కరోనా.. ఇచ్చే సగం శాలరీల్లో కోత | Salary Cuttings in Private Hospitals And Schools Companies in Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా.. కోతలు

Published Thu, Apr 30 2020 10:44 AM | Last Updated on Thu, Apr 30 2020 2:33 PM

Salary Cuttings in Private Hospitals And Schools Companies in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సగటు వేతన జీవి చూపులన్నీ నెలాఖరుపైనే ఉంటాయి. ముప్పయ్యో తేదీ వచ్చిందంటే అకౌంట్‌లోకి జీతం వచ్చిపడుతుందనే భరోసా గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అప్పటికే వివిధ రకాల అవసరాలు ఎదురుచూస్తుంటాయి. ఇంటి అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, నిత్యావసర వస్తువులు, రవాణాఖర్చులు, విద్య, వైద్యం, తదితర అన్ని అవసరాలన్నీ  ‘శాలరీ’తోనే ముడిపడి ఉంటాయి. ఐటీ సంస్థల్లో పని చేసే సాఫ్ట్‌వేర్‌ నిపుణులు మొదలుకొని ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో పని చేసే  టీచర్లు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది వరకు, సంఘటిత రంగాల్లో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి  అసంఘటిత రంగాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వరకు అందరికీ ‘శాలరీ’ ఒక్కటే ఆధారం.(అక్కడుండలేక.. ఇక్కడికి రాలేక..)

కానీ మహమ్మారి  కరోనా పెను విపత్తును సృష్టించింది. అన్ని రంగాల్లోనూ లాక్‌డౌన్‌ ఆర్థిక సంక్షోభాన్ని  తెచ్చిపెట్టింది. కంపెనీలన్నీ మూతపడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. అలాంటి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించిన టీచర్లకు మాత్రమే  జీతం ఇచ్చి మిగతా  వారికి కోత విధించేందుకు  పలు విద్యాసంస్థలు  చూస్తుండగా ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులను పరీక్షించి వైద్యచికిత్సలు, సేవలు అందజేశారనే లెక్కల ప్రకారం డాక్టర్లకు జీతాలు చెల్లించేందుకు  ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. గూగుల్,  మైక్రోసాఫ్ట్‌ వంటి  దిగ్గజ సంస్థలు పూర్తిస్థాయి జీతాలను  అందజేస్తుండగా, చిన్న కంపెనీలు మాత్రం పెద్ద కోత పెట్టేశాయి. మార్చి నెల జీతాన్ని ఎలాగో చెల్లించిన సంస్థలు  ఏప్రిల్‌ నెల జీతానికి మాత్రం ‘కరోనా కటింగ్స్‌’ విధించాయి. నేడు  ఏప్రిల్‌ 30వ తేదీ  శాలరీ డే. ప్రతి  ఒక్కరూ ఆ సాలరీ కోసమే ఎదురు చూస్తున్నారు. పూర్తిజీతాలు అందుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సంతోషంగానే ఉన్నా...అరకొర జీతాలు అందుకుంటున్న వాళ్లు మాత్రం నిరుత్సాహంతో ఎదురు చూస్తున్నారు. (బాస్‌ భౌతిక దూరం ఏదీ..?)

సాఫ్ట్‌వేర్‌ భళా....
ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలకు కొంగుబంగారంగా ఉన్న రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ నెలరోజులు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలకు, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. మహానగరం పరిధిలో సుమారు 200 వరకు బహుళ జాతి ఐటీ కంపెనీలు...మరో 800 వరకు మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలున్నట్లు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. బడా సాఫ్ట్‌వేర్, బీపీఓ, కెపిఓ  కంపెనీల్లో పనిచేస్తున్న వేతనజీవుల జీతాల్లో ఎలాంటి కోతలు విధించలేదని, చిన్న కంపెనీల్లో..అదీ 10 శాతం కంపెనీల్లో మాత్రమే ఉద్యోగుల ప్రయాణ భత్యం(ట్రావెలింగ్‌ అలవెన్స్‌) తదితరాల్లో స్వల్ప కోతలు విధించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. లాక్‌డౌన్‌ సందర్భంగా తమ ప్రాజెక్టులు తగ్గి ఉద్యోగులను తీసివేసే యోచన చేసిన సంస్థల యాజమాన్యాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు రాష్ట్ర కార్మికశాఖ, హైసియా సంస్థలు రంగంలోకి దిగినట్లు ఆ సంస్థ అధ్యక్షులు మురళి బొల్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగి పనిసామర్థ్యం,ప్రతిభ ఆధారంగా సర్వసాధారణంగా ఆయా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు,కొత్త ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం వంటి ప్రక్రియలు యధావిధిగా కొన సాగుతాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం నగరంలో రెండు శాతం మేర సంస్థలే ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని...మిగతా సంస్థలు ఉద్యోగులను కాపాడుకొని వారి నుంచి గరిష్ఠ పనిసామర్థ్యం పొందే దిశగా పనిచేస్తున్నాయన్నారు.

ఆసుపత్రుల్లో ఇలా...
కరోనా కారణంగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం వచ్చే రోగులు మినహా సాధారణ వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 450 పడకలు ఉన్న ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఇన్‌పెషెంట్‌లుగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు ఇతరత్రా  వైద్యం కోసం వెళ్లేవారిని కూడా కరోనా  పరీక్షలు చేసుకొని రావలసిందిగా సూచించడంతో గుండెజబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఆసుపత్రులకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పేషెంట్‌లకు అవసరమైన వైద్యచికిత్సల కోసం సంబంధిత డాక్టర్లను మాత్రమే పిలిపించి  ఆ రోజు వారు అందజేసిన సేవలకు అనుగుణంగా జీతాలు చెల్లిస్తున్నట్లు  వైద్యవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. మరోవైపు టెలీమెడిసిన్‌ ద్వారా  వైద్యసేవలు అందజేస్తున్న  డాక్టర్లకు వారు పరీక్షించిన రోగుల సంఖ్యను బట్టి కమీషన్లు ఇస్తున్నారు. మొత్తంగా డాక్టర్లు,నర్సులు,సిబ్బంది పని చేసిన రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

ఆన్‌లైన్‌ బోధన ఆధారంగా జీతాలు
సాధారణంగా వేసవి సెలవుల్లోనూ టీచర్లకు జీతాలను ఇచ్చే కార్పొరేట్‌ విద్యాసంస్థలు, స్కూళ్లు ఈ సారి  కోత విధించినట్లు టీచర్లు, సిబ్బంది   ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో పిల్లలకు ఎన్ని పాఠాలను బోధించారు అనే సంఖ్య ఆధారంగా కొన్ని స్కూళ్లలో జీతాలు ఇస్తున్నారు. మరోవైపు  స్కూళ్ల సామర్ధ్యం మేరకు 10 నుంచి 20 శాతం వరకు లాక్‌డౌన్‌ కోతలకు పాల్పడ్డాయి.‘‘  ప్రతి నెలా  వచ్చే జీతంపైన ఆధారపడి  ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఒక నెల జీతంలో వెయ్యి రూపాయలు తగ్గినా అప్పు చేయవలసిందే.ఇంటి అద్దెలు వాయిదా పడ్డాయి.కానీ  అసలే చెల్లించకుండా సాధ్యం కాదు కదా. లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఖర్చు తగ్గిందని ఈ కోతలు విధిస్తున్నారో తెలియడం లేదు.’’ అని  ప్రముఖ కార్పొరేట్‌ స్కూల్లో పని చేసే  ఒక టీచర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులు విలవిల
సాధారణ రోజుల్లోనే పని చేసిన కాలానికి మాత్రమే జీతాలు తీసుకొనే సంఘటిత, అసంఘటిత కార్మికులపైన లాక్‌డౌన్‌ పిడుగుపాటుగా మారింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో  చాలా కంపెనీలు ఏప్రిల్‌ నెల జీతాలు చెల్లించేందుకు నిరాకరించాయి. కొన్ని కంపెనీలు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు పొందే కార్మికులకు ఈ నెల  రూ.5000 నుంచి రూ.6000 మాత్రమే అందుతున్నట్లు  కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ ఎక్కడా అప్పులు కూడా లభించడం లేదు. పని లేకపోతే పస్తులుండాల్సిందేనా..’’ అని  ఉప్పల్‌ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్మికుడు ఒకరు ఆందోళన చెందారు. లాక్‌డౌన్‌    సంక్షోభం నుంచి  గట్టెక్కేందుకు కార్మికశాఖ, ప్రభుత్వం  ఎలాంటి సంక్షేమ     చర్యలను చేపడుతాయో వేచి చూడాల్సిందే.  

నష్టం అంచనా ఇప్పట్లో కష్టమే
ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్‌ సిటీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కలిగిన నష్టాలను అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదు.ఇందుకు మరికొంత సమయం పడుతుంది. సమీప భవిష్యత్‌లో అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా తదితర దేశాలకు సంబంధించి ఔట్‌సోర్సింగ్‌ ప్రాజెక్టులను సింహభాగం నగరంలోని ఎంఎన్‌సీ, మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలు దక్కించుకునే అవకాశం ఉంది. ఉద్యోగులను తొలగించడం,కంపెనీలను మూసివేయడం,వేతనాల్లో భారీ కోతలుంటాయన్న ఆందోళన ఇప్పుడు అవసరం లేదు.–మురళిబొల్లు, హైసియా అధ్యక్షులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement