ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో సర్కారు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ అధ్యాపకులతోనే బోధన సాగుతోంది. ఇంకా ఖాళీల కొరత ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు లేకపోవడంతో జూనియర్ లెక్చరర్ల నియామకాలు జరగడం లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు కూడా లేవు. ప్రతియేడు అవసరమున్నచోట గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ వల్ల కళాశాలల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు జిల్లాకు రాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జూనియర్ కళాశాలల్లో..ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. 13 కళాశాలల్లో కలిపి మంజూరు పోస్టులు 175 కాగా, వీటిలో 13 మంది రెగ్యులర్, 132 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 30 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. లైబ్రేరియన్లు, పీడీల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు.
డిగ్రీ కళాశాలల్లో..
జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కూడా ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌లు లేరు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పాలన గాడిన పడడం లేదు. కళాశాలల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో 17 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. పది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ఒకరు గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు.
మరో ముగ్గురు ఆన్‌డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ పురుషుల డిగ్రీ కళాశాలలో 34 పోస్టులకు గాను 22 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో పది పోస్టులకు గాను ముగ్గురు విధులు నిర్వర్తిస్తుండగా, ఇందులో నుంచి ఒకరు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలకు ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఒక లెక్చరర్ సెలవులో ఉండగా, ఒక లెక్చరర్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఈ కళాశాలకు ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్‌గా ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఎనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు బోధిస్తున్నారు. ఈ కళాశాలలో హిందీ పోస్టు మంజూరు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్‌తోనే ప్రతియేడు బోధిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
సంఖ్య పెరిగినా.. సౌకర్యాలు కరువు
సర్కారు కళాశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు, బోధన సిబ్బందిని ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తోంది. జిల్లాలో డిగ్రీ కళాశాల ఫలితాల పరంగా చూస్తే కనీసం 20శాతం కూడా విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంలేదు. సరైన విద్యాబోధన లేకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
కళాశాలలకు నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. వేతనాలు సరిపడా నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో న్యాక్ గుర్తింపు గ్రేడ్ తక్కువగా వస్తుంది. లెక్చరర్లు పూర్తిస్థాయిలో ఉంటేనే వారు కీలకంగా వ్యవహరిస్తారు. న్యాక్ ఏ–గ్రేడ్ గుర్తింపు ఉంటే నిధులు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment