేందుకు రోడ్డున పడుతున్నారు. అసలు కారణం ఇదే! ప్రైవేటు టీచర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. రూ.8 వేల నుంచి మొదలవుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి విద్యాపరంగా బాగా పేరున్న ప్రాంతాల్లో మహా అయితే రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు. అది కూడా 10 నెలలకే. ఇంకొందరు 11 నెలలు ఇస్తారు. ఇక 12వ నెల జీతం కూడా రావాలంటే.. ఏప్రిల్, మేలో స్కూలు పరిసర కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ కాన్వాసింగ్ చేయాలి. ఇందుకు ఓ బస్సు ఏర్పాటు చేస్తారు. ఏ ఏరియాలో తిరగాలో లిస్టు ఇస్తారు. అపుడు టీచర్లంతా.. చిన్నారులున్న ఇళ్లను గుర్తించి, వారి ఫోన్ నంబర్లు సేకరించాలి. ఆ పిల్లలు స్కూలుకు లేదా కాలేజీకి వచ్చే వరకు వారికి రోజూ ఫోన్లు చేసి గుర్తు చేస్తుండాలి. అయితే టార్గెట్లు పూర్తి కాకపోతే వారికి 12వ నెల జీతం రాదు. ఒక్కోసారి ఉద్యోగం ఊడిపోవచ్చు కూడా. ఇంత చదువు చదివినా తమకన్నా ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల బతుకులే మేలని టీచర్లు, జేఎల్‌లు వాపోతున్నారు. జేఎల్ పరిస్థితి మరీ దారుణం! పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు జూనియర్ లెక్చరర్ల (జేఎల్)ను వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. తమకు తెలిసిన స్కూళ్లలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఫోన్ నంబర్లు, చిరునామాలు తీసుకుని వారి ఇంటికెళ్లి తమ కాలేజీలో చేరాలని వారి వెంటపడాలి. తల్లిదండ్రులు చీదరించినా, ఛీ కొట్టినా పట్టు వదలని విక్రమార్కుల్లా పొట్టకూటి కోసం ప్రతీ ఇల్లు తిరగాల్సిన దుస్థితి. రూ.10వేల లోపు వేతనాలు ఇస్తూ.. కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా 10 గంటలకు పైగా పనులు చేయించుకుంటున్నారు. వారికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు. పీజీ, బీఈడీ చేసినా ఇంతే! చాలామంది టీచర్లలో బీఈడీ, పీజీలు పూర్తి చేసిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ (టెట్), స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (సెట్) కూడా పాసయ్యారు. టీచర్లకు, లెక్చరర్లకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ఏ యాజమాన్యం కూడా వీరికి కనీస వేతనం అమలు చేయడానికి ముందుకు రావట్లేదు. పోనీ 10 గంటలు పనిచేశాక అయినా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అదీ లేదు. డెయిలీ టెస్టుల పేరుతో కూడా వారిని పేపర్ వాల్యూయేషన్, ఆబ్సెంట్ అయిన విద్యార్థి ఇంటికి ఫోన్లు చేస్తూ ఇంటికి వెళ్లాక కూడా కాలేజీ, స్కూలు కోసం పనిచేసేలా చేస్తున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఏదీ? రాష్ట్రంలో జేఎల్‌లుగా పనిచేసే చాలామంది పట్టభద్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మహిళా లెక్చరర్లు, టీచర్లు సాధింపులు, లైంగిక వేధింపులను దిగమింగుకుని బతుకుతున్నారు. ఇష్టానుసారంగా కాలేజీ వేళలు మార్చేస్తారు. ఆడవారని కూడా చూడకుండా క్యాంపస్‌లలో రాత్రిపూట ఉండాలని హుకూం జారీ చేస్తారు. పెళ్లయి, పిల్లలున్నా సరే కనికరం చూపరు. పండుగలు, పబ్బాలు, వేసవి సెలవుల్లోనూ పని చేయించుకుంటారు. ఎదురుమాట్లాడితే.. మర్నాడే ఉద్యోగం ఊడుతుంది. దీంతో బతుకు ఆగం అవుతుందని భయంతో అన్నింటినీ భరిస్తూ పోతున్నారు. కనీసం ఉద్యోగం నుంచి తీసేశాక పీఎఫ్ కూడా వారికి రాదు. పిల్లలకు జ్వరమొస్తే.. ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఎస్ఐ లేకపోవడంతో ఆరోగ్య భద్రత ఉండట్లేదు. పిల్లలకు మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే.. వారి బతుకు ఇంకా దయనీయంగా మారుతుంది. భార్యాపిల్లలకు వైద్యం చేయించేందుకు అప్పుల పాలవుతున్నారు. ఇక వారే రోడ్డు ప్రమాదాల బారిన పడితే.. వారి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. -
పిల్లలను బడిలో చేర్పిస్తేనే కొలువు ఉంటుంది!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. నేటి నుంచి వేసవి సెలవులు. భార్య, పిల్లలతో సరదాగా గడపాల్సిన టీచర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు. జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్/కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో.. తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు.. ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్టణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వారిలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి.. ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లలను, వారి తల్లిదండ్రులను కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. రోజు ఫోన్ చేయటం, మెసేజ్‌లు పెట్టి అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో సదరు విద్యాసంస్థ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు భారీ ఎత్తున ఫెయిల్ కావటంతో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నామని లెక్చరర్స్ వాపోతున్నారు. సమ్మర్లో జీతాలు ఇవ్వరు..పని చేయాల్సిందే కొన్ని విద్యాసంస్థల్లో ఏడాదికి కేవలం 10 నెలలు మాత్రమే జీతాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. కాదు కూడదంటే ఉద్యోగాలు వదిలేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. 2 నెలలపాటు జీతాలు అందక కుటుంబాలను నడపటానికి ఉపాధ్యాయులు నానాఇబ్బందులు పడుతున్నారు. సెలవుల్లో సైతం కొత్త అడ్మిషన్ల వేటలో పడాల్సిందే. అనుకున్న టార్గెట్ సాధించాల్సిందే. కొంతమంది ఉపాధ్యాయులు టార్గెట్ నుంచి తప్పించుకోవటానికి తమ సొంత ఖర్చులతో అడ్మిషన్ ఫీజులు చెల్లించి యాజమాన్యాల ఒత్తిడి నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి. విద్యార్థులకూ తప్పని తిప్పలు.. తమ విద్యాసంస్థలో చదివే విద్యార్థులను సైతం ఒక్కో విద్యార్థి ఒక్కొక్కరిని కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలంటూ టీచర్ల ద్వారా చెప్పించి నైతిక విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. అడ్మిషన్లు చేయించకపోతే స్కూల్ యాజమాన్యాల చేతిలో ఉన్న మార్కులు పడవేమోనన్న భయాందోళనలు సృష్టిస్తున్నారు. యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న పాపానపోవటం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ పెద్దలకు అందుతున్న ముడుపుల వల్లే చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వెంకటేశ్వరరావు (36) (పేరు మార్చబడినది) ఎంఎస్సీ(మాథ్స్), ఎంఈడీ చేసి విజయవాడలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆయన స్కూల్ ముగిశాక కొన్ని పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ‘‘ సార్..మీ అమ్మాయి/ అబ్బాయిని మా స్కూల్లో చేర్పించండి. మీ పిల్లలను చేర్పించలేకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి సార్..ప్లీజ్. మాకు టార్గెట్ విధించిన అడ్మిషన్స్ పూర్తి చేయకపోతే వేసవి సెలవుల్లో జీతాలు రావు. కనీసం ఓ ఐదారు మందిని కొత్తగా చేర్చకపోతే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగమే పోయే ప్రమాదముంది సార్, ’’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వాపోతున్నాడు. ఇది ఒక్క వెంకటేశ్వరరావు పరిస్థితే కాదు రాష్ట్రంలోని దాదాపు 30వేల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తోన్న 4.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లందరిది ఇదే దుస్థితి. యాజమాన్యాలు విధించిన టార్గెట్‌ను పూర్తి చేయకపోతే ఉద్యోగాలు పోయే ప్రమాదముండటంతో దిక్కుతోచని స్థితిలో మండుటెండల్లో ఇంటింటికి తిరుగుతూ పాట్లు పడుతున్నారు. యాజమాన్యాల వేధింపులను కట్టడి చేయాలి... అడ్మిషన్లు చేయించాలంటూ ఉపాధ్యాయులపైన పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చట్టం ప్రకారం వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహించడం నేరమని ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వకపోవటం, జీతాలు కట్ చేయటం వంటి వాటిపై ప్రభుత్వం స్పందించి యాజమాన్యాల దాష్టికాలను అరికట్టాలి. – డి.అంబేడ్కర్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ -
క్యాం'పెయిన్'..!
సార్..మీ అమ్మాయి/అబ్బాయిని మా స్కూల్లో చేర్పించండి. మీ పిల్లల్ని చేర్పించకుంటే మీ ద్వారా ఎవరైనా ఉంటే చెప్పండి సార్..ప్లీజ్. పదిమందిని చేర్చాలని యాజమాన్యం టార్గెట్ విధించింది. లేకుంటే మా జీతం కట్ అవుతుంది. కనీస టార్గెట్‌కు చేరుకోకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం నుంచి తొలగిస్తారు. గ్రామాల్లో ప్రైవేటు టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రుల ముందు ప్రాధేయపడుతున్న దయనీయ దుస్థితిది. తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): ప్రైవేటు/కార్పొరేట్ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో... తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 1700 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 30 వేల మంది వరకూ సిబ్బంది పని చేస్తున్నారు. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు..: ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు గత నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్ట ణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి...ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను కచ్చితంగా పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఆ తర్వాత ఆ పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు... పాఠశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్‌లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలకు మించి తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్‌లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్, ప్రతి పండుగ సెలబ్రేషన్, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూల్ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకూ కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్సు ఫీజు, యూనిఫామ్, బుక్స్ ఫీజు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో ముందుగా క్యాంపైన్ తిరిగి పిల్లలను చేర్చిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతుండడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై జిల్లా విద్యాశాఖ దృష్టి పెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయనే ఆశతో ఉన్నామని పలువురు ఉపాధ్యాయులు ‘సాక్షి’తో చెప్పారు. -
ప్రైవేటు ఉపాధ్యాయులకు భరోసా ఏది?
సమాజం గాడి తప్పకుండా, సక్రమమైన మార్గంలో పయనించాలంటే, మనుషులు క్రమశిక్షణతో మెలగాలి. అందుకు తరగతి గదిలో నేర్చు కున్న క్రమశిక్షణ అవసరం. అంటే ఇదంతా ఒక ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మంచి వేతనాలిస్తూ గౌరవిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రైవేటు ఉపాధ్యాయులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎక్కువ శాతం ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలోనే చదివిస్తున్నారనంటే ఆ ఉపాధ్యాయులపై వుండే నమ్మకం ఎలాంటిదో తెలియకనే తెలుస్తుంది. కానీ విద్యార్థులను తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయుల అంతరంగంలోకి తొంగిచూస్తే ఆందోళన కలిగించే అంశాలెన్నో. విద్య నేర్పే విద్యాలయాలు, వ్యాపార సంస్థలుగా మారి, విద్యార్థుల తల్లిదండ్రులను ఒకింత మాయాజాలానికి గురిచేసి, తియ్యని మాట లతో అబ్బురపరిచి, పాఠశాలలోని సిబ్బందిని అష్టకష్టాలకు గురిచేస్తూ కాలం గడుపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నేడు వివిధ కార్పొరేటు సంస్థలు ఎక్కువ లాభార్జన కోసం పాఠశాలలనే ఎంచుకుంటున్నాయి. తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి నైపుణ్యం కలిగిన, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులను ఉపయోగించుకుంటూ, సమాజంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడితో పోటీని తట్టుకుంటూ, వ్యాపార మార్గంలో దూసుకుపోతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కానీ, అదే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయ నీయంగా ఉంది. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోయినా, యాజమానుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడంటే సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. కానీ నేడు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కనీస మర్యాద ఇవ్వకపోగా హీనంగా చూసే దురదృష్టకర పరిస్థితి నెలకొంది. పాఠశాలలో విద్యార్థులను మందలించకూడదు. విద్యార్థే మన సంస్థకు దేవుడు. ఎందుకంటే ఫీజులు కడుతున్నాడు. వాడు ఉపాధ్యాయుని మాట వినడు, చదవడు, పరీక్షలు అయిపోయిన తర్వాత పేపర్సును ఇంటికి పంపించి, ఫలితాలు బాగాలేకపోయినా ఉపాధ్యాయుడే కారణాలు చెప్పాలి. అలా అని చెప్పిన వాటిని వినరు, విన్న వాటిని గురించి పట్టించుకోరు . ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే అయిదారు గంటలదాకా పాఠశాలలో నిలబడే పాఠాలు బోధించాలి. పొరపాటున అలసటతో విశ్రాంతి తీసుకుంటే, పూర్తి కాలం విశ్రాంతి తీసుకోవా ల్సిందే. ఎన్నో చీవాట్లు, చీదరింపులకు గురి కావాల్సిందే. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి, అతని గురించి వివరిస్తూ, పాఠశాలను పొగుడుతూ, నూతన ప్రవేశాల కోసం ఆరా తీయాలి. నెలకు ఒకటి, రెండు అడ్మిషన్స్ తేవాలన్న డిమాండును కఠినంగా అమలుపరుస్తారు. తేడాలొస్తే జీతంలో కోతలు తప్పవు. ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ప్రైమరీ, ప్రీప్రైమరీ ఉపాధ్యాయుల వేతనాలను పరిశీలిస్తే ఆశ్చర్యమేయక తప్పదు. కొన్ని యాజమాన్యాలు వారిపట్ల కనీస కరుణ చూపక, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఉదయం జరిగే ప్రార్థనకు కనీసం ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎర్ర చుక్క పడుతుంది. ఆలా రెండుసార్లు వస్తే ఒక సెలవు పూర్తవుతుంది. మళ్లీ అది కొనసాగిస్తే జీతంలో కోత పడుతుంది. ప్రైవేటు యాజమాన్యాలు సంస్థలు ఏర్పాటు చేసుకొని, మేము ఇంత మందికి కొలువులు కల్పించామని, వారు మేము చెప్పినట్లే వింటారని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటూ వివిధ రాజకీయ పార్టీల మన్ననలు పొందుతుంటారు. ప్రస్తుత సమాజంలో ప్రైవేటు విద్యా సంస్థలలోని విద్యార్థులు రాణిస్తున్నారంటే కారణం అందులో పనిచేసే ఉపాధ్యాయుల కృషి ఫలితమే. కానీ అదే ఉపాధ్యాయున్ని ఇటు యాజమాన్యం కానీ, అటు సమాజం కానీ గుర్తించకపోవడం, ప్రాధాన్యతనివ్వకపోవడం దురదృష్టకరం. నేడు ప్రైవేటు ఉపాధ్యాయుని జీవితం అరిటాకులా తయారయింది. ముళ్ళు వచ్చి ఆకుపై పడినా, ఆకు పోయి ముల్లుపై పడినా ఆకుకే ప్రమాదం. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలను ఆశించ కుండా, ఉపాధ్యాయులపై దృష్టి కేంద్రీకరించి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడమేగాకుండా ఉద్యోగభద్రత కల్పిస్తూ, గౌరవప్రదంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల పిల్లలకు ఉచిత విద్యనందించే విధంగా కృషి చేస్తూ, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాలకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయుల పక్షాన నిలిచి, వారిని ప్రోత్సహిస్తూ, వారి జీవితాలకు భరోసా కల్పించేవిధంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. -డా‘‘ పోలం సైదులు, సామాజిక విశ్లేషకులు -
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేట్ టీచర్లు , లెక్చరర్లు
-
శ్రమకు తగిన వేతనమేదీ?
సాక్షి, నెట్వర్క్: ప్రైవేట్ విద్యాసంస్థల్లో శ్రమ దోపిడీ జరుగుతోందని, శ్రమకు తగ్గవేతనం ఇవ్వడంలేదని ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగ భర్తీలు లేనందువల్లే ప్రైవేట్ సంస్థల్లో పనిచేయాల్సి వస్తోందని, అక్కడ తమకు కనీస హక్కులు కూడా ఉండటం లేదని వివరించారు. శనివారం ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడంవల్లే విద్యార్థులు ప్రైవేట్ రంగం వైపు మళ్లుతున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్నారు. తమ సెలవులు తమకు ఇవ్వాలని, యాజమాన్యం సెలవు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఉద్యోగిగా గుర్తింపు ఉండడంలేదన్నారు. రోజుకు 10 గంటలకుపైగా పనిచేయించుకుంటున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నామని, తమ జీవితాలతో ఆడుకోవద్దని సంస్థలను అభ్యర్థించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ తర్వాత జీవనోపాధి కల్పించే పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఏటా జీతం పెంచాలని, అధిక పనిగంటల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, అధ్యాపకులకు ఆదివారం, రెండో శనివారం సెలవులు ఇవ్వాలని, అధిక పని గంటలను నియంత్రించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని, జీవో నంబరు 1ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు.. విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, అద్యాపకుల యూనియన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా అధ్యక్షుడు డక్కిలి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్ ఎదుట పీటీఎల్‌యు (ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. బోధనావృత్తిపై మమకారంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉద్యోగాలు లేకపోవడంతో వేరే వృత్తి చేపట్టలేక ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అసలు జాతీయ సెలవులు ఇవ్వరని, కొన్ని విద్యా సంస్థల్లో కనీసం ఆదివారం కూడా సెలవులు ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యా సంస్థల్లో మహిళా టీచర్లు గర్భవతులు కాకూడదంటూ అగ్రిమెంట్లు కూడా చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. కోతలు లేకుండా జీతాలు ఇవ్వాలి అనంతపురం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పీటీఎల్‌యు జిల్లా అధ్యక్షుడు బి.కాసన్న మాట్లాడుతూ.. సెలవు దినాల్లో వేతన కోత లేకుండా 12 నెలలకూ జీతం ఇవ్వాలన్నారు. ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సిబ్బందికి అడ్మిషన్ టార్గెట్లు ఇవ్వడం, ప్రచారకర్తలుగా వినియోగించడం నిషేధించాలన్నారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పీటీఎల్యూ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంబేడ్కర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుల పేరుతో విద్యార్థులను, ఉద్యోగాల పేరుతో ఉపాధ్యాయులను దోచుకుంటున్నారన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలో నేతలు మాట్లాడుతూ.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ధర్నాలో పలువురు టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పేరుకే పంతుళ్లు.. పనికి కూలీలు
రోజుకు రెండు గంటలు పనిచేసే ఉపాధి కూలీ నెలకు రూ. 6 వేలు వరకూ సంపాదిస్తున్నాడు. రోజుకు 12 గంటలు పనిచేసే ప్రయివేటు ఉపాధ్యాయుడు నెలకు 8 వేలు కూడా పొందలేకపోతున్నాడు. పేరుకు పంతుళ్లే అయినా వెట్టిచాకిరీ కూలీల్లా పనిచేస్తున్నారు. ఇదీ జిల్లాలో ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి. కష్టపడి చదివినా ప్రభుత్వ కొలువులు లేవు. బీఈడీ, డిగ్రీలు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాలు లేక కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. కనీస వేతనం వీరికి కలగానే మిగిలిపోతుంది. నిరుద్యోగుల పేదరికం, ఉద్యోగ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలీచాలని జీతాలిస్తూ వారి శ్రమను నిలువునా దోచుకుంటున్నాయి. యద్దనపూడి: జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ బోధించే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 684 ఉన్నాయి. ఒక్కొక్క స్కూలుకు టీచింగ్ స్టాఫ్ 15 నుంచి 20 మంది వరకూ ఉంటారు. ఇతర సిబ్బంది మరో 10 నుంచి 15 మంది వరకూ ఉంటుంటారు. జిల్లాలో దాదాపు 12 వేల మందిపైగా ఆయా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ, డిగ్రీలు పూర్తిచేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఒక్క పర్చూరు డివిజన్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలు 76 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 10 మంది నుంచి 40 మంది వరకు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. ఇలా దాదాపు 987 మంది దాకా ఆయా పాఠశాలలో నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి అన్ని అర్హతలున్నా వారికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇక సాదారణ డిగ్రీ చేసిన వారికైతే మరీ తక్కువగా ఉంటుంది. వీరిలో మహిళలైతే మరీ తక్కువగా ప్రాథమికంగా రూ. 3 వేల నుంచి 6 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఫీజులు ఘనం – వేతనాలు నామ మాత్రం: యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సిబ్బందికి మాత్రం రూ. వేలల్లో చెలిస్తున్నారు. జీఓ నెం 91 ప్రకారం విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల్లో 50 శాతం మేర సిబ్బందికి జీత భత్యాలు చెల్లించాలి. కానీ అవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. దీనికి తోడు సంవత్సరంలో 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. వేసవిలో మాత్రం ప్రతి టీచరు కనీసం 10 మందిని తగ్గకుండా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సి ఉంటుంది. లేకుంటే వేరొకరిని నియమించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులైతే ఉద్యోగం పోతుందన్న భయంతో సొంతంగా వారే తెలిసిన పిల్లల పేరుతో ప్రవేశ రుసుం చెల్లించి టార్గెట్లు పూర్తిచేశారు. ఉద్యోగ భద్రత కోసం మండుటెండల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఉపాధి కూలీలే నయం: యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఎక్కువగా బోధనాల కంటే విద్యార్థుల స్టడీ అవర్ల పేరుతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలువు కాళ్లపై నిలబడి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు అయ్యవార్లు వాపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి హామీ కూలీలే నయమని, వారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు పని చేసినా 2 గంటలకే 200 రూపాయలకు తగ్గకుండా కూలీ వస్తుందని, తాము మాత్రం 12 గంటలు కష్టపడినా రోజుకు 150 రూపాయలు కూడా రావడంలేదని కొందరు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లపై యాజమాన్యాల ఒత్తిళ్ళు చాలా దారుణంగా ఉంటున్నాయని, గత్యంతరం లేకే పని చేస్తున్నామని ఎవరికి చెప్పుకోలేక లోలోనే మదన పడుతున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియత్రించి కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు. -
ప్రైవేట్ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రవిశ్రీ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోని వైశ్యభవన్‌లో ఆదివారం నిర్వహించిన టీఎస్‌పీఎస్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం, అభివృద్ధి, సమైక్యతకు ప్రతిరూపంగా టీఎస్‌పీఎస్‌టీఏ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రధానంగా ఐదు లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పడిందన్నారు. సంస్థను ప్రకటించిన వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కదలిక వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం నాడు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే అవార్డులు ఇస్తున్నారని, జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్న ప్రైవేట్ టీచర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఆయన ప్రశ్నించారు. రానున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ టీచర్ల సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వాలని కోరారు. అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయించాలని, హెల్త్, డెత్ ఇన్సూరెన్స్ ప్రకటించాలని, డీఎస్సీ, టీఆర్‌టీల్లో ప్రైవేట్ టీచర్లకు అనుభవం ప్రకారం వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 30లోపు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర కమిటీని ఆదివారం నిజామాబాద్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశ్రీ, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఉపాధ్యక్షుడిగా జైసన్, కోశాధికారిగా రాధాకిషన్, కార్యవర్గ సభ్యులుగా భోజన్న, గోవర్ధన్, సుమన్, శ్రీకాంత్, గురుచరణ్, హర్షరాజ్ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఏడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన అంగలూరు ప్రైవేట్ టీచర్లు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేట్ టీచర్లు
-
ప్రైవేటు టీచర్ల కోసం చట్టం : వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దావాజీగూడెం వద్ద బుధవారం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు కలుసుకున్నారు. తమ సమస్యలను జననేతకు వివరించారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల ఇబ్బందులపై వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రైవేటు టీచర్లకు ఒక ప్రత్యేక పద్దతి ద్వారా వేతనాలు ఇవ్వాలని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు మానవత్వంతో కనీసం వారానికి రెండు రోజులు సెలవులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు అందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే విధంగా చట్ట సవరణ చేస్తామని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్ రోడ్డు, వెల్దిపాడు క్రాస్ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్ రోడ్డు, లంకపల్లి, వెంకట రామపురం మీదుగా ఈరోజు పాదయాత్ర సాగుతోంది. -
టాప్ 3 లక్ష్యం
ప్రైవేటు టీచర్లతో పోలిస్తే మీరెందులో తక్కువ? వాళ్ల కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. మీకే ఎక్కువ అర్హతలున్నాయి. ఎప్పటికప్పుడు పదోన్నతులు పొందుతున్నారు. ఇంక్రిమెంట్లు అందుతున్నాయి. పాఠశాలలకు వచ్చే పిల్లలకు మధ్యాహ్నభోజనం సహా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అయినా ఎందుకు ఫలితాలు సాధించలేకపోతున్నారు? ప్రభుత్వ పాఠశాల ల్లో పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదనే భావనను తొలగించాలి. ఎంతమందిని పాస్ చేయించామనే భావనకంటే ఎంతమందికి గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని ఆలోచించాలి. ఈ విషయంలో టీచర్లు దృష్టి పెడితే మంచి ఫలితాలొస్తాయి. టెన్త్ ఫలితాల్లో జిల్లాను టాప్ 3లో నిలిపేందుకు కృషి చేయూలి. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులను ఇకపై జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ చెప్పా రు. అలాగే సరిగా పనిచేయని వారిపైనిబంధనల మేరకు త గిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు’ అనే అంశంపై శుక్రవారం రెవెన్యూ గా ర్డెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ఫలితాల్లో వెనుకబడటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 10/10 జీపీఏ పాయింట్లు సాధించిన పాఠశాలలు 198 ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 16కే పరిమితం కావడం బాధాకరమన్నారు. ‘ప్రైవేటు వాళ్లు మీకంటే ఎందులో ఎక్కువ? జీతాల్లోనా? అర్హతల్లోనా? వాళ్లకంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు? మీకే ఎక్కువ అర్హతలున్నాయి? ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లుసహా అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. అయినా ఎందుకు ఫలితాలు రావడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో తగిన ఫలితాలు సాధించలేని అధ్యాపకులను యాజమాన్యం తీసివేస్తోందని, ప్రభుత్వం మాత్రం సరిగా పనిచేయకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానంలోనూ ‘పనిష్మెంట్-ఇంక్రిమెంట్’ విధానం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘బాగా పనిచేసిన వారికి మేం ఇకపై గుర్తింపు ఇస్తాం. మంచి ఫలితాలు సాధించిన వారిని గుర్తించి జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానిస్తాం. అట్లాగే పనితీరు బాగాలేని వారిపై నిబంధనలకు లోబడి తగిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, వంటశాలల నిర్మాణం సహా పాఠశాలల్లోని సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ప్రభుత్వ పాఠశాలలకు పేద పిల్లలే ఎక్కువగా వస్తుంటారు. వారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళుతుండటం వల్ల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేరు. కాబట్టి ఉపాధ్యాయులే ఈ బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో గత ఐదేళ్లలో జనాభా బాగా పెరిగింది. కానీ 2010తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య మాత్రం 7వేల వరకు తగ్గింది. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడమే అందుకు కారణం.టీచర్లు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తే విద్యార్థులు కూడా వస్తారు. వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. పునాది గట్టిగా ఉంటే ఫలితాలు బాగా వస్తాయి. ఇకపై 6వ తరగతి నుంచే విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాల్లో ఫలితాలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఆశాజనకంగా లేవు. వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.గిరిజన పాఠశాలల్లో ఫలితాలు సంతృప్తిగా లేవు. మెరుగైన ఉత్తీర్ణ సాధించేలా పర్యవేక్షణ చేయూలని గిరిజన సంక్షేమ అధికారి ఎర్రన్నను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదని, అట్లాంటప్పుడు వంద శాతం ఫలితాలెలా సాధ్యమని ఆ శాఖ ఉప సంచాలకుడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. రాత్రిపూట వార్డెన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు జారుుంట్ కలెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ ఒకటో నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులంతా దాదాపు రెండువేల రోజులపాటు అధ్యాపకుల వెన్నంటే ఉంటున్నప్పటికీ కనీసం వారిని పాస్ చేయించలేకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ కె.లింగయ్య మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్త మ ఫలితాలు సాధించేందుకు యత్నిస్తున్నామన్నారు. అందులో భాగంగా డివిజన్, మండలం, పాఠశాలల వా రీగా సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటలు
ప్రగతినగర్: సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మంగళవారం జరిగే ఈ సర్వేలో జిల్లాలోని 6.25 లక్షల కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయనున్నారు. ఇందుకోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది విభాగాలలో 80 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రతి గ్రామానికి ఒక రూట్ ఆఫీసర్‌ను నియమించారు. వీరు మంగళవారం ఉదయం మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యూమరేటర్లకు అందించనున్నారు. సర్వే కోసం 27,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,300 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు, 800 మంది బ్యాంకు సిబ్బందిని వినియోగించనున్నారు. వీరందరికి జిల్లాలోని 56 కేంద్రాలలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. ఇంటింటికి కరపత్రా లు పంపిణీ చేశారు. స్టిక్కర్లను అతికించారు. గ్రామాలలో పోస్టర్లు వేశారు. మండల ప్రత్యేకాధికారులు సర్వే కు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. సర్వే అనంత రం సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి మండలానికి 25 నుంచి 50 వరకు కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. -
సర్వేకు సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో:సమగ్ర కుటుంబ సర్వేకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆదివారం నిర్వహించిన ప్రీ సర్వేలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దుకుని సమర్ధవంతంగా సర్వే చేపడతామని కమిషనర్ సోమేష్‌కుమార్ చెప్పారు. ప్రీ సర్వేలో పదిళ్లు ఉన్న చోట వంద ఇళ్లు ఉండడంతో కరపత్రాలు సరిపోలేదు. ఇంటింటి స్టిక్కర్లు సైతం కొరత ఏర్పడింది. అలాగే సిబ్బంది కూడా సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇళ్లు ఎక్కువ ఉన్న చోట అదనంగా సిబ్బందిని నియమించనున్నారు. కళాశాల విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లతో పాటు వివిధ రంగాల్లోని వారిని ఇందుకు వినియోగించుకుంటామని కమిషనర్ చెప్పారు. కోటి జనాభా దాటిన నగరంలో ఇబ్బందులు సహజమేనని..వాటిని గుర్తించేందుకే ఏ జిల్లాలో లేని విధంగా నగరంలో రెండు రోజుల ప్రీ విజిట్లు నిర్వహిస్తున్నామన్నారు. గుర్తించిన లోటుపాట్లను దాదాపుగా పరిష్కరించామన్నారు. ఆదివారం దాదాపు 70 శాతం ప్రీ విజిట్ జరిగిందని, మంగళవారం మిగతా 30 శాతంతోపాటు.. రెండో విజిట్‌ను కూడా పూర్తిచేస్తామన్నారు. ఫిర్యాదులుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు 040- 21 11 11 11 ఫోన్ చేయవచ్చునన్నారు.