Guest lecturers
-
‘ఇంటర్’ క్లాసులు చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్ : విద్యాసంవత్సరం మొదలైనా.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో బోధన సాగడం లేదు. అన్నిచోట్ల అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏటా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేవారు. ఫలితంగా బోధన అనుకున్న మేర జరిగేది.ఈ సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అసలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరగా సిలబస్ పూర్తి చేయాలి. అప్పుడే వారు జేఈఈ, రాష్ట్ర ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వెసులుబాటు ఉంటుంది. త్వరలో 1372 మంది కొత్త లెక్చరర్లు వస్తారని...పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించారు. త్వరలో ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ఇంటర్వ్యూ లేకపోవడంతో మెరిట్ ప్రకారమే నియామకాలుంటాయి. దీంతో గెస్ట్ లెక్చరర్ల అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గెస్ట్ లెక్చరర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.అయితే వీరి అవసరాన్ని తెలియజేస్తూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టి, ఆర్డర్లు ఇచ్చే వరకూ ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.కొత్తగా వచ్చినవారు కాలేజీల్లో బోధన చేపట్టే వరకూ కొంత సమయం పడుతుందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. అప్పటి వరకూ కాలం వృథా అవుతుందని, ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు. బోధన సాగేదెలా..?నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటారా? లేదా? స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందని అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో 418 ప్రభుత్వ జూనియర్ కాలేజీఉన్నాయి. గత ఏడాది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేశారు. వీరితో కలుపుకుంటే 3900 మంది శాశ్వత అధ్యాపకులున్నారు. మరో 72 మంది మినిమమ్ టైం స్కేల్‌తో పనిచేసే అధ్యాపకులున్నారు. ఇంకా 413 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. కొంతమంది రిటైర్ అయ్యారు. సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల నియామకం జరిగినా కనీసం 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉంటుంది. ఏటా రాష్ట్రంలో 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటున్నారు. వీరి సర్వీస్‌ను ప్రతీ ఏటా సంవత్సరం పాటు పొడిగిస్తూ వస్తున్నారు. వీరికి నెలకు రూ. 27 వేలు ఇస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల కన్నా ఎక్కువ క్లాసులే చెబుతున్నామనేది వారి వాదన. నిజానికి గడచిన ఐదేళ్లుగా ఒక్క సైన్స్ అధ్యాపకుడిని కూడా నియమించలేదు. మేథ్స్ లెక్చరర్ల కొరత ప్రతీ కాలేజీలోనూ ఉంది. రాష్ట్రంలో 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీస వసతులు కూడా లేవు. గదులు, బల్లాలు సమకూర్చలేదు. ఫ్యాకల్టీ అరకొరగా ఉంది. బదిలీలు చేపట్టకపోవడంతో కొత్తవారు వచ్చే అవకాశమే లేదు. ఇన్ని సమస్యల మధ్య గెస్ట్ లెక్చరర్లను తీసుకోకపోతే విద్యార్థులు నష్టపోతారని పలువురు అంటున్నారు. అవసరం ఉంటే తీసుకుంటాం అవసరం ఉంటే గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటాం. ఎంతమేర అవసరం అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. వీలైనంత త్వరగా ఇంటర్ కాలేజీల్లో పూర్తిస్థాయిలో బోధన చేపట్టేందుకు ప్రయత్నిస్తాం. –శ్రుతిఓజా, ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగెస్ట్ లెక్చరర్లు లేకుంటే కష్టమే ప్రభుత్వ కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుతారు. అవసరమైన బోధకులు ఉంటే తప్ప వారికి నాణ్యమైన విద్య అందించలేం. కొత్త కాలేజీల్లో వసతులు లేవు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉంది. తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి, సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా చూడాలి. –మాచర్ల రామకృష్ణగౌడ్ ప్రభుత్వ ఇంటర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి -
గుడ్‌న్యూస్.. తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల(గెస్ట్ లెక్చరర్లు) నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు. కాగా, ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో కాలేజీలవారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలి. ఇక, 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్ 28న ఎంపికైన గెస్ట్ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు. నియమించిన అతిథి అధ్యాపకులు వచ్చే నెల 1న సంబంధిత కాలే జీల ప్రిన్సి పాళ్లకు రిపోర్టు చేయాలి. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నియామక ప్రక్రియ అనివార్యమైందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్ -
గెస్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వచ్చే సోమవారం కల్లా వారిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని, లేదంటే మంగళవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేసింది. అతిథి అధ్యాపకుల (గెస్ట్ లెక్చరర్లు)ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేసేవారని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారిని విధుల్లోకి తీసుకోలేదని ఆ వినతిపత్రంలో తెలిపారు. కళాశాలల్లో అధ్యాపకులే లేరని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఎలా చేరతారని ప్రశ్నించారు. అలాగే గత విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చరర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. అంతకుముందు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కూడా కలిసిన శివసేనారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. -
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
గుడ్‌న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేయకుంటే 12న ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళా శాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని, ఆ జాబితాను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి పంపకుంటే అదేరోజు ఆందోళన చేపడతామని ఇంటర్ విద్యా పరి రక్షణ సమితి హెచ్చరించింది. ఈ మేరకు ఇం టర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ కరణ సాధన సమితి సమన్వయకర్త కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. -
పేరుకు గెస్ట్.. బతుకు వేస్ట్!
రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 30 శాతానికి పైగా కాలేజీలు గెస్ట్ ఫ్యాకల్టీ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. నగరంలోని బేగంపేట డిగ్రీ కళాశాలలో 70 మంది లెక్చరర్స్ పనిచేస్తుండగా అందులో 32 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులోనూ 10 మంది కాంట్రాక్టు లెక్చరర్స్ ఉన్నారు. మిగితా రెగ్యులర్ లెక్చరర్స్‌కు అడ్మినిస్ట్రేషన్ పనులు, యూజీసీ, ఎగ్జామ్స్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లుగా ఉంటే గెస్ట్ ఫ్యాకల్టీ బోధన చేస్తారు. కొంచెం అటూఇటూగా అన్నికళాశాలల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ముషీరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్స్‌తో తరగతులను నిర్వహించిన ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇవ్వడం మరిచిపోయింది. 2018–19 విద్యా సంవత్సరం ముగిసి 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా గతేడాది పనిచేసిన 10 నెలల వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రం లోని 863 మంది గెస్ట్ లెక్చరర్స్ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్స్ పోస్టులను సృష్టించింది. వీరికి పని గంటలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లెక్చరర్ నెలకు కనీసం 72 గంటలు బోధించేలా గంటకు రూ.300 వేతనాన్నినిర్ణయించింది. దాని ప్రకారం ఒకొక్కరికి నెలకు రూ.21,600 చెల్లించాలి. వీరికి సెలవు దినాల్లో ఎలాంటి వేతనం ఉండదు. రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 863 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తుండగా హైదరాబాద్ జిల్లాల్లో 11 డిగ్రీ కళాశాలల్లో 123 మంది సేవలందిస్తున్నారు. విధులకు హాజరైతేనే రెన్యూవల్ జూన్ 13న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గత 50 రోజులుగా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నా గెస్ట్ లెక్చరర్స్‌కు జీతం ఇవ్వకపోవడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలనే డిమాండ్‌తో విధులకు రావడంలేదు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు తరగతులు జరగక నష్టపోతున్నారు. అయితే, విధులకు వస్తేనే పాత బకాయిలు చెల్లిస్తామని, రెన్యూవల్ కూడా చేస్తా మని ప్రిన్సిపల్స్ బెదిరిస్తున్నట్లు సమాచారం. కా నీ, ఉన్నత విద్యాశాఖ కమిషన్ మాత్రం గెస్ట్ లెక్చరర్స్‌కు మళ్లీ ఇంటర్వ్యూలు, డెమో ఇచ్చి చేరాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చినా.. స్కూళ్లలో విద్యా వలంటీర్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గత ఏడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్స్‌నే ఈ ఏడాది కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కానీ కళాశాల విద్యాశాఖ మాత్రం ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్స్‌ను రెన్యూవల్ చేయలేదు. పైగా కొత్తవారిని తీసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో 10 నెలల వేతనాల కోసం ఆందోళన చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్‌కు వేతనాలు రాకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది. నిధులు విడుదలైనా.. అనేక విజ్ఞప్తుల తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీకి రావాల్సిన 10 నెలల వేతనం సీఎం కేసీఆర్ సంతకం చేసి జూన్ 18న ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించినట్లు తెలిసింది. దానికి జీఓ కూడా జారీ చేశారు. కమిషనర్ మాత్రం ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మా బతుకులు దినదిన గండంగా మారింది. – కిషోర్ కుమార్, టీ–డిగ్రీ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు -
రెండేళ్లుగా జీతాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు : గెస్ట్ లెక్చరర్లు
-
కాంట్రాక్ట్ లెక్చరర్లే దిక్కు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో సర్కారు కళాశాలల పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ అధ్యాపకులతోనే బోధన సాగుతోంది. ఇంకా ఖాళీల కొరత ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు లేకపోవడంతో జూనియర్ లెక్చరర్ల నియామకాలు జరగడం లేదు. గత నాలుగైదు ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు కూడా లేవు. ప్రతియేడు అవసరమున్నచోట గెస్ట్ లెక్చరర్లను నియమించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ వల్ల కళాశాలల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు జిల్లాకు రాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జూనియర్ కళాశాలల్లో..ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 13 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. 13 కళాశాలల్లో కలిపి మంజూరు పోస్టులు 175 కాగా, వీటిలో 13 మంది రెగ్యులర్, 132 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, 30 మంది వరకు గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. లైబ్రేరియన్లు, పీడీల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. డిగ్రీ కళాశాలల్లో.. జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కూడా ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్లు లేరు. ఇన్చార్జి ప్రిన్సిపాల్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పాలన గాడిన పడడం లేదు. కళాశాలల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో 17 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. పది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ఒకరు గెస్ట్ లెక్చరర్ పనిచేస్తున్నారు. మరో ముగ్గురు ఆన్‌డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ పురుషుల డిగ్రీ కళాశాలలో 34 పోస్టులకు గాను 22 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది కాంట్రాక్ట్ పద్ధతిన, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో పది పోస్టులకు గాను ముగ్గురు విధులు నిర్వర్తిస్తుండగా, ఇందులో నుంచి ఒకరు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలకు ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఒక లెక్చరర్ సెలవులో ఉండగా, ఒక లెక్చరర్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఈ కళాశాలకు ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా ఎనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు బోధిస్తున్నారు. ఈ కళాశాలలో హిందీ పోస్టు మంజూరు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్‌తోనే ప్రతియేడు బోధిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. సంఖ్య పెరిగినా.. సౌకర్యాలు కరువు సర్కారు కళాశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు, బోధన సిబ్బందిని ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తోంది. జిల్లాలో డిగ్రీ కళాశాల ఫలితాల పరంగా చూస్తే కనీసం 20శాతం కూడా విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంలేదు. సరైన విద్యాబోధన లేకపోవడమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు నిధుల లేమి తీవ్రంగా వేధిస్తోంది. వేతనాలు సరిపడా నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో న్యాక్ గుర్తింపు గ్రేడ్ తక్కువగా వస్తుంది. లెక్చరర్లు పూర్తిస్థాయిలో ఉంటేనే వారు కీలకంగా వ్యవహరిస్తారు. న్యాక్ ఏ–గ్రేడ్ గుర్తింపు ఉంటే నిధులు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు. -
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్) కోసం నాంపల్లి బజార్‌ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరల్ ఫౌండేషన్ కోర్సు(జీఎఫ్‌సీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ), డైరీయింగ్లలో ఖాళీలు ఉన్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. జీఎఫ్‌సీకి ఎంఏ ఎకనామిక్స్, ఎంఎల్‌టీకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, డైరీయింగ్కు వెటర్నిటీ సైన్స్ చేసిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
గెస్ట్ లెక్చరర్ల నియామకాలపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 1,200 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకాలను పారదర్శకంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చేపడుతున్నామని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ అశోక్ చెప్పారు. అయితే ఒక సంఘం నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆరోíపించారు. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయడం కుదరదన్న విషయంలో ఓ సంఘం నేతలు అపార్థం చేసుకుంటున్నారని, పాత వారిని అలాగే కొనసాగించాలని పట్టు పడుతున్నారని విమర్శించారు. కొత్త వారి నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వవద్దని ప్రిన్సిపాళ్లకు ఒక సంఘం సమాచారం పంపించిందని ఆరోపించారు. పాత వారిని రెన్యువల్ చేయాల్సిందేనంటూ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీకి హక్కులు ఉండవన్న విషయాన్ని గుర్తించడం లేదన్నారు. గతంలో గౌరవ వేతనం తీసుకున్న వారికి, అనుభవం కలిగిన వారికి ఆయా సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఇదివరకు గెస్ట్ లెక్చరర్లుగా పని చేసిన వారికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు 205 కాలేజీల్లో నోటిఫికేషన్లు జారీ చేశామని, మరో 142 కాలేజీలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు వద్దంటే ఎలా?: ఇంటర్ విద్యా జేఏసీ 1,200 మంది గెస్ట్ లెక్చరర్లు జూన్, జూలైల్లో పనిచేశారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లోనూ పాల్గొన్నారని, ఇప్పుడు వారిని అకస్మాత్తుగా రోడ్డు న పడేస్తే ఎలాగని ప్రశ్నించారు. 2016–17లో పనిచేసిన వారందరిని 2017–18లో తీసుకున్నారని, ఇప్పుడు వారిని పక్కకు పెట్టడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రిన్సిపాళ్లకు బాధ్యతలు అప్పగించ డం వల్ల స్థానికంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, వారు పనిచేసే పరిస్థితి లేదని వెల్లడించారు. ‘సరైన షెడ్యూల్ లేకుండా ఎలా?’ ఉన్నతాధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్ అన్నారు. ఏ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలి.. ఎన్ని రోజులు దరఖాస్తులు స్వీకరించాలి.. డెమో, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించాలన్న వివరాలతో కూడిన షెడ్యూల్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యాల విషయంలోనూ స్పష్టత లేదన్నారు. -
నిధులూ లేవు.. సార్లూ లేరు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అవసరమైన లెక్చరర్ పోస్టులు భర్తీకాలేదు. గెస్ట్ లెక్చరర్ల నియామకంపై సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. సార్లు రాక కోసం విద్యారులు ఎదురు చూపులు చూడటం తప్ప పాఠాలు ముందుకు సాగ ట్లేదు. మరోవైపు కాలేజీల ఖాతాల్లో నిధులు లేక కనీ సం చాక్‌పీస్, డస్టర్లు కూడా కొనలేని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల దుస్థితి. కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కు రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 1.7 లక్షల మంది వరకు ఉంటారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా లెక్చరర్లు మాత్రం లేరు. మెజార్టీ కాలేజీలు కాంట్రాక్టు లెక్చరర్లతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. గతేడాది జూనియర్ లెక్చరర్లకు పదో న్నతి ఇచ్చారు. దీంతో అన్ని కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. కానీ లెక్చరర్లకు మాత్రం కొరత ఏర్పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో జూనియర్ లెక్చరర్లను బదిలీ చేయడంతో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసి న వారిని ఈ ఏడాది కూడా కొనసాగించాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల సంగతిని కూడా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీంతో వారూ అసంతృప్తితో ఉన్నారు. కాలేజీల ఖాతాలు ఖాళీ గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి సైన్స్ గ్రూపులకు రూ.835, హ్యుమానిటీస్ గ్రూపులకు రూ.530 చొప్పున వసూలు చేసి కాలేజీ ఖాతాలో జమ చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ నుంచి రూ.350 ట్యూషన్ ఫీజుగా కాలేజీలు మినహాయించుకునేవి. దీంతో ఒక్కో కాలే జీ ఖాతాలో ‘అక్యుములేషన్ ఫీజు’రూపంలో సగటు న రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు నిల్వ ఉం డేవి. 2016–17 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు పరికరాల కోసం రూ.1.58 లక్షలు చొప్పున ‘అక్యుములేషన్’ ఖాతా నుంచి ఖర్చు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. 2011–12లో కొత్తగా మంజూరైన 102 జూనియర్ కాలేజీలకు కూడా పాత కాలేజీల అక్యుములేషన్ నిధులనే వినియోగించడంతో ఆయా కాలేజీల ఖాతాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో ‘డే టు డే’నిధుల పేరిట కాలేజీల నిర్వహణకు 2017–18లో నిధులు ఇస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటిం చింది. అయితే విద్యా సంవత్సరం ముగిసినా నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో కాలేజీల్లో చాక్‌పీసులు, డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ‘దహెగాం’ దయనీయ గాథ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ‘దహెగాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ’ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది నేటికీ జెడ్పీ స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. గతంలో రెండు గదుల షెడ్డు నిర్మించినా కరెంటు, తాగునీరు, ఫర్నిచర్ లేకపోవడంతో నిరుపయోగం గా మారాయి. గతేడాది పదోన్నతిపై వచ్చిన ప్రిన్సిపాల్ ఈ షెడ్డును వినియోగంలోకి తెచ్చి స్టాఫ్‌రూం, ప్రయోగశాల ఏర్పాటు చేశారు. తరగతులు మాత్రం శిథిలావస్థకు చేరిన హైస్కూల్ గదుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది రెగ్యులర్ లెక్చరర్లకు గాను ఒక్కరూ లేక పోగా, 8 మంది కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. కాలేజీ నిర్వహణకు తాను ఖర్చు చేసిన రూ.60 వేలు ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్ పలుమార్లు ఇంటర్ బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేదు. గజ్వేల్‌లోనూ అదే పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ బాలికల జూనియర్ కాలేజీలో 720 మంది విద్యార్థులున్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. అయితే ప్రిన్సిపాల్ మినహా ఒక్క రెగ్యులర్ లెక్చరర్ కూడా లేరు. కేవలం ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది 14 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించారు. ప్రస్తుతం వారు కూడా లేరు. రెగ్యులర్ లెక్చరర్లు, సీనియర్ అసిస్టెంట్, పీడీ, లైబ్రేరియన్, వాచ్‌మన్, స్వీపర్ పోస్టులతో పాటు, ఫర్నిచర్ కావాలని బోర్డుకు లేఖలు రాసినా స్పందన లేదు. పాఠాలు చెప్పే వారేరీ? కాలేజీలో 170 మందికి పైగా విద్యార్థులు ఉన్నా గణిత, భౌతిక శాస్త్రాలకు మినహా మిగతా సబ్జెక్టులకు రెగ్యులర్ లెక్చరర్లు లేరు.కాలేజీ తెరిచి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. లెక్చరర్లు లేక విద్యార్థులు కూడా రెగ్యులర్‌గా కాలేజీకి రావడం లేదు. లెక్చరర్లు వస్తారని ఎదురు చూస్తూనే రెండు నెలలు గడిచిపోయాయి. – రాములు, ఇంటర్ సెకండ్ ఇయర్, సదాశివపేట జూనియర్ కాలేజీ, సంగారెడ్డి న్యాయం చేయలేకపోతున్నాం జూనియర్ కాలేజీల్లో ప్రస్తు తం మౌలిక వసతులు కొంత మెరుగయ్యాయి. రెగ్యులర్ లెక్చరర్లు లేక, కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీ జరగక, నిర్వహణ నిధుల్లేక కాలేజీల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల మీద భరోసాతో వస్తున్న పేద విద్యార్థులకు న్యా యం చేయలేకపోతున్నాం. గెస్ట్ లెక్చరర్ల నియామ కంతో పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. – కళింగ కృష్ణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం -
జాబ్ పర్మినెంట్ చేయాలంటూ మహిళ..
సాక్షి, భోపాల్: గత కొంతకాలం నుంచి తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ సమస్యలను వినడం లేదంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. రాజధాని భోపాల్‌లో వందలాది గెస్ట్ లెక్చరర్లు సమావేశమై తమ డిమాండ్ల సాధన కోసం చర్చించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేవరకూ ఆందోళనను విరమించేది లేదని, తమ పోరాటాన్ని మరింత ఉధృత చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ మహిళా గెస్ట్ లెక్చరర్ గుండు కొట్టించుకుని (శిరోముండనంతో) నిరసన తెలిపారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేస్తున్నా, ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని మా మహిళా లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్ సింగ్ ఇప్పటికైనా తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపించాలని కోరారు. -
అతిథి అధ్యాపకులకు అన్యాయం!
* విద్యా సంవత్సరం ముగుస్తున్నా జీతాలకు నోచుకోని వైనం * కాంట్రాక్ట్ లెక్చరర్లకూ ఐదు నెలలుగా జీతాలు నిల్ శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారీ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లగా పనిచేస్తున్న వారు ఏడాదిగా జీతాలకునోచుకోలేదు. దీంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో గెస్ట్ లెక్చరర్లకు ఏడాదిగా, కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఐదు నెలలుగా జీతాల్లేవు. జిల్లాలో పరిస్థితి ఇలా జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి సుమారు 61 లెక్చరర్ల పోస్టులకు అధ్యాపకులు లేకపోవడంతో ఆ ఖాళీలను గత విద్యాసంవత్సరం మాదిరీగానే అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్లు)తో భర్తీ చేయాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ భావించారు. దీంతో విశ్రాంత అధ్యాపకులతోపాటు గతం లో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసిన, అనుభవజ్ఞులైన అధ్యాపకులను కమిషనర్ సూచనల మేరకు నియమించారు. పీరియడ్‌కు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10 వేలకు మించకుండా గౌరవ భృతి చెల్లిస్తామంటూ.. డెమో ఇచ్చిన తర్వాత విద్యార్థుల సమ్మతి మేరకు వారిని నియమించారు. 2015 జూలై నెలాఖరు నుంచి ఆగస్ట్ నెల వరకు ఈ నియామకాలు జరిగాయి. సంక్రాంతికి రెండు నెలల జీతాలు చెల్లిస్తామంటూ బిల్లులు, వర్క్‌డన్ స్టేట్మెంట్లు సిద్ధం చేయించా రు. తీరా ప్రభుత్వం నుంచి నిధులు రాక ఉసురుమనిపించా రు. కళాశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలంటూ అక్కడి ప్రిన్సిపాళ్లు మెళికలుపెట్టిన భరించారు. అనుభవంతో విద్యార్థులకు క్లాసులు చెప్పి, సకాంలో సిలబస్‌లు సైతం ముగించారు. పరీక్షలకు సిద్ధం చేశారు. ఇన్నిచేసినా విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లకు ఇంతవరకు దమ్మిడీపైసా కూడా చెల్లించలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లదీ అదేదారి.. జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 390 మంది వరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సైతం గత ఐదు నెల లుగా జీతాలు చేతికందక అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు జరగకపోవడమే జీతాలు చెల్లించకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అం తర్జాతీయస్థాయిలో విద్యప్రమాణాలు అందిస్తామని డాబు లు చెబుతున్న సర్కారు కనీసం జీతాలను సైతం సకాలంలో చెల్లించకపోతుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలాఖరులోగా చెల్లిస్తాం గెస్ట్ లెక్చరర్లకు ఇంతవరకు జీతాలు చెల్లింపులు కాని మాట వాస్తవమే. ప్రభుత్వ నుంచి నిధులు కేటాయిం పులు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలో చెల్లిస్తాం. బిల్లులు పెట్టాలని ప్రిన్సిపాళ్లకు ఇప్పటికే సూచిం చాం. ఈ నెలాఖరులోగా కచ్చితంగా చెల్లింపులు చేస్తాం. - ఆర్.పున్నయ్య, డీవీఈవో, ఇంటర్మీడియెట్ విద్య