Autonomous colleges
-
‘అటానమస్’లోనూ ఏపీ అదుర్స్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. యూజీసీ కంటే ముందుచూపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు. ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్‌లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు. వీసీలతో యూజీసీ చర్చలు.. 2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సుల కోసం వినతి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నత విద్యామండలి తోడ్పాటు అందించాలని ఆ కాలేజీల కన్సార్టియం విన్నవించింది. యూజీసీ నుంచి వచ్చిన అటానసమ్ స్టాటస్ క్రియాశీలకంగా ఉన్నంత కాలం యూనివర్సిటీలు శాశ్వత గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరింది. విజయవాడలో సోమవారం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూల పరిధిలోని ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కాలేజీల కన్సార్టియం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, కార్యదర్శులు జీవీఎం మోహన్‌కుమార్, మిట్టపల్లి వి.కోటేశ్వరరావు, ఎన్.సతీష్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శాశ్వత గుర్తింపుతోపాటు యూజీసీ నిబంధనలను అనుసరించి యూనివర్సిటీలు అకడమిక్ స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 2035 నాటికి జీఈఆర్‌ను 50 శాతం మేర సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ప్రస్తుత అటానమస్ కాలేజీలను యూజీసీ, రాష్ట్ర యూనివర్సిటీ చట్టాల నిబంధనల మేరకు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అభివృద్ధి చెందుతున్న అంశాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైనింగ్, వర్చువల్ రియాలిటీలతో నాన్‌టెక్నికల్ యూజీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. (చదవండి: -
మల్టీ డిసిప్లినరీ అటానమస్ సంస్థలుగా కాలేజీలు
యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది. – సాక్షి, అమరావతి 2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది. భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్ సీట్ అలకేషన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్ డిగ్రీతో డ్యూయల్ డిగ్రీకి అవకాశం ఉంటుంది. క్లస్టర్లుగా కాలేజీలు ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్‌గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లస్టర్ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్ అక్రిడిటేషన్, ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. -
‘అటానమస్’ అక్రమాలకు చెక్: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అటానమస్ కాలేజీల్లో సొంతంగా పేపర్లు తయారు చేసుకోవడానికి కుదరదని స్పష్టం చేశారు. వాళ్లకు వారే పరీక్షలు పెట్టుకునే పరిస్థితి ఇక ఉండదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అటానమస్ కళాశాలపై సమీక్ష జరిపారని చెప్పారు. రాష్ట్రంలో 109 అటానమస్ కాలేజీలు ఉన్నాయని.. అక్కడ అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి డిగ్రీ విద్యలోనూ నైపుణ్యం పెంచాలని సీఎం నిర్ణయించారని.. అందుకే డిగ్రీలో అప్రెంటిస్ విధానం తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పూర్తి పారదర్శకత తేవాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించడంలేదని.. అందుకే ఆన్లైన్లో అడ్మిషన్ల విధానం తెచ్చామని వెల్లడించారు. ప్రతిపక్షాలు, వాటి అనుకూల పత్రికలు చాలా దుష్ప్రచారాలు చేశాయని.. కానీ గత ఏడాది కంటే డిగ్రీ అడ్మిషన్లు పెరిగాయని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు దక్కాయని పేర్కొన్నారు. అటామనస్ కాలేజీల్లో ఇన్నాళ్లు జరిగిన అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. దీనికి ఆటంకం కల్పించాలని ప్రయత్నించినా తాము అధిగమిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు యూజీసీతో కూడా దీనిపై సంప్రదిస్తామని తెలిపారు. అన్ని కాలేజీల్లో అకడమిక్ ఆడిటింగ్ కూడా చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. చదవండి: ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ 2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు: కన్నబాబు -
పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని అటానమస్ (స్వయం ప్రతిపత్తి), నాన్ అటానమస్ కాలేజీలలో ఇక నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యూనివర్సిటీలదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, అన్ని కాలేజీలకూ ప్రభుత్వ యూనివర్సిటీలు తయారు చేసిన ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ప్రతిభతో కూడిన విద్యను అందించడంతో పాటు పరీక్షల్లో అక్రమాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకు రావాలన్నారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. అన్ని కాలేజీలకు ఒకే విధానం ► ఇప్పటి వరకు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులున్న నాన్ అటానమస్ కాలేజీలకు జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం)లు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తుండగా అటానమస్ కాలేజీల యాజమాన్యాలే ప్రశ్నపత్రాలు రూపొందించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ► బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ కోర్సుల నాన్ అటానమస్ డిగ్రీ కాలేజీలకు ఆయా ఇతర యూనివర్సిటీలు పరీక్షలు పెడుతుండగా, అటానమస్ కాలేజీలు తమ పరీక్షలు తామే పెట్టుకుంటున్నాయి. ► ఇకపై అక్రమాలకు తావు లేకుండా అన్ని కాలేజీల్లో ఒకే రకమైన పరీక్షల విధానం అమలు చేయాలి. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, బీఏ, బీఎస్సీ, బీకాం తదితర నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల కాలేజీలన్నిటికీ ఈ విధానం వర్తిస్తుంది. ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలి ► ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 6 వేల మంది పోలీసుల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సిహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన, 27న వసతి దీవెన ► ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన కింద హాస్టల్, భోజన ఖర్చుల విడుదలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ► జగనన్న విద్యా దీవెన కింద దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50 వేల వరకు పెరుగుదల ఉందని, విద్యా దీవెన ద్వారా పిల్లల చదువులకు ఇబ్బంది రాదనే భరోసా తల్లిదండ్రుల్లో వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. అందుకే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయని చెప్పారు. ► ఎన్నికల నోటిఫికేషన్ల కారణంగా ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదలలో ఆలస్యమైంది. ► అటానమస్ కాలేజీల్లో యూనివర్సిటీలతో సంబంధం లేకుండా పరీక్షల నిర్వహణ అనేక అక్రమాలకు దారితీస్తోంది. ఈ దృష్ట్యా ఉన్నత ప్రమాణాలు ఏర్పడేలా అటానమస్ అయినా, నాన్ అటానమస్ అయినా అందరికీ ఒకే విధానంలో పరీక్షలు, ఫలితాలుండాలి. ఈ మేరకు ప్రభుత్వ యూనివర్సిటీలకు అధికారం కల్పించాలి. ► విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలి. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావడంతో పాటు ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలి. -
ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు
గూడూరు: ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు పనిచేస్తున్నాయని ఆ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు, కర్నూలు పుల్లారెడ్డి కళాశాల అధినేత సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజీనిరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూ అనంతపూర్ పరిధిలో 141 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 11 కళాశాలలకు మాత్రమే అటానమస్ గుర్తింపు ఉందన్నారు. అటానమస్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు 80 నుంచి 90 మంది డాక్టరేట్స్, ప్రతి విభాగంలో ఒక ప్రొఫసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫసర్లను నియమించుకోవాలని సూచించారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని కోరారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ విషయంలో ఏకీకృత విధానాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ కార్యదర్శి, నంద్యాల ఆర్జీఎం కళాశాల చైర్మన్ శాంతిరాయుడు, అసోసియేషన్ వైస్ చైర్మన్, అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి, నేదురుమల్లి విద్యా సంస్థల చైర్మన్ రాంకుమార్‌రెడ్డి, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలెలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాల విధానం అమలుపై ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విధానంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారంపై సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ఫీజులను సమీక్షించి పెంచాలని...తమ కాలేజీల్లో తామే ప్రవేశాలు చేపడతామని పేర్కొంటున్నాయి. అటానమస్ కాలేజీలు సైతం సొంతంగా ప్రవేశాలు చేపడతామని చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, కళాశాల విద్య కమిషనర్ వాణీప్రసాద్ ఇతర అధికారులు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు, అటానమస్ కాలేజీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భేటీలో చర్చకొచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాకే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మీరు కేటాయించే వారు మాకొద్దు... విద్యార్థి సామర్థ్యాలు, ఆర్థిక స్తోమతనుబట్టి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. విద్యార్థులను ఎంపిక చేసే అవకాశాన్ని తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వం కాలేజీకి పంపితే నాణ్యత ప్రమాణాలు పడిపోతాయని, సామర్థ్యాలు లేని విద్యార్థులు కాలేజీల్లోకి వస్తే మెరుగైన ఫలితాలు రావని చెబుతున్నాయి. పైగా ఈ ప్రవేశాలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లింకు పెట్టవద్దని...ఫీజులు చెల్లించలేని వారు కౌన్సెలింగ్ ద్వారా వస్తే కాలేజీల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంటున్నాయి. ఇప్పటికిప్పుడు కష్టమే... ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు చేపట్టాలంటే రాష్ట్రంలోని 1,280 డిగ్రీ కాలేజీలు ఆఫర్ చేస్తున్న కోర్సులు వేలల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పటికిప్పుడు కాలేజీలవారీగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. అంతేకాకుండా వాటిల్లోని ఫీజులను వివరాలను పొందుపరచాల్సి ఉంది. ఇందు కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్) కచ్చితంగా అమలు చేయాలి. దీనిపై ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీలన్నీ వాటి పరిశీలనలో పడ్డాయి. ముఖ్యంగా సీబీసీఎస్‌లో విద్యా బోధన, కోర్సులను అనుసంధానించడం పెద్ద ప్రక్రియ. కనీసం ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ స్థాయిలోనైనా దానిని అమలు చేయాల్సి ఉంది. అంటే తమ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఆఫర్ చేసే కోర్సులను తమ తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాల్సి ఉంది. అప్పుడే విద్యార్థి తనకు ఇష్టమైన కాలేజీలో 60 శాతం కోర్ సబ్జెక్టులను ఎంచుకోవడంతో తాను అదనంగా కోరుకునే సబ్జెక్టులను 40 శాతం కోర్, కోర్ ఎలక్టివ్‌లను ఇతర కాలేజీల్లో ఎంచుకునే వీలుంటుంది. అందుకే వర్సిటీలన్నీ ఆ పనిపై దృష్టి సారించాయి. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టాలంటే కష్టమన్న భావన యూనివర్సిటీ వర్గాల్లోనూ నెలకొంది.