salary delay
-
ఏడాది నుంచి ఇదే తంతు.. సిబిల్ స్కోర్ పడిపోతోంది, సారూ.. జీతాలు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. -
కరోనా.. ఇచ్చే సగం శాలరీల్లో కోత
సాక్షి, సిటీబ్యూరో: సగటు వేతన జీవి చూపులన్నీ నెలాఖరుపైనే ఉంటాయి. ముప్పయ్యో తేదీ వచ్చిందంటే అకౌంట్లోకి జీతం వచ్చిపడుతుందనే భరోసా గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అప్పటికే వివిధ రకాల అవసరాలు ఎదురుచూస్తుంటాయి. ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువులు, రవాణాఖర్చులు, విద్య, వైద్యం, తదితర అన్ని అవసరాలన్నీ ‘శాలరీ’తోనే ముడిపడి ఉంటాయి. ఐటీ సంస్థల్లో పని చేసే సాఫ్ట్వేర్ నిపుణులు మొదలుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో పని చేసే టీచర్లు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది వరకు, సంఘటిత రంగాల్లో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి అసంఘటిత రంగాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది వరకు అందరికీ ‘శాలరీ’ ఒక్కటే ఆధారం.(అక్కడుండలేక.. ఇక్కడికి రాలేక..) కానీ మహమ్మారి కరోనా పెను విపత్తును సృష్టించింది. అన్ని రంగాల్లోనూ లాక్డౌన్ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. కంపెనీలన్నీ మూతపడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు మాత్రమే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అలాంటి ఆన్లైన్ తరగతులు నిర్వహించిన టీచర్లకు మాత్రమే జీతం ఇచ్చి మిగతా వారికి కోత విధించేందుకు పలు విద్యాసంస్థలు చూస్తుండగా ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులను పరీక్షించి వైద్యచికిత్సలు, సేవలు అందజేశారనే లెక్కల ప్రకారం డాక్టర్లకు జీతాలు చెల్లించేందుకు ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు పూర్తిస్థాయి జీతాలను అందజేస్తుండగా, చిన్న కంపెనీలు మాత్రం పెద్ద కోత పెట్టేశాయి. మార్చి నెల జీతాన్ని ఎలాగో చెల్లించిన సంస్థలు ఏప్రిల్ నెల జీతానికి మాత్రం ‘కరోనా కటింగ్స్’ విధించాయి. నేడు ఏప్రిల్ 30వ తేదీ శాలరీ డే. ప్రతి ఒక్కరూ ఆ సాలరీ కోసమే ఎదురు చూస్తున్నారు. పూర్తిజీతాలు అందుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సంతోషంగానే ఉన్నా...అరకొర జీతాలు అందుకుంటున్న వాళ్లు మాత్రం నిరుత్సాహంతో ఎదురు చూస్తున్నారు. (బాస్ భౌతిక దూరం ఏదీ..?) సాఫ్ట్వేర్ భళా.... ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలకు కొంగుబంగారంగా ఉన్న రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్డౌన్ నెలరోజులు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలకు, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. మహానగరం పరిధిలో సుమారు 200 వరకు బహుళ జాతి ఐటీ కంపెనీలు...మరో 800 వరకు మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. బడా సాఫ్ట్వేర్, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న వేతనజీవుల జీతాల్లో ఎలాంటి కోతలు విధించలేదని, చిన్న కంపెనీల్లో..అదీ 10 శాతం కంపెనీల్లో మాత్రమే ఉద్యోగుల ప్రయాణ భత్యం(ట్రావెలింగ్ అలవెన్స్) తదితరాల్లో స్వల్ప కోతలు విధించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. లాక్డౌన్ సందర్భంగా తమ ప్రాజెక్టులు తగ్గి ఉద్యోగులను తీసివేసే యోచన చేసిన సంస్థల యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర కార్మికశాఖ, హైసియా సంస్థలు రంగంలోకి దిగినట్లు ఆ సంస్థ అధ్యక్షులు మురళి బొల్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగి పనిసామర్థ్యం,ప్రతిభ ఆధారంగా సర్వసాధారణంగా ఆయా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు,కొత్త ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం వంటి ప్రక్రియలు యధావిధిగా కొన సాగుతాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం నగరంలో రెండు శాతం మేర సంస్థలే ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని...మిగతా సంస్థలు ఉద్యోగులను కాపాడుకొని వారి నుంచి గరిష్ఠ పనిసామర్థ్యం పొందే దిశగా పనిచేస్తున్నాయన్నారు. ఆసుపత్రుల్లో ఇలా... కరోనా కారణంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం వచ్చే రోగులు మినహా సాధారణ వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 450 పడకలు ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఇన్పెషెంట్లుగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు ఇతరత్రా వైద్యం కోసం వెళ్లేవారిని కూడా కరోనా పరీక్షలు చేసుకొని రావలసిందిగా సూచించడంతో గుండెజబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఆసుపత్రులకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పేషెంట్లకు అవసరమైన వైద్యచికిత్సల కోసం సంబంధిత డాక్టర్లను మాత్రమే పిలిపించి ఆ రోజు వారు అందజేసిన సేవలకు అనుగుణంగా జీతాలు చెల్లిస్తున్నట్లు వైద్యవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. మరోవైపు టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలు అందజేస్తున్న డాక్టర్లకు వారు పరీక్షించిన రోగుల సంఖ్యను బట్టి కమీషన్లు ఇస్తున్నారు. మొత్తంగా డాక్టర్లు,నర్సులు,సిబ్బంది పని చేసిన రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆన్లైన్ బోధన ఆధారంగా జీతాలు సాధారణంగా వేసవి సెలవుల్లోనూ టీచర్లకు జీతాలను ఇచ్చే కార్పొరేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు ఈ సారి కోత విధించినట్లు టీచర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో పిల్లలకు ఎన్ని పాఠాలను బోధించారు అనే సంఖ్య ఆధారంగా కొన్ని స్కూళ్లలో జీతాలు ఇస్తున్నారు. మరోవైపు స్కూళ్ల సామర్ధ్యం మేరకు 10 నుంచి 20 శాతం వరకు లాక్డౌన్ కోతలకు పాల్పడ్డాయి.‘‘ ప్రతి నెలా వచ్చే జీతంపైన ఆధారపడి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఒక నెల జీతంలో వెయ్యి రూపాయలు తగ్గినా అప్పు చేయవలసిందే.ఇంటి అద్దెలు వాయిదా పడ్డాయి.కానీ అసలే చెల్లించకుండా సాధ్యం కాదు కదా. లాక్డౌన్ కారణంగా ఏ ఖర్చు తగ్గిందని ఈ కోతలు విధిస్తున్నారో తెలియడం లేదు.’’ అని ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు విలవిల సాధారణ రోజుల్లోనే పని చేసిన కాలానికి మాత్రమే జీతాలు తీసుకొనే సంఘటిత, అసంఘటిత కార్మికులపైన లాక్డౌన్ పిడుగుపాటుగా మారింది. లాక్డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో చాలా కంపెనీలు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించేందుకు నిరాకరించాయి. కొన్ని కంపెనీలు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు పొందే కార్మికులకు ఈ నెల రూ.5000 నుంచి రూ.6000 మాత్రమే అందుతున్నట్లు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ ఎక్కడా అప్పులు కూడా లభించడం లేదు. పని లేకపోతే పస్తులుండాల్సిందేనా..’’ అని ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్మికుడు ఒకరు ఆందోళన చెందారు. లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కార్మికశాఖ, ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ చర్యలను చేపడుతాయో వేచి చూడాల్సిందే. నష్టం అంచనా ఇప్పట్లో కష్టమే ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్ సిటీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలకు లాక్డౌన్ నేపథ్యంలో కలిగిన నష్టాలను అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదు.ఇందుకు మరికొంత సమయం పడుతుంది. సమీప భవిష్యత్‌లో అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా తదితర దేశాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులను సింహభాగం నగరంలోని ఎంఎన్సీ, మధ్యతరహా, చిన్న ఐటీ, బీపీఓ సంస్థలు దక్కించుకునే అవకాశం ఉంది. ఉద్యోగులను తొలగించడం,కంపెనీలను మూసివేయడం,వేతనాల్లో భారీ కోతలుంటాయన్న ఆందోళన ఇప్పుడు అవసరం లేదు.–మురళిబొల్లు, హైసియా అధ్యక్షులు -
కొలువిచ్చారు సరే.. జీతాలు మరీ..?
సాక్షి, నేలకొండపల్లి: మూడునెలలుగా జీతం రాక కొత్తగా కొలువులో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 422 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఏప్రిల్ 12న విధుల్లో చేరారు. వారు విధుల్లో చేరి మూడునెలలు దాటింది. అయినా ఇంకా ఒక్కసారి కూడా జీతం పొందలేదు. ఎప్పుడు వస్తోందో అన్నసమాచారం కూడా లేదు. దీంతో వారి రోజు వారి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోంది. రవాణా, కార్యాలయ నిర్వహణ.. ప్రతీ రోజు 10 నుంచి 20కిలో మీటర్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే రవాణా ఖర్చు, దానికి అదనంగా పంచాయతీ కార్యాలయానికి అవసరమైన స్టేషనరీ ఖర్చులను కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాలి. ప్రభుత్వ కొలువొచ్చిందని సంబరపడ్డ యువకులకు ఈ ఉద్యోగం కొత్త ఆర్థికకష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. గ్రాంట్ విడుదలైంది.. జిల్లాలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలకు సంబంధించిన గ్రాంటు ప్రభు త్వం విడుదల చేసింది. ఎంపీడీఓల ద్వారా వారికి వేతనాలు అందించే ఏర్పాట్లు చేశాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. – సుధీర్‌కుమార్, ఏఓ, జిల్లా పంచాయతీ కార్యాలయం -
పనికి ఫలితమేది..
సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలన్న లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. కానీ అధికారుల అలసత్వంతో పనులు ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే కురుపాం నియోజకవర్గంలో సుమారుగా 80వేల మంది కూలీలు జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ పనుల్లో పాలుపంచుకుంటూ వచ్చా రు. అధికారుల తప్పిదాల వల్ల గవరమ్మపేట పంచాయతీలో మూడు వారాల నుంచి పనులు కల్పించలేదని కూలీలు వాపోతున్నారు. కూలీలు పనులు చేసే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాదేశాలు స్పష్టంగా ఉన్నా యి. క్షేత్ర స్ధాయిలో అమలులో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వచ్చింది. కనీసం తాగునీరు, నీడ, మజ్జిగ, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచలేకపోయారు. అయినా తప్పని పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకపోవడంతో కూలీలు మండుటెండలోనే చెమటోడ్చుతున్నారు. ఎండ తీవ్రత తాళలేక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. పనులు చేసిన వారికి కూడా ఉపాధి కూలీలు అందలేదని వాపోయారు. ఉపాధి కూలీ రోజుకు రూ.200లకు తక్కువ కాకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేసిస్తే వారానికి రూ.400 కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనదారులకు మెరుగైన వసతులను కల్పించి, ప్రతి వారం పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వారం పనులు కల్పించాలి మూడు వారాల నుంచి పనులు కల్పించలేదు. గతంలో పని చేసిన వాటికి డబ్బులు ఇప్పటి వరకు అందలేదు. కారణం అడిగి తే అధికారులు చెప్పడం లేదు. పరిసర గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. –మర్రాపు కృష్ణంనాయుడు, వెంకటరాజపురం పనికి తగ్గ వేతనం రావడం లేదు గతంలో చేసిన పనులకు ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదు. అందిన వారికి కూడా రూ.400 కూడా రావడం లేదని చెబుతున్నారు. అధికారులు వేసవి అలవెన్స్ అంటూ చెప్పడమే తప్ప చెల్లించలేదు. – మూడడ్ల శ్రీరాములునాయుడు, వెంకటరాజపురం పనులు కల్పిస్తాం.. గవరమ్మపేట పంచాయతీలో అంచనాలు వేయడంలో తప్పిదం జరిగింది. అందుకే పనులు జరగలేదు. వచ్చేవారం నుంచి పనులు కల్పిస్తాం. – రెడ్డి సురేష్‌నాయుడు, ఏపీఓ, జియ్యమ్మవలస -
ఆశ్రమాల్లో శ్రమ దోపిడీ..!
ఖానాపూర్ ఆదిలాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకున్నా.. బుక్కెడు బువ్వ కోసం అంగలార్చుతున్నారు. వెట్టిచాకిరి చేస్తూ.. అర్ధాకలితో అలమటిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్నా.. కనీస వేతనానికి నోచుకోవడంలేదు. బతుకుదెరువు కోసం అప్పులు చేయక తప్పడంలేదు. ఐదారు నెలలకోసారి వ చ్చే కొద్దిపాటి జీతం అప్పులకూ సరిపోవడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కూలీలు బతుకులు దినదిన గండంతో బతుకులు వెల్లదీస్తున్నారు. అమలుకు నోచుకోని హామీలు.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహా ల్లో పనిచేస్తున్న 300 మంది దినసరి కూలీలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. 30 ఏ ళ్లుగా పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు. పైగా మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. ఈ దినసరి కూలీల జీతభత్యాల విషయం ఆయా జిల్లా ల కలెక్టర్ల పరిధిలో ఉంటుంది. దీంతో కార్మికులందరికీ వేతనాలు ప్రతీ నెల ట్రెజరీల ద్వారా ఇవ్వాల్సి ఉన్నా సక్రమంగా చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నా రు. సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా, కలెక్టర్లతో జీవోలు విడుదల చేస్తూ నామమాత్రం జీతాలు చెల్లిసున్నారన్న విమర్శలున్నా యి. ఈ విషయాన్ని దినసరి కూలీల సంఘం ఆధ్వర్యంలో పలుసార్లు గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దినసరి కూలీలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. శాశ్వత నియామకాల కోసం ఎదురుచూపు... విధి నిర్వహణలో మరణించిన దినసరి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. 23 డిసెంబర్ 2011న ఆ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ జిల్లా అధికారుల సమావేశంలో దినసరి కూలీలను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. 2012 జనవరి 16లోగా సంబంధిత ఏటీడబ్ల్యూవోకు దినసరి కూలీల వివరాలు అందజేయాలని సూచించారు. ఇది దినసరి కూలీల్లో ఆశలు రేకెత్తించినా ఎంతోకాలం నిలువలేదు. రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నా... రెండుమూడేళ్లు కొనసాగి నైపుణ్యం సంపాదించిన వారిని రెగ్యులరైజ్ చేయాలనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడంలేదు. పైగా ప్రభుత్వం వీ రితో వెట్టిచాకిరి చేయిస్తోంది. అయినప్పటికీ ప్ర భుత్వం ఏదో ఒకరోజు తమను రెగ్యులరైజ్ చేయకపోతుందా.. అన్న ఆశే వారిని పని చేసేలా చే స్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన గల ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించకూడదు. అంటే పనిలోకి తీసుకున్న వారు కొన్నాళ్ల పాటు పనిచేస్తే వారిని పర్మినెంట్ చేయాలి. కానీ.. 30 ఏళ్లుగా పని చేస్తున్నా ప్రస్తుతం రెగ్యులరైజ్ చేసిన దాఖలాలు లేవు. దినసరి కూలీల విషయంలో ప్రభుత్వం గాని, పనిచేయించుకుంటున్న శాఖలు గాని ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా వీరికి పని భద్రత, జీవన భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. నెరవేరని హామీలు... జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో దినసరి కూలీలు ఇప్పటికే అప్పటి ముఖ్యమంత్రులు, ఆ శాఖ మంత్రులు, కమిషనర్లను కలిశారు. అలాగే 2016 సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి వారి గోడు వెల్లబోసుకున్నారు. దీంతో తమను రెగ్యులరైజ్ చేస్తామని అధికారులు, సీఎం ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేద ని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమకంటూ ఒక వేతన విధానం నిర్ణయించి, పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, దృష్టిలో ఉంచుకుని నెలనెలా వేతనాలు చెల్లిం చి పర్మినెంట్ చేయాలని వారు కోరుతున్నారు. -
వేతన వెతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నెలంతా పనిచేసిన వేతన జీవికి మొదటి వారంలో జీతం చేతిలో పడకుంటే ఎన్నో ఇబ్బందులు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, పాలు, కిరాణా... ఇలా ఒక్కటేమిటి.. అన్ని దిక్కుల నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. వారం.. పది రోజులంటే ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ నెలల తరబడి అంటే.. కష్టమే. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈ కష్టం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏకంగా మూడు నెలల నుంచి వారికి జీతాల్లేవు. నెలంతా పనిచేయడం ఒక ఎత్తయితే జీతం కోసం కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగడం మరో ఎత్తవుతోంది. దాదాపు రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన నిధులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు సర్కారు నుంచి కమీషన్ పుచ్చుకునే ఏజెన్సీ సైతం ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే వేతనాలిస్తామని తెగేసి చెప్పడంతో ప్రతినెలా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో దాదాపు 110మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, పారామెడికల్, కంప్యూటర్ ఆపరేటర్, హౌస్‌కీపింగ్ తదితర కేటగిరీల్లో వీరంతా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వీరంతా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన వేతన నిధులు సదరు ఏజెన్సీకి విడుదల చేస్తుంది. దీంతో ఏజెన్సీ ఆయా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. అయితే నిధుల విడుదలలో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో వీరికి నెలవారీగా వేతనాలు అందడం కష్టంగా మారింది. మూడు నెలలుగా అందని వేతనాలు వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు నెల వరకు వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయా ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థే సిబ్బందికి నెలవారీ వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ సదరు సంస్థ వేతనాలు మాత్రం తప్పక చె ల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రభుత్వం ఏజెన్సీకి 3శాతం కమీషన్ చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనలను ఏజెన్సీ విస్మరిస్తోంది. నెలవారీగా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందిన తర్వాతే వేతనాలిస్తామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో ఇటీవల కొందరు ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా త్వరలోనే వేతన నిధులు విడుదలవుతాయని జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ హన్మంతరావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.