తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి మేడిగడ్డ లక్ష్మీ బారేజీ పియర్స్ కుంగడం తీవ్ర కలకలం రేపే అంశమే. శాసనసభ ఎన్నికల వేళ ఆ అంశం మరీ ఎక్కువ వివాదం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జాగ్రత్తపడినట్లు కనిపిస్తోంది. దానికి తోడు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీ ఎల్అండ్‌టీ ఈ పియర్స్ మరమ్మత్తులకు లేదంటే పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని చెప్పడం ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. విపక్షాలు కొన్ని ఆరోపణలు చేసినా.. అవన్నీ మీడియాలో మరీ ప్రముఖంగా రాకపోవడం కూడా గమనార్హమే. ఏపీలో ఇలాంటిది ఒక చిన్న ఘటన జరిగినా నానా రచ్చ,రచ్చ చేసే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు మాత్రం తెలంగాణలో కిక్కురుమనడం లేదు.
మేడిగడ్డ ప్రాజెక్టు బారేజీ కుంగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సడన్‌గా పెద్ద శబ్దంతో బారేజీ కుంగినట్లు చెబుతున్నారు. దాంతో అధికారులు అప్రమత్తమై ఏమి జాగ్రత్తలు తీసుకోవాలా అనేదానిపై ఆలోచనలు సాగిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వైఫల్యం ఉందా? లేక అధికారుల తప్పిదాలు ఉన్నాయా? లేక నిర్మాణ సంస్థ లోపాలు ఉన్నాయా? పియర్స్ ఫౌండేషన్‌లో తప్పులు జరిగాయా? మొదలైన విషయాలు తదుపరి విచారణలో తేలనున్నాయి.
✍️తొలుత పోలీసులు నిర్మాణ లోపాలు అని భావించారట. ఆ తర్వాత ఇందులో కుట్ర ఉండవచ్చని ఇంజనీర్లు చేసిన ఫిర్యాదు కొత్త కోణంగా కనిపిస్తోంది. నిజంగా అలాంటి కుట్ర ఏదైనా జరిగితే అది దారుణమైన విషయం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపై మొదటి నుంచి కొన్ని విమర్శలు లేకపోలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాగా వేగంగా నిర్మాణం చేసింది. ప్రాజెక్టుకు ఇప్పటికి ఎనభైవేల కోట్ల వ్యయం చేసినట్లు అంచనా. ఇది పూర్తి స్థాయిలో వినియోగం రావడానికి మరో ఇరవై,ముప్పై వేల కోట్ల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇంత వెచ్చించిన ప్రాజెక్టు.. అదే రేషియోలో ప్రజలకు ఉపయోగపడుతోందా? అనే చర్చ కూడా ఉంది. అయినప్పటికీ కేసీఆర్ ఒక సదుద్దేశంతో దీనిని నిర్మించారని అంతా భావించారు.
తెలంగాణలో నీటి సదుపాయం లేని ప్రాంతాలకు లిప్ట్ ద్వారా నీరు తెచ్చి సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ ఆలోచనను శంకించనవసరం లేదు. కాని ఇందులో హడావుడి కారణంగా తప్పులు జరిగాయా? అనే సందేహాలు వస్తున్నాయి. గోదావరిపై నిర్మించిన ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఒక భాగం. ఈ నదికి వరదలు వచ్చినప్పుడు ఒకసారి ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయి కొంత నష్టం జరిగింది. ఇప్పుడు బారేజీలోని రెండు పియర్స్ దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ఈ బారేజీ నిర్మాణానికి సుమారు రెండువేల కోట్ల వరకు వ్యయం అయింది. అయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నారు. కేవలం పియర్స్ మాత్రమే దెబ్బతిన్నందున ప్రాజెక్టుకు మరీ ప్రమాదం ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం.
✍️దీనిని ఏ రకంగా మరమ్మత్తు చేయవచ్చన్నదానిపై నిపుణులు ఆలోచిస్తారు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇలా జరగడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత చికాకే!. అసలే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. దానికి ఈ పరిణామం జత కలిసి ప్రభుత్వానికి తలనొప్పి తెస్తోంది. ఈ ప్రమాదం వల్ల బీఆర్‌ఎస్‌కు ఎన్నికలలో ఎంత నష్టం అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. వచ్చే నెల రోజులలో దీనిపై జరిగే పరిణామాలపై అది ఆధారపడి ఉంటుంది. కొంతమంది విద్యాధికులలో ఈ ప్రభావం ఉండవచ్చని, జనసామాన్యం మరీ అంత సీరియస్ గా పట్టించుకునే దశ లేదని అంటున్నారు.
ప్రత్యేకించి.. కొన్ని దినపత్రికలు, మరికొన్ని టీవీ చానళ్లు ఈ ఘటనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఈనాడు పత్రిక అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎత్తకుండా చాలా జాగ్రత్తగా వార్తలు ఇస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు కుదుపు అని అక్టోబర్ 23వ తేదీన రాసిన కథనంలో ప్రభుత్వ వైఫల్యం అనో, లేదా ఫలానా కారణమనో పేర్కొనలేదు. దీనిని బట్టే కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఈనాడు మీడియా ఎంత విధేయతతో ఉన్నదో అర్థమవుతోంది.
✍️ కొద్దికాలం క్రితం మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో ఆ సంస్థ డైరెక్టర్ ఒకరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తుంటే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దలు కల్పించుకుని, ఏవో సాంకేతిక కారణాలు చూపించి అరెస్టు కాకుండా వ్యవహరించిన సంగతిని గుర్తు చేసుకుంటే.. ఈనాడు ఇలాగే వ్యవహరిస్తుందిలే అనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ తప్పిదం లేకుంటే ఏదో ఒకటి ఆపాదించాలని అనడం లేదు. కాని ఆంద్రప్రదేశ్ లో ఈనాడు, జ్యోతి తదితర టిడిపి మీడియాలు చేస్తున్న అరాచకాన్ని పోల్చి చూసుకున్నప్పుడు రామోజీరావు వంటివారు తమ పత్రికలను,టీవీలను స్వార్ద ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నది తెలుస్తుంది.
✍️అదే ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియాలు చేస్తున్న అరాచకాన్ని పోల్చి చూసుకున్నప్పుడు రామోజీరావు వంటివారు తమ పత్రికలను, టీవీలను స్వార్ద ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నది తెలుస్తుంది. చివరికి ఈ ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బృందం వచ్చి వెళితే కూడా ఏదో మొక్కుబడిగా లోపలి పేజీలో చిన్న వార్త ఇచ్చి ఊరుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వరదలు రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దానికి కారణం చంద్రబాబు టైమ్ లో కాపర్ డామ్ ను పూర్తి చేయకుండా.. డయాఫ్రం వాల్ నిర్మించడం అని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెబుతోంది. అయినా డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఘటనను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు అంటగట్టి ఎన్ని కథనాలు రాసిందో చెప్పలేం.
✍️చివరికి పోలవరంలో సీపేజీ నీరు చేరినా అందుకు జగనే కారణం అన్నట్లు ప్రచారం చేశారు. ఆ సీపేజీ నీరు బయటకు పోవడానికి వీలుగా చానల్ తీస్తుంటే ఏదో దారుణం జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేశారు. ప్రాజెక్టులో గైడ్ బండ్ కొద్దిగా కుంగితే నానా యాగీ చేశారు. అది మట్టకట్ట.. దాని వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం లేదని తెలిసినా, ప్రజలలో ఒకరకమైన ఆందోళన ,భయం క్రియేట్ చేయడానికి శాయశక్తులా కృషి చేశారు.ఈ మధ్య' జగన్ మళ్లీ నీవే ఎందుకు రావాలి" అంటూ ఒక తప్పుడు కథనం రాశారు. అందులో సైతం పోలవరం పుట్టి ముంచేశారని ఒక నీచమైన వ్యాఖ్య చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎలాగైనా ముందుకు వెళ్లకూడదన్న ద్వేష భావంతో నిత్యం అనేక అసత్య వార్తలు రాసిన ఈనాడుకు తెలంగాణలో ఇంత పెద్ద ఘటన జరిగితే కళ్లుమూసుకుపోయాయి.
మీడియా ప్రమాణాలను ఇలా దిగజార్చేసిన ఈనాడు, లేదా ఆంధ్రజ్యోతి వంటివి ఏపీలో జగన్ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నాయి. ఈనాడు తెలంగాణలో ఒకరకంగాను, ఏపీలో మరో రకంగాను వ్యవహరిస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియచేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక వార్త రాయడానికి వణికిపోయే ఈనాడు మీడియా ఏపీలో మాత్రం ఇష్టారీతిన చెలరేగిపోతోంది. దీనిని ప్రజలు గుర్తించకుండా ఉంటారా!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment