పేరుకు గెస్ట్‌.. బతుకు వేస్ట్‌! | Wages Shortage in Guest Lecturers Hyderabad | Sakshi
Sakshi News home page

పేరుకు గెస్ట్‌.. బతుకు వేస్ట్‌!

Published Fri, Aug 2 2019 12:57 PM | Last Updated on Fri, Aug 2 2019 12:57 PM

Wages Shortage in Guest Lecturers Hyderabad - Sakshi

రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 30 శాతానికి పైగా కాలేజీలు గెస్ట్‌ ఫ్యాకల్టీ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. నగరంలోని బేగంపేట డిగ్రీ కళాశాలలో 70 మంది లెక్చరర్స్‌ పనిచేస్తుండగా అందులో 32 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులోనూ 10 మంది కాంట్రాక్టు లెక్చరర్స్‌ ఉన్నారు. మిగితా రెగ్యులర్‌ లెక్చరర్స్‌కు అడ్మినిస్ట్రేషన్‌ పనులు, యూజీసీ, ఎగ్జామ్స్, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్లుగా ఉంటే గెస్ట్‌ ఫ్యాకల్టీ బోధన చేస్తారు. కొంచెం అటూఇటూగా అన్నికళాశాలల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ముషీరాబాద్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో గెస్ట్‌ లెక్చరర్స్‌తో తరగతులను నిర్వహించిన ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇవ్వడం మరిచిపోయింది. 2018–19 విద్యా సంవత్సరం ముగిసి 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా గతేడాది పనిచేసిన 10 నెలల వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రం లోని 863 మంది గెస్ట్‌ లెక్చరర్స్‌ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గెస్ట్‌ లెక్చరర్స్‌ పోస్టులను సృష్టించింది. వీరికి పని గంటలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లెక్చరర్‌ నెలకు కనీసం 72 గంటలు బోధించేలా గంటకు రూ.300 వేతనాన్నినిర్ణయించింది. దాని ప్రకారం ఒకొక్కరికి నెలకు రూ.21,600 చెల్లించాలి. వీరికి సెలవు దినాల్లో ఎలాంటి వేతనం ఉండదు. రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 863 మంది గెస్ట్‌ లెక్చరర్స్‌ పనిచేస్తుండగా హైదరాబాద్‌ జిల్లాల్లో 11 డిగ్రీ కళాశాలల్లో 123 మంది సేవలందిస్తున్నారు. 

విధులకు హాజరైతేనే రెన్యూవల్‌
జూన్‌ 13న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గత 50 రోజులుగా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నా గెస్ట్‌ లెక్చరర్స్‌కు జీతం ఇవ్వకపోవడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్‌ చేయాలనే డిమాండ్‌తో విధులకు రావడంలేదు. దీంతో ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో చేరిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు తరగతులు  జరగక నష్టపోతున్నారు. అయితే, విధులకు వస్తేనే పాత బకాయిలు చెల్లిస్తామని, రెన్యూవల్‌ కూడా చేస్తా మని ప్రిన్సిపల్స్‌ బెదిరిస్తున్నట్లు సమాచారం. కా నీ, ఉన్నత విద్యాశాఖ కమిషన్‌ మాత్రం గెస్ట్‌ లెక్చరర్స్‌కు మళ్లీ ఇంటర్వ్యూలు, డెమో ఇచ్చి చేరాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

కోర్టు తీర్పు ఇచ్చినా..
స్కూళ్లలో విద్యా వలంటీర్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గత ఏడాది పనిచేసిన గెస్ట్‌ లెక్చరర్స్‌నే ఈ ఏడాది కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కానీ కళాశాల విద్యాశాఖ మాత్రం ఇప్పటికీ గెస్ట్‌ లెక్చరర్స్‌ను రెన్యూవల్‌ చేయలేదు. పైగా కొత్తవారిని తీసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. దీంతో 10 నెలల వేతనాల కోసం ఆందోళన చేస్తున్న గెస్ట్‌ లెక్చరర్స్‌కు వేతనాలు రాకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది.

నిధులు విడుదలైనా..
అనేక విజ్ఞప్తుల తర్వాత గెస్ట్‌ ఫ్యాకల్టీకి రావాల్సిన 10 నెలల వేతనం సీఎం కేసీఆర్‌ సంతకం చేసి జూన్‌ 18న ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించినట్లు తెలిసింది. దానికి జీఓ కూడా జారీ చేశారు. కమిషనర్‌ మాత్రం ప్రొసీడింగ్స్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మా బతుకులు దినదిన గండంగా మారింది.   – కిషోర్‌ కుమార్,   టీ–డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement