ప్రిన్సిపాల్‌ టు టిఫిన్‌ సెంటర్‌ | Private Teacher And College Over Corona Effect Sakshi Ground Report | Sakshi
Sakshi News home page

కరోనా నేర్పిన పాఠం

Published Thu, Jan 7 2021 1:26 AM | Last Updated on Thu, Jan 7 2021 1:07 PM

Private Teacher And College Over Corona Effect Sakshi Ground Report

ఉపాధ్యాయుడిగా బోధిస్తున్న చిరంజీవి (ఫైల్‌)

పైన ఫొటోలో దోశ వేస్తూ కనిపిస్తున్నది చిట్టిమళ్ల చిరంజీవి. ఈయనది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామం. భార్య, ఇద్దరు కుమార్తెలు, అమ్మా, నాన్నలు ఉన్నారు. ఆలుమగల సంపాదన మీదే కుటుంబం నడిచేది. భార్యాభర్తలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేసేవారు. చిరంజీవి ఎంఎస్సీ, బీఈడీ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ఉన్నత తరగతులకు గణితం బోధించేవారు. ఆయనకు, భార్యకు కలిపి యాజ మాన్యం రూ.25 వేల వేతనం ఇచ్చేది. కుటుంబం హాయిగా గడిచేది. కరోనాతో పాఠశాలలు మూతపడి ఆర్థిక పరి స్థితులు తలకిందులయ్యాయి.కొందరు మిత్రుల సలహాతో టిఫిన్‌ సెంటర్‌ పెట్టాడు. చిరంజీవిని ‘సాక్షి’ పలకరించగా.. ‘నాతో పాటు కుటుంబసభ్యులు టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తుండటంతో రోజుకు ఖర్చులుపోను రూ.1,000 నుంచి 1,500 వరకు మిగులుతున్నాయి’ అని సంతృప్తి వ్యక్తం చేశారు.

సాక్షి, నెట్‌వర్క్‌ : పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే గురువులు వారు. సమాజంలో హోదా, గౌరవం. పది మంది చేతులెత్తి దండం పెట్టేవారు. ‘సారూ.. బాగున్నారా’ అంటూ అత్మీయ పలకరింపులు. పిల్లల చదువులపై ఆరాలు. పొద్దున లేస్తూనే బడి ధ్యాస. పాఠాలు, హోంవర్కులు... రోజంతా పిల్లలతో హడావుడి. అకస్మాత్తుగా కరోనా వచ్చిపడింది. 10 నెలలుగా బడులు మూతపడ్డాయి. ప్రైవేటు మాస్టార్ల బతుకులు ఆగమయ్యాయి. జీతాలు ల్లేవు. జీవితాలు గడవాలి. కుటుంబాన్ని పోషించాలి. అక్షరాలు దిద్దించిన చేతులే అట్లు వేస్తున్నాయి. కరెంటు పని, మగ్గం నేత... ఏ పని వస్తే అది చేస్తున్నాయి. పట్ట ణాల్లో అద్దె భారమైంది. సొంతూళ్లకు వెళ్లిపోయారు. పొలంలోకి దిగారు. కూలి పనులకు వెళుతున్నారు. గురువులకు కరోనా నేర్పిన జీవిత‘పాఠం’ ఇది. భారంగా బతుకుబండిని లాగుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల ‘గోస’ ఇది..

నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటేశ్వర్లుతోపాటు అతని భార్య ఇద్దరూ స్థానికంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవారు. కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. వీరికి పనులు లేకుండా పోయాయి. వెంకటేశ్వర్లు గతంలో నేర్చుకున్న ఎలక్ట్రీషియన్‌ పనిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నారు. 

‘గతంలో మా ఇద్దరికి కలిపి రూ.20 వేలు వస్తుండేవి.. ఇప్పుడు అందులో సగం వచ్చినా.. సంసారం సాఫీగానే నడుస్తోంది’ అని వెంకటేశ్వర్లు ఒకింత ధైర్యంగా చెబుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా  నెక్కొండకు చెందిన శ్రీనివాస్‌... లెక్కల మాస్టారు. 6 నెలల క్రితం ఎంతో గౌరవంగా బతికారు. పిల్లలకు లెక్కలు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారన్న పేరుంది. కానీ కరోనా తలకిందులు చేసింది. ఇప్పుడు మండల కేంద్రంలో దొరికే కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకువచ్చి చిన్నగదిలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ‘అటు పాఠశాల యాజమాన్యం.. ఇటు ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల టీచర్లను పట్టించుకోవడం లేదు. అయినా బతకాలంటే ఏదో పనిచేయాలి.. అందుకే కూరగాయలు అమ్ముతున్నా’అని శ్రీనివాస్‌ తెలిపారు. 

ఇన్నాళ్లు ‘నమస్తే సార్‌’అనే పిలుపుకు అలవాటుపడ్డ చెవులవి. ఇప్పుడా సంబోధన లేదు. మరో పిలుపు. పర్వాలేదు... కుటుంబ నావను నడిపించడంలో అవేమీ అడ్డుకావు అని సర్దుకుపోతున్నారు. సొంతకాళ్లపై నిలబడ్డామనే సంతృప్తి ఒకవైపు... గుండెను మెలిపెడుతున్న గత తాలూకు జ్ఞాపకాలు మరోవైపు. కోవిడ్‌–19తో లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చిలో అన్ని విద్యాసంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఇక..ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో.. అందరినీ పక్కన పెట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని సాకాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే. కొందరు గతంలో నేర్చుకున్న వృత్తులపై దృష్టి పెట్టగా, మరికొందరు సొంతూళ్లకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొందరు కిరాణ, టిఫిన్‌ సెంటర్లు, పాలకేంద్రాలు తదితర వ్యాపారాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కరోనా గురువుల జీవితాల్లో ఎలాంటి కల్లోలం రేపింది.. ప్రత్యామ్నాయ ఉపాధిలో ఎలా ముందుకెళ్తున్నారు.. కుటుంబ నావను ఎలా నడిపిస్తున్నారనే అంశాలపై ‘సాక్షి’దృష్టి సారించింది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో పలువురు ఉపాధ్యాయులు, లెక్చరర్లను పలకరించి అందిస్తున్న ‘గ్రౌండ్‌ రిపోర్ట్‌’ఇది...
– సాక్షి నెట్‌వర్క్‌

మగ్గం పనిచేస్తూ.. ఉపాధి 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నానచర్ల రమేష్‌ ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో పాఠశాలను మూసివేశారు. ఇంతవరకు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌ తరగతులు కూడా నడవని పరిస్థితి. పాఠశాల యాజమాన్యం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కుటుంబం గడవడం కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పు చేశారు. పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అతను ఇంటర్మీడియట్‌ చదివే సమయంలో తన ఇంటి పక్కన ఉన్న పద్మశాలి ఇంట్లో మగ్గం పని నేర్చుకున్నాడు. అప్పట్లో నేర్చుకున్న మగ్గం పని ఇప్పుడు అక్కరకు వచ్చింది. స్థానికంగా ఉన్న నేతన్న దగ్గర పనికి కుదిరాడు. నెలకు రూ.17 వేల దాకా ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘సుమారు 10 నెలల నుంచి పాఠశాలలు తెరవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలా అని కుంగిపోలేదు. అప్పడు నేర్చుకున్న పని ఇప్పుడు అక్కరకు వచ్చింది’అని రమేష్‌ చెప్పారు. 

వాయిద్యాలతోనే పూట గడుస్తోంది
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్‌ టీచర్లు. ఒకరు గంగారపు రాజయ్య, మరొకరు కాసగోని వెంకటేశ్వర్లు. రాజయ్య వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని సిలోయమ్‌ స్కూల్లో పీఈటీగా పని చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించేవారు. కాసగోని వెంకటేశ్వర్లు సైతం హన్మకొండ సమీపంలోని చింతగట్టు క్యాంపులోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి వేయడంతో వీరికి జీవనోపాధి ఇబ్బందిగా మారింది. దీంతో వీరు కూలి పనులతో పాటు గ్రామాల్లో జరిగే శుభకార్యాలలో వాయిద్యాలు వాయిస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.

చేపలు అమ్ముతున్నా..
నేను ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివాను. బీఎడ్‌ చేశాను. పదేళ్లు స్థానిక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాను. మా ఇంట్లో నలుగురు సభ్యులం. కుటుంబపోషణ భారం నాదే. కరోనా వల్ల కళాశాలలు తెరిచే పరిస్థితి లేనందున కుటుంబ పోషణ కోసం చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నా. ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా... అందుకే ధైర్యంగా చేపలు విక్రయిస్తూ ముందుకు సాగుతున్నాను. కళాశాలలు పునఃప్రారంభమైతే మళ్లీ లెక్చరర్‌గా పని చేస్తా.
– సాయికుమార్, నిజామాబాద్‌

పొలం లీజుకు తీసుకున్న..
వ్యాయామ వృత్తి విద్య పూర్తి చేశాను. కరీంనగర్‌లోని సిద్ధార్థ పాఠశాలలో పీఈటీగా పనిచేశాను. కరోనా ప్రభావంతో స్కూల్‌ జీవితం ముగిసినట్లయ్యింది. మా సొంతూరు చిమ్మనపల్లి గ్రామం.. సిరికొండ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరీంనగర్‌లో రూం కిరాయి కట్టలేక ఖాళీ చేసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ మాకున్న రెండెకరాల పొలంలో పనిచేసుకుంటున్నాను. ఇంకా పక్క వారి మూడు ఎకరాలు లీజుకు తీసుకుని అందులో కూడా పొలం చేస్తున్నాను. స్కూల్‌ లైఫ్‌లో పొలం పని చేసేవాడిని కాను. చివరకు పెద్దల నుంచి వచ్చిన భూమి నాకు జీవనోపాధి అయింది. స్కూల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను తప్ప అందరినీ ఆదుకుంది. ఇప్పటికైనా మాకు నిరుద్యోగ భృతి చెల్లించాలి.– బి.రఘుపతి, ప్రైవేటు పీఈటీ, రాజన్న సిరిసిల్ల జిల్లా.

మాస్కులు, టాయ్స్, సానిటైజర్స్‌ అమ్ముతున్నా
నేను కరీంనగర్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్‌ ఫీల్డ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. కరోనా వైరస్‌ వచ్చి అందరినీ అతలాకుతలం చేస్తుందని ఊహించలేదు. స్కూళ్లు మూతపడి... జీవనోపాధి కరువై ప్రైవేటు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఆర్థిక స్థోమత లేక... ఏం చేయాలో అర్థం కాకా చివరికి మాస్క్‌లు, టాయ్స్, సానిటైజర్స్, కర్చీఫ్స్‌ అమ్ముతూ బతుకుబండిని లాగిస్తున్నా. జగిత్యాల రోడ్‌ రేకుర్తి శివారులో చిన్న గుడిసెలో పెట్టి అమ్ముతున్నాను. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోండి లేదంటే పాఠశాలలు తెరవండి అని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నా.
– ఎస్‌.సతీష్, కరీంనగర్‌

కిరాణం కొట్టులో పనికి కుదిరి..
వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండకు చెందిన శిరీష స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో నెలకు రూ.6 వేల వేతనంతో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది.  కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. జీతాలు ఇవ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో  ఓ కిరాణ కొట్టులో పనికి కుదిరింది. ‘ఇప్పటికైతే బాగానే ఉంది. పాఠాలు చెప్పడంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. పాఠశాలలు తెరుచుకుంటే తిరిగి టీచర్‌గా వెళ్తాను. లేదంటే ఇక్కడే పనిచేస్తాను’ అని శిరీష తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement