ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు
సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలన్న లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. కానీ అధికారుల అలసత్వంతో పనులు ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే కురుపాం నియోజకవర్గంలో సుమారుగా 80వేల మంది కూలీలు జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ పనుల్లో పాలుపంచుకుంటూ వచ్చా రు. అధికారుల తప్పిదాల వల్ల గవరమ్మపేట పంచాయతీలో మూడు వారాల నుంచి పనులు కల్పించలేదని కూలీలు వాపోతున్నారు.
కూలీలు పనులు చేసే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాదేశాలు స్పష్టంగా ఉన్నా యి. క్షేత్ర స్ధాయిలో అమలులో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వచ్చింది. కనీసం తాగునీరు, నీడ, మజ్జిగ, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచలేకపోయారు. అయినా తప్పని పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకపోవడంతో కూలీలు మండుటెండలోనే చెమటోడ్చుతున్నారు. ఎండ తీవ్రత తాళలేక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. పనులు చేసిన వారికి కూడా ఉపాధి కూలీలు అందలేదని వాపోయారు. ఉపాధి కూలీ రోజుకు రూ.200లకు తక్కువ కాకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేసిస్తే వారానికి రూ.400 కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనదారులకు మెరుగైన వసతులను కల్పించి, ప్రతి వారం పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతి వారం పనులు కల్పించాలి
మూడు వారాల నుంచి పనులు కల్పించలేదు. గతంలో పని చేసిన వాటికి డబ్బులు ఇప్పటి వరకు అందలేదు. కారణం అడిగి తే అధికారులు చెప్పడం లేదు. పరిసర గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి.
–మర్రాపు కృష్ణంనాయుడు, వెంకటరాజపురం
పనికి తగ్గ వేతనం రావడం లేదు
గతంలో చేసిన పనులకు ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదు. అందిన వారికి కూడా రూ.400 కూడా రావడం లేదని చెబుతున్నారు. అధికారులు వేసవి అలవెన్స్ అంటూ చెప్పడమే తప్ప చెల్లించలేదు.
– మూడడ్ల శ్రీరాములునాయుడు, వెంకటరాజపురం
పనులు కల్పిస్తాం..
గవరమ్మపేట పంచాయతీలో అంచనాలు వేయడంలో తప్పిదం జరిగింది. అందుకే పనులు జరగలేదు. వచ్చేవారం నుంచి పనులు కల్పిస్తాం.
– రెడ్డి సురేష్‌నాయుడు, ఏపీఓ, జియ్యమ్మవలస
Comments
Please login to add a commentAdd a comment