తేడా మీరే చూడండి | CM YS Jagan At Tiruvuru Jagananna Vidya Deevena Public Meeting | Sakshi
Sakshi News home page

తేడా మీరే చూడండి

Published Mon, Mar 20 2023 1:46 AM | Last Updated on Mon, Mar 20 2023 5:10 PM

CM YS Jagan At Tiruvuru Jagananna Vidya Deevena Public Meeting - Sakshi

జగనన్న విద్యాదీవెన చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి బొత్స, ప్రజా ప్రతినిధులు, అధికారులు

దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగు­తున్నా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉందంటే అది ఆ దేవుడి మీద, మీ మీద మాత్రమే. అందువల్లే వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను.     
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గత ప్రభుత్వంలో అరకొర ఫీజులతో పేద పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించలేని దుస్థితి.. నేడు ఫీజు ఎంతైనా సరే.. మేమే చెల్లిస్తామంటూ పూర్తి భారం భుజాన వేసుకున్న ప్రభుత్వం ఇది.. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌.. అప్పుల పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ.. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు.

దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) విధానాన్ని నడిపిన గత ప్రభుత్వానికి.. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానాన్ని ఆచరిస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరే గమనించాలని అన్నారు. విప్లవాత్మక కార్యక్రమాలు, సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మనందరి ప్రభుత్వంలో ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కానేకాదని పునరుద్ఘాటించారు.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2022 అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. 9.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.698.68 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
చదువుతోనే వెలుగు 
► ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. 

► ఈ రోజు 17–20 ఏళ్ల మధ్య ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు వాళ్ల జీవితాలు సాఫీగా సాగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్దేశించేది ఒక్క చదువు మాత్రమే. 

► అందుకే మన రాష్ట్రంలో ఇవాళ ఎల్‌కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, ఆ బిడ్డ ఎదిగి మంచి డాక్టరో, ఇంజినీరో కావాలి. ఢిల్లీరావు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ కలెక్టర్‌గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా అందరి బతుకులు మారాలి.

ఫీజులు ఎంతైనా సరే..
► చదువులకు పేదరికం అడ్డు రాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను గొప్పగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కాలేజీల ఫీజులు రూ.70 వేలు, రూ.80 వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు ఉంటే.. ఇచ్చేదేమో రూ.35 వేలు మాత్రమే. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం.

► మనందరి ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారుస్తూ 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నాం.  ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మాత్రమే 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ.9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు ఎగ్గొట్టిన రూ.1,777 కోట్లు కూడా చిరునవ్వుతో చెల్లించాం. 

► ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల వారికి కాలేజీలను ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం. పిల్లల బాగోగులూ స్వయంగా తెలుసుకోవచ్చు. యాజమాన్యాల నుంచి ఇబ్బంది ఉంటే నేరుగా 1902కు ఫోన్‌ చేస్తే, సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. 

► వసతి దీవెన కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఏటా రూ.20 వేలు చొప్పున రెండు దఫాలుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 11న ఇవ్వాలని నిర్ణయించాం.

మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి 
► మన పిల్లలు బాగా చదవాలని, ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం. మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. అందుకే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 45 నెలల్లో రూ.13,311 కోట్లు ఖర్చు చేశాం. అందువల్లే కాలేజీల్లో చేరికలు బాగా పెరిగాయి.  2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరితే, 2022–23లో ఆ సంఖ్య 1.20 లక్షలకు చేరింది.  

► ఇంటర్‌ పాసై చదువుకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 ఉంటే,  2022–23లో ఆ సంఖ్య 22,387కు తగ్గిపోయింది. ఈ సంఖ్య సున్నా కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోంది. 2018–19లో 37 వేలు ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 2021–22లో ఏకంగా 85 వేలకు చేరింది.

► ఇంటర్‌ తర్వాత చదువు ఆపేసిన విద్యార్థుల సంఖ్య దేశంలో సగటున 27 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌ – అంటే 17–23 ఏళ్ల పిల్లలు కాలేజీల్లో చదవడం) 2018–19లో దేశం సగటు 32.4 శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం.

► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, నాడు–నేడు, బైలింగువల్‌ టెక్టŠస్‌ బుక్స్, ఇంగ్లిష్‌ మీడియం తదితర కార్యక్రమాలతో పాటు ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌తో డిజిటల్‌ క్లాసు రూములు కాబోతున్నాయి. నాడు–నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వ తరగతి, ఆపై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 ఉన్నాయి.

వీటిలో 30,230 క్లాస్‌ రూమ్‌లలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్‌ చేయబోతున్నాం. 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి పిల్లాడికి ట్యాబ్స్‌ ఇస్తున్నాం. పదో తరగతి బోర్డు పరీక్షలు సీబీఎస్‌ఈ సిలబస్‌లో రాసేలా తర్ఫీదు ఇస్తున్నాం. 

ఉన్నత విద్యలోనూ మార్పులు 
► హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకొచ్చాం. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీగా మార్చాం.   ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. కరిక్యులమ్‌తో అనుసంధానం చేస్తూ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం.

జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్చుకుంటూ పోతున్నాం. ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్‌ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చేట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. 

► ప్రభుత్వ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీ పడలేవు అన్న మాటను రెండేళ్లలో తుడిచేస్తాం. రెండేళ్ల తర్వాత కార్పొరేట్‌ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడలేకపోతున్నాయనేలా చేస్తాం.  

► మనబడి నాడు–నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలో, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులో, వైఎస్సార్‌ అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీని పెట్టాం. ఈ ఏడాది పులివెందులలో అగ్రికల్చర్‌ కాలేజీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 

► వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలను నాడు–నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు.

ఇంటింటా ఆనందం.. అదే సర్కారు లక్ష్యం
► ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ, నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. అందువల్లే ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం.. తదితర వాటిని కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నాం.

► గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఎలాంటి వివక్ష, లంచాలకు చోటు లేకుండా నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం.

తోడేళ్లు ఏకమవుతున్నాయి..
► మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదంటున్న దుష్ట చతుష్టయం ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతోంది? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి? ఏ విషయంలోనూ మనతో పోల్చుకునేందుకు అర్హత లేని వారంతా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? మనందరి ప్రభుత్వంపై ఎందుకు రాళ్లు వేస్తున్నారు? వారు చెబుతున్నదే నిజమైతే ఒంటరిగా 175 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని నేను సవాల్‌ చేస్తున్నా. ఈ సవాల్‌ స్వీకరించే దమ్ము, ధైర్యం మీకుందా? 

► దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్‌ ఎవరో తెలుసా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. కుటుంబ, మానవత, రాజకీయ విలువలు లేని ఈ దుష్ట చతుష్టయంతో ఇవాళ మనం యుద్ధం చేస్తున్నాం. వారు ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుంది. 

► రామాయణం చూసినా, భారతం చూసినా, బైబిల్‌ చదివినా, ఖురాన్‌ చదివినా.. ఏ సినిమాకు వెళ్లినా అదే కనిపిస్తుంది. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు నిండు మనసుతో ఆశీర్వదిస్తుండగా, ఆ దేవుడు దీవిస్తుండగా అడుగులు ముందుకు వేస్తున్నాను.

తిరువూరుకు వరాలు
► తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్‌ బ్రిడ్జి కోసం రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నాం.

► ఎ.కొండూరులో కిడ్నీ బాధితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాల సరఫరా కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. 

► దాదాపుగా 8వేల పై చిలుకు ఇంటి స్థలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై వేగంగా కడుతున్నారు. మరో 6 వేల ఇళ్లు కావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాం. పది వేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే వీటి ఖరీదు దాదాపు రూ.250 కోట్లు. 

► రోడ్ల మరమ్మతు కోసం రూ.10 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్‌ సెంటర్‌ (ఐటీఐ, పాలిటెక్నిక్‌ తరహాలో) వస్తుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement