‘అటానమస్‌’లోనూ ఏపీ అదుర్స్‌! | Sakshi
Sakshi News home page

‘అటానమస్‌’లోనూ ఏపీ అదుర్స్‌!

Published Thu, Apr 18 2024 5:34 AM

AP among top 3 states with highest number of autonomous colleges - Sakshi

దేశంలో అత్యధిక అటానమస్‌ కళాశాలలు కలిగిన టాప్‌–3 రాష్ట్రాల్లో ఏపీ

తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత స్థానం 

165 ఉన్నత విద్య కళాశాలలకు అటానమస్‌ హోదా

పెద్ద రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ కంటే మెరుగైన పనితీరు

సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్‌ కళాశా­లలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహా­రాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళా­శాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి.

మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజ­స్థాన్, మధ్యప్రదేశ్‌ కంటే మెరుగైన విద్యా ప్రమా­ణా­లు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్‌ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. 
 
యూజీసీ కంటే ముందుచూపు  
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్‌ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు.

ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్‌ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్‌ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్‌తో పాటు నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌లో వర్సిటీలు, అటానమస్‌ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్‌లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు.   

వీసీలతో యూజీసీ చర్చలు..
2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి.

వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్‌ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్‌ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు.  విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులను ఆఫర్‌ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్‌కుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement