సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల(గెస్ట్ లెక్చరర్లు) నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు.
కాగా, ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో కాలేజీలవారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలి.
ఇక, 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్ 28న ఎంపికైన గెస్ట్ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు. నియమించిన అతిథి అధ్యాపకులు వచ్చే నెల 1న సంబంధిత కాలే జీల ప్రిన్సి పాళ్లకు రిపోర్టు చేయాలి. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నియామక ప్రక్రియ అనివార్యమైందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment