బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న దృశ్యం
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు వడ్డించడం అనే ప్రభుత్వ కొత్త కాన్సెప్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో అమలు కావాల్సిన మధ్యాహ్న భోజన పథకానికి మొదటిరోజు (బుధవారం) నుంచే బాలారిష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా కేవలం 7 కళాశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. 63 మండలాల్లోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ఎయిడెడ్ కళాశాలలు మొత్తంగా 47 కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 22 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు.
బుధవారం జిల్లాలోని పెద్దపప్పూరు, తాడిపత్రి, గుదిబండ, మడకశిర, హిందూపురం, తనకల్లు, రాయదుర్గంలోని కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం అమలైంది. రాయదుర్గంలో రెండు కళాశాలలు ఉండగా బాలికల జూనియర్ కళాశాలలో మాత్రమే భోజనం వడ్డించారు. సమీప పాఠశాల ఏజెన్సీ నుంచి మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్లకు జీవో జారీ అయింది. అయితే కుకింగ్ ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం వడ్డించేలా విద్యాశాఖ నుంచి తమకు ఆదేశాలు లేకపోవడంతోనే తాము హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇవ్వలేదని పలువురు ఎంఓఈలు పేర్కొంటున్నారు. ఈ కారణంగా 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి రోజు మధ్యాహ్న భోజనం అమలు కాలేదు. అంతేకాదు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని ఎంఈఓ నుంచి ఆదేశాలు తమకు అందలేదని కొందరు వంట ఏజెన్సీ నిరా>్వహకులు చెబుతున్నారు. ఇలా అధికారుల మధ్య సమన్వయ లోపంతో పథకం ప్రారంభమైనా కళాశాల విద్యార్థులు పస్తులుండాల్సి వస్తోంది.
అమలుపై శ్రద్ధ ఏదీ?
ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మ«ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రకటించింది. దీంతో కళాశాలకు దూరం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చి చదువుకునే పేద విద్యార్థులు ఎంతో సంతోషపడ్డారు. అయితే అందుకు తగిన విధివిధానాలు రూపొందించడంలో సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 1 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ దిశగా మందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వం జూనియర్ కళాశాలల వారీగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారికి ప్లేట్లు, గ్లాసులు ఎన్ని కావాలి, వంట వండటానికి ఎన్ని వంటపాత్రలు కావాలన్న దానిపై కసరత్తు చేయకపోవడంతోనే అన్ని కళాశాలల్లో మొదటి రోజు భోజనం అందలేదు.
ఏజెన్సీలపై అదనపు భారం
పాఠశాల కుకింగ్ ఏజెన్సీలకు మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు స్వచ్ఛంధ, ప్రైవేటు సంస్థలకు భోజన పథకాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదనపు వంట పాత్రలు లేవు, విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించడంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.
వివరాలు స్పష్టంగా ఉన్నాయి
కళాశాలల్లో సమీప కుకింగ్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్‌చే జారీ చేసిన జీవో కాపీలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించాం. పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజనాన్ని కళాశాల విద్యార్థులకు అమలు చేసేలా స్పష్టంగా వివరాలు జీవోలు ఉన్నాయి. అందుకు ఒక ప్రత్యేక ఖాతాను సైతం ఏర్పాటు చేసుకుంటే బిల్లులు మంజూరవుతాయి. గురువారం నుంచి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ఎంఈఓలు కృషి చేయాలి.– చంద్రశేఖర్‌రావు, డీవీఈఓ
Comments
Please login to add a commentAdd a comment