employeement guarantee scheme
-
ఉపాధికి ఊతం
ఏలూరు రూరల్: పల్లెల్లో శ్రమజీవులు కదిలారు. ప్రభుత్వ భరోసాతో పలుగు,పార పట్టుకుని ఉపాధి పనులు చేపట్టారు. సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లస్థలాల పనులను వేగవంతం చేశారు. ఏలూరు మండలం కొమడవోలు గ్రామ పరిధిలో మంగళవారం ఉపాధి పనులు ఊపందుకున్నాయి. గ్రామానికి చెందిన సుమారు 300 మంది కూలీలు ఫీల్డ్ చానల్, డ్రెయిన్ పనులతో పాటు మెరక పనులు చేశారు. ఏపీఓ కిషోర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ కవిత పర్యవేక్షించారు. అధికారులు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ పనులు చేసిన కూలీలు సబ్బుతో చేతులు కడుక్కుని ఇంటి ముఖం పట్టారు. -
మెక్కింది రూ.1.17 కోట్లు!
సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నిధుల లెక్క మారింది. రూ.1.17కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న వాస్తవ లెక్కలు శనివారం నివేదించారు. బి.కొత్తకోట మండలంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.36,72,910 దుర్వినియోగమైనట్లు శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగసభ తర్వాత అధికారులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు సభ జరగడంతో పూర్తిస్థాయి లెక్కలు తేలలేదు. దీనిపై సామాజిక తనిఖీ బృందం శనివారం రోజంతా లెక్కలు వేసి నివేదికలు సిద్ధం చేసింది. ఆ వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, అటవీశాఖ, సర్వశిక్ష అభియాన్, సెర్ప్ (వెలుగు) వాటర్‌షెడ్ పథకం ద్వారా రూ.6.70 కోట్ల నిధులను ఖర్చు చేశారు. ఇందులో సెర్ఫ్ (వెలుగు) ద్వారా మొక్కల పెంపకం కోసమే రూ.1,44 కోట్లు ఖర్చుచేసి చెల్లింపులు చేశారు. ఈ ని«ధుల వినియోగంపై వాస్తవాలను సామాజిక తనిఖీ బృందాలు నిగ్గుతేల్చాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి రూ.36.72 లక్షలు దుర్వి నియోగం అయినట్టు ప్రకటించారు. ఈ లెక్కలపై బృందం శనివారం పూర్తిగా సిద్ధం చేసింది. అందులో మొక్కల పెంపకం పేరులో వెలుగు సిబ్బంది రూ.80,51,445 నిధులను అక్రమాలబాట పట్టించినట్టు నిర్ధారించారు. పంచాయతీరాజ్‌శాఖ రూ.10,172, పశుసంవర్థకశాఖ రూ.4,15,546, గృహ నిర్మాణ శాఖ రూ.1,61,712, ఉపాధి పథకంలో రూ.30,93,281, అటవీశాఖ రూ.14,158 నిధులు అవినీతి దారిపట్టిందని తేల్చారు. సామాజిక తనిఖీ బృందం నివేదించిన అక్రమాల చిట్టాను సమీక్షించి, సిబ్బంది పనితీరు, పనులపై అధికా రులు, సిబ్బంది ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేశారో çసభలోనే స్పష్టం చేశారు. దీనిపై ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చర్యలకు ఆదేశాలి చ్చారు. అందులో సెర్ప్ (వెలుగు) సిబ్బంది నుంచి రూ.41,14,514 నిధులు రికవరీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ నుంచి రూ.10,172 నిధులను రికవరీ చేసి మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ నుంచి రూ.46,500 నిధులు రికవరీ చేసి, మిగిలిన నిధులకు సంబంధించి గడ్డి పెంపకం, మల్బరీసాగు చేపట్టేలా సూచనలిచ్చారు. గృహనిర్మాణ శాఖ నుంచి రూ.34వేలు రికవరీ చేస్తూ, మిగిలిన నిధులకు సంబం ధించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా ఆదేశాలిచ్చారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.3,04,512 నిధులను రికవరీకి ఆదేశించి మిగిలిన నిధులను నిలుపుదల చేశారు. అటవీ శాఖకు సంబంధించి మిగిలిన పనులు, మొక్కల పెంపకం చేపట్టాల ని ఆదేశించారు. రూ.1.17కోట్ల నిధులు దుర్విని యోగమైనట్లు తేలగా రూ.45,09,698 వసూలుకు చర్యలు తీసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసు ఉపాధి నిధుల దుర్వినియోగం వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులు పెద్దస్థాయిలో దుర్వినియోగం అయిన విషయం శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభలో వెల్లడైన విషయం తెలిసిందే. మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ వేమిలేటికోటకు చెందిన మహిళా రైతు ఎం.ధనలక్ష్మికి సర్వే నంబర్ 938/సీ–5లో 3.42 ఎకరాల పొలం ఉందని 28–6–2017న అంచనా వేశారు. 24–7–17 నుంచి 5–1–2019 మధ్యకాలంలో 239 గుంతలు తీసి మామిడి మొక్కలు నాటినట్టు 13038 నంబర్‌తో సీసీ ఎంబుక్ చేశారు. పేజీ నంబర్ 1 నుంచి 22 వరకు ఈ పనికి సంబంధించిన వివరాలు నమోదు చేసి బిల్లులు చెల్లించారు. అయితే సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ పనిని వీఓఏ, రైతు సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలించగా అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి. నిధులు మంజూ రు చేసిన పొలంలో గుంతలు తవ్విన, మొక్కలు నాటిన ఆనవాళ్లు కనిపించలేదు. రైతు ధనలక్ష్మికి పెద్దతిప్పసముద్రం మండలంలో పొలం ఉన్నట్టు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఇలా భూమిని మార్చి 2017–18లో రూ.68,055, 2018–19లో 35,621 కలిపి మొత్తం రూ.1,63,676 చెల్లించారని తనిఖీ సిబ్బంది గుర్తించి నివేదించారు. దీన్ని పరిశీలించిన ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చెల్లించిన మొత్తం నిధులు 100శాతం రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు. బాద్యులపై చర్యలు తీసుకో వాలన్నారు. -
దొరికారు..
సాక్షి, తూర్పుగోదావరి : ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలు సోషల్ ఆడిట్లో బయటపడ్డాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపాధి హమీ పథకం ద్వారా జరిగిన వివిధ పనులపై క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించాయి. ఈ నివేదికపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డి.రాంబాబు అధ్యక్షతన మంగళవారం ప్రజావేదిక నిర్వహించారు. ఎం.బుక్ రికార్డు చేయకుండా బిల్లులు చెల్లింపులు, పనులు జరిగిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయక పోవడం, ఇల్లు నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు డ్రా చేయడం, మొక్కల పెంపకంలో అక్రమాలు వంటి పలు అవకతవకలను డీఆర్పీలు ప్రజావేదికలో బహిర్గతం చేశారు. వీటిపై పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్లు వెలుగు సిబ్బంది, వృక్ష సేవకులను నిలదీశారు. వృక్ష సేవకులు నాటిన మొక్కలు కొన్ని గ్రామాల్లో 80 శాతం చచ్చిపోగా వాటికి సంబంధించిన ట్రీ గార్డులు, నీరుపోయుట, పరిశీలన కింద లక్షలాది రూపాయల నిధులు చెల్లింపులు జరిగినట్టు సోషల్ ఆడిట్ బృందం వెల్లడించింది. గేదెల్లంక గ్రామంలో ఉపాధి హమీ పథకంలో పనులకు సంబంధించి మస్టర్ల నమోదు షీటులో 10 మందికి సంబంధించి ఒకే రకమైన సంతకాలు, వేలి ముద్రలు ఉండడంతో అవినీతి జరిగినట్టు ఆడిట్ బృందం గుర్తించినట్టు ప్రజా వేదికలో పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్ వి.రాధకృష్ణను నిలదీశారు. అయితే ఆ మస్టర్లు తానే వేసినట్టు ఆయన అంగీకరించడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల అవకతవకలకు సంబంధించి రూ.41,994, పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రూ.36,287, మొక్కల పెంపకానికి సంబంధించి రూ.75,540, గృహనిర్మాణానికి సంబంధించి రూ.1,32,450, పశుసంవర్ధక శాఖకు సంబంధించి రూ.10, 586, సర్వశిక్షాభియాన్ సంబంధించి రూ.860 అవకతవకలు జరిగినట్టు గుర్తించి వాటి రికవరీకి ఆదేశించారు. ఈ ప్రజావేదికలో ఏపీడీ జే.రాంబాబు, హెచ్ఆర్ మేనేజర్ జి.రాజేష్, ఐఎంటీ బి.దాసు, ఎస్ఆర్పీ పి.జగన్నాథం, ఏపీఓ ఏఎస్వీ కృష్ణ, హౌసింగ్ ఏఈ జగన్, ఈసీ ఎస్బీ నారాయణ, టెక్నికల్, ఫీల్డు అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పనికి ఫలితమేది..
సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలన్న లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. కానీ అధికారుల అలసత్వంతో పనులు ఇవ్వడం లేదు. ఇందులో భాగంగానే కురుపాం నియోజకవర్గంలో సుమారుగా 80వేల మంది కూలీలు జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ పనుల్లో పాలుపంచుకుంటూ వచ్చా రు. అధికారుల తప్పిదాల వల్ల గవరమ్మపేట పంచాయతీలో మూడు వారాల నుంచి పనులు కల్పించలేదని కూలీలు వాపోతున్నారు. కూలీలు పనులు చేసే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాదేశాలు స్పష్టంగా ఉన్నా యి. క్షేత్ర స్ధాయిలో అమలులో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వచ్చింది. కనీసం తాగునీరు, నీడ, మజ్జిగ, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచలేకపోయారు. అయినా తప్పని పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకపోవడంతో కూలీలు మండుటెండలోనే చెమటోడ్చుతున్నారు. ఎండ తీవ్రత తాళలేక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. పనులు చేసిన వారికి కూడా ఉపాధి కూలీలు అందలేదని వాపోయారు. ఉపాధి కూలీ రోజుకు రూ.200లకు తక్కువ కాకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేసిస్తే వారానికి రూ.400 కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనదారులకు మెరుగైన వసతులను కల్పించి, ప్రతి వారం పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వారం పనులు కల్పించాలి మూడు వారాల నుంచి పనులు కల్పించలేదు. గతంలో పని చేసిన వాటికి డబ్బులు ఇప్పటి వరకు అందలేదు. కారణం అడిగి తే అధికారులు చెప్పడం లేదు. పరిసర గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. –మర్రాపు కృష్ణంనాయుడు, వెంకటరాజపురం పనికి తగ్గ వేతనం రావడం లేదు గతంలో చేసిన పనులకు ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదు. అందిన వారికి కూడా రూ.400 కూడా రావడం లేదని చెబుతున్నారు. అధికారులు వేసవి అలవెన్స్ అంటూ చెప్పడమే తప్ప చెల్లించలేదు. – మూడడ్ల శ్రీరాములునాయుడు, వెంకటరాజపురం పనులు కల్పిస్తాం.. గవరమ్మపేట పంచాయతీలో అంచనాలు వేయడంలో తప్పిదం జరిగింది. అందుకే పనులు జరగలేదు. వచ్చేవారం నుంచి పనులు కల్పిస్తాం. – రెడ్డి సురేష్‌నాయుడు, ఏపీఓ, జియ్యమ్మవలస -
ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం కన్నేకల్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం లక్ష్మి, ఆమె భర్త సుధాకర్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబసభ్యులు వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల నర్సింహగౌడ్ తమను వేధిస్తున్నాడని మండల తహశీల్దార్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో భార్యాభర్తలు పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజకీయ విభేదాలే ఈ ఘటనకు పురిగొల్పాయని స్థానికులు అంటున్నారు. (నిడమనూర్)