పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే | Autonomous colleges will soon have to use question papers set by JNTU | Sakshi
Sakshi News home page

పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే

Published Fri, Mar 26 2021 5:34 AM | Last Updated on Fri, Mar 26 2021 8:23 AM

Autonomous colleges will soon have to use question papers set by JNTU - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని అటానమస్‌ (స్వయం ప్రతిపత్తి), నాన్‌ అటానమస్‌ కాలేజీలలో ఇక నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల బాధ్యత  పూర్తిగా ప్రభుత్వ యూనివర్సిటీలదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, అన్ని కాలేజీలకూ ప్రభుత్వ యూనివర్సిటీలు తయారు చేసిన ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  అటానమస్‌ కాలేజీల్లో పరీక్ష విధానం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ప్రతిభతో కూడిన విద్యను అందించడంతో పాటు పరీక్షల్లో అక్రమాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకు రావాలన్నారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.

అన్ని కాలేజీలకు ఒకే విధానం
► ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులున్న నాన్‌ అటానమస్‌ కాలేజీలకు జేఎన్‌టీయూ (కాకినాడ), జేఎన్‌టీయూ (అనంతపురం)లు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తుండగా అటానమస్‌ కాలేజీల యాజమాన్యాలే ప్రశ్నపత్రాలు రూపొందించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
► బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల నాన్‌ అటానమస్‌ డిగ్రీ కాలేజీలకు ఆయా ఇతర యూనివర్సిటీలు పరీక్షలు పెడుతుండగా, అటానమస్‌ కాలేజీలు తమ పరీక్షలు తామే పెట్టుకుంటున్నాయి.
► ఇకపై అక్రమాలకు తావు లేకుండా అన్ని కాలేజీల్లో ఒకే రకమైన పరీక్షల విధానం అమలు చేయాలి. ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సులు, బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల కాలేజీలన్నిటికీ ఈ విధానం వర్తిస్తుంది.  


ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలి
► ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 6 వేల మంది పోలీసుల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
► ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సిహెచ్‌ఈ)  చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


ఏప్రిల్‌ 9న జగనన్న విద్యా దీవెన, 27న వసతి దీవెన
► ఏప్రిల్‌ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో  జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
► జగనన్న విద్యా దీవెన కింద దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల వరకు పెరుగుదల ఉందని, విద్యా దీవెన ద్వారా పిల్లల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా తల్లిదండ్రుల్లో వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. అందుకే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయని చెప్పారు.
► ఎన్నికల నోటిఫికేషన్ల కారణంగా ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదలలో ఆలస్యమైంది.
► అటానమస్‌ కాలేజీల్లో యూనివర్సిటీలతో సంబంధం లేకుండా పరీక్షల నిర్వహణ అనేక అక్రమాలకు దారితీస్తోంది. ఈ దృష్ట్యా ఉన్నత ప్రమాణాలు ఏర్పడేలా అటానమస్‌ అయినా, నాన్‌ అటానమస్‌ అయినా అందరికీ ఒకే విధానంలో పరీక్షలు, ఫలితాలుండాలి. ఈ మేరకు ప్రభుత్వ యూనివర్సిటీలకు అధికారం కల్పించాలి.
► విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలి. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావడంతో పాటు ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement