కడప సెవెన్‌రోడ్స్ : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయుల, అధ్యాపకుల శ్రమను దోపిడీ చేస్తున్నా ప్రభుత్వానికి పట్ట డం లేదని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, లెక్చరర్ల యూనియన్ నాయకులు విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా శనివా రం కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు పనిభారం విపరీతంగా ఉం దని తెలిపారు. ఆదివారం, రెండో శనివారం, జాతీయ సెలవు దినాలు తమకు విద్యా సంస్థలు వర్తింప చేయడం లేదని ఆరోపించారు.
కుటుంబ సభ్యులతో గడిపేందుకు సైతం సమయం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 10 గంటలు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నప్పటికీ, వేతనాలు మాత్రం అరకొరగానే ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చే వేతనా లను తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక పనిగంటలకు ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. జీఓ నంబరు 1ని అమలు చేయాలని చేయాలన్నారు. తమకు చట్టపరంగా లభించాల్సిన పీఎఫ్,ఈఎస్‌ఐ సౌకర్యాలను యాజమాన్యాలు కల్పించడం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దపాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం విచారకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే తమ ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల తాము పొట్ట కూటికోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేయాల్సిన దుర్గతి దాపురించిందన్నా రు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆర్‌సీపీ నాయకుడు నరసింహా, ఆర్‌టీయూ నాయకులు గంగన్న, సుబ్బయ్యలు సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు రాజు, రాయపురెడ్డి, బాబానుబాష, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment