సాక్షి, అమరావతి: పేద విద్యార్థులను కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జన వరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బుధవారం సీఎం లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది.
ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న మేలును ఒకసారి పరిశీలిస్తే..
‘జగనన్న విద్యా దీవెన’..
పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది.
‘జగనన్న వసతి దీవెన’..
అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. అలాగే..
► ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లను ప్రభుత్వం జమచేసింది.
► గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టింది. ఇలా 2017 నుంచి పెట్టిన బాకీలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు.
► ఇలా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు.
ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇలా..
► నిజానికి.. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన)తో పాటు భోజన, వసతి సౌకర్యాల (వసతి దీవెన) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
► ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల హానర్స్ కోర్సులు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టారు.
► ఇందులో భాగంగా విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలను ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.
► 40 రకాల నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా సేల్స్‌ఫోర్స్‌లో 33,000, ఏడబ్ల్యూఎస్‌లో 23,000, నాస్కామ్‌లో 20,000, పాలో ఆల్టోలో 10,000, ఆల్టెరిక్స్ డేటా అనలిటిక్స్‌లో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందించారు. ఇలా దేశంలో ఒకే ఏడాది రెండు లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే.
సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు..
► ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 కాగా.. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గింది. అంతేకాక.. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27శాతం అయితే, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే.
► 2018–19లో 32.4గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి 2020–21 నాటికి 94కు పెరిగింది.
► అలాగే, 2018–19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 2021–22 నాటికి 85,000కు పెరిగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే 80వేల మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఆగస్టు ముగిసేనాటికి ఇది మరింతగా పెరిగే అవకాశముంది.
డిజిటల్ విద్య దిశగా అడుగులు..
► మరోవైపు.. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు.. నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038.. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. అసలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఈ తరహా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment