సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది.
దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.
బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment