సామాజిక తనిఖీ ప్రజా వేదికలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న పీడీ ఎం.శ్యామల తదితరులు
సాక్షి, తూర్పుగోదావరి : ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలు సోషల్ ఆడిట్‌లో బయటపడ్డాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపాధి హమీ పథకం ద్వారా జరిగిన వివిధ పనులపై క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించాయి. ఈ నివేదికపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డి.రాంబాబు అధ్యక్షతన మంగళవారం ప్రజావేదిక నిర్వహించారు. ఎం.బుక్ రికార్డు చేయకుండా బిల్లులు చెల్లింపులు, పనులు జరిగిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయక పోవడం, ఇల్లు నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు డ్రా చేయడం, మొక్కల పెంపకంలో అక్రమాలు వంటి పలు అవకతవకలను డీఆర్‌పీలు ప్రజావేదికలో బహిర్గతం చేశారు. వీటిపై పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్లు వెలుగు సిబ్బంది, వృక్ష సేవకులను నిలదీశారు. వృక్ష సేవకులు నాటిన మొక్కలు కొన్ని గ్రామాల్లో 80 శాతం చచ్చిపోగా వాటికి సంబంధించిన ట్రీ గార్డులు, నీరుపోయుట, పరిశీలన కింద లక్షలాది రూపాయల నిధులు చెల్లింపులు జరిగినట్టు సోషల్ ఆడిట్ బృందం వెల్లడించింది.
గేదెల్లంక గ్రామంలో ఉపాధి హమీ పథకంలో పనులకు సంబంధించి మస్టర్ల నమోదు షీటులో 10 మందికి సంబంధించి ఒకే రకమైన సంతకాలు, వేలి ముద్రలు ఉండడంతో అవినీతి జరిగినట్టు ఆడిట్ బృందం గుర్తించినట్టు ప్రజా వేదికలో పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్ వి.రాధకృష్ణను నిలదీశారు. అయితే ఆ మస్టర్లు తానే వేసినట్టు ఆయన అంగీకరించడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల అవకతవకలకు సంబంధించి రూ.41,994, పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రూ.36,287, మొక్కల పెంపకానికి సంబంధించి రూ.75,540, గృహనిర్మాణానికి సంబంధించి రూ.1,32,450, పశుసంవర్ధక శాఖకు సంబంధించి రూ.10, 586, సర్వశిక్షాభియాన్ సంబంధించి రూ.860 అవకతవకలు జరిగినట్టు గుర్తించి వాటి రికవరీకి ఆదేశించారు. ఈ ప్రజావేదికలో ఏపీడీ జే.రాంబాబు, హెచ్‌ఆర్ మేనేజర్ జి.రాజేష్, ఐఎంటీ బి.దాసు, ఎస్‌ఆర్పీ పి.జగన్నాథం, ఏపీఓ ఏఎస్‌వీ కృష్ణ, హౌసింగ్ ఏఈ జగన్, ఈసీ ఎస్‌బీ నారాయణ, టెక్నికల్, ఫీల్డు అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment