ts transco
-
ఏడాది నుంచి ఇదే తంతు.. సిబిల్ స్కోర్ పడిపోతోంది, సారూ.. జీతాలు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. -
చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి. మరోశాతం పెంచి 7శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి. 17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ విద్యుత్‌శాఖకు సీఈఆర్టీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు యత్నించినట్లు సమాచారం.ఈ విషయంపై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)హెచ్చరించింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించింది.ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ పంక్షన్స్ ని గమనిస్తూ ఉండలని సీఈఆర్టీ సూచించింది. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను మార్చేసింది.ఇక, చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. -
విద్యుత్ వివాదం వీడింది!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది ఉద్యోగులు వెళ్తుండగా ఏపీ నుంచి తెలంగాణకు సైతం సమాన సంఖ్యలో ఉద్యోగులు రావాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డి.ఎం. ధర్మాధికారి ఏకసభ్య కమిటీ గతేడాది నవంబర్‌లో తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో ఆ మేరకు ఏపీ, తెలంగాణ జెన్కోలు, ట్రాన్స్‌కోల మధ్య ఉద్యోగుల పరస్పర కేటాయింపులపై తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు 252 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడంతోపాటు ఏపీ జెన్కో నుంచి 252 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు 300 మందిని కేటాయించాలని, అంతే సంఖ్యలో ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే వారిలో రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వారిని తుది కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరింది. దీంతో తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు వెళ్లే వారిలో 48 మంది రిటైర్మెంట్కు దగ్గరగా ఉండటంతో వారిని మినహాయించి మిగిలిన 252 మందిని ఏపీ జెన్కోకు కేటాయించింది. తెలంగాణ ట్రాన్స్‌కోకు.. ఇక తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు 173 మంది ఉద్యోగులను ధర్మాధికారి తుది నివేదికలో కేటాయించగా, అంతే సంఖ్యలో ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 173 మందిలో 39 మంది పదవీ విరమణకు సమీపంలో ఉండటంతో వారిని నిబంధనల ప్రకారం కేటాయింపు నుంచి మినహాయింపునిచ్చారు. తుదకు తెలంగాణ నుంచి ఏపీకు 134 మందిని రిలీవ్ చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు ఇప్పటికే 30 మంది ఉద్యోగులు వచ్చి చేరడంతో మిగిలిన 104 మంది ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చుకుంటున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. -
కాళేశ్వరానికి ‘కరెంట్’ సిద్ధం!
అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం ప్రాజెక్టుకు 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరం రూ.2,890 కోట్లతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశామన్నారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశముందన్నారు. దీనికి తగినట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్ళించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్ శాఖది కీలక పాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు. నిర్ణీ త గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్పూర్తితోనే, లిఫ్టులను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలని, రైతుల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ చేసిన పనులు లోడ్ (మెగా వాట్లు)- 4992.47 పంపులు- 100 మొత్తం సబ్ స్టేషన్లు- 17 400 కె.వి సబ్స్టేషన్లు: 6 220 కె.వి సబ్స్టేషన్లు: 9 132 కె.వి సబ్స్టేషన్లు: 2 మొత్తం లైన్ పొడవు- 1025.3 400 కె.వి లైన్ పొడవు: 521.08 కి.మీ 220 కె.వి లైన్ పొడవు: 461.05 కి.మీ 132 కె.వి లైన్ పొడవు: 43.2 కి.మీ -
విద్యుత్ చార్జీలు పెంచబోం!
సాక్షి, హైదరాబాద్ : కొత్త ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగిస్తామని దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రకటించాయి. 2019–20లో అమలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను ప్రకటిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) విద్యుత్టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేసేవరకు చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచకపోవడం వల్ల ఏర్పడే ఆర్థిక లోటును సబ్సిడీల రూపంలో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిస్కంలు శుక్రవారం బహిరంగ ప్రకటన జారీ చేశాయి. టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ జనవరి 9న పదవీ విరమణ పొందారు. అంతకుముందే సభ్యులిద్దరూ పదవీ విరమణ చేయడంతో గత రెండు నెలలుగా కమిషన్ ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కమిషన్ లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి వీలు లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ప్రస్తుత చార్జీలను కొనసాగించాలని డిస్కంలు నిర్ణయించాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం.. డిస్కంలు ఈఆర్సీకి 2019–20కు సంబంధించిన వార్షికాదాయ అవసరాల నివేదికను సమర్పించే అవకాశముంది. అనంతరం విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. -
పంపులకు ‘పవర్’ కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది. ఏడాదిగా దాటవేతే.. రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా రూ.777.45 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేసింది. తదనంతరం తాజాగా జొన్నలబొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పడు, విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. మున్ముందు సవాళ్లే... ఇక ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా.. ప్రాజెక్టు ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) విద్యుత్ బిల్లు బకాయి(రూ. కోట్లలో) కల్వకుర్తి 31 777.45 నెట్టెంపాడు 6.78 104.70 బీమా 12.12 74.85 మొత్తం 49.90 957 -
సమ్మెకు దిగితే వేటు!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల క్రమబద్ధీకరణతో సహా మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ ట్రాన్స్‌కో తీవ్రంగా స్పందించింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల (ఆర్టిజన్లు)కు వర్తించదని, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణమే సమ్మె పిలుపును వెనక్కి తీసుకోవాలని కోరింది. కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగితే నోటీసులు, వేతనాలు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉందని హెచ్చరించింది. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జారీ చేసిన సమ్మె నోటీసుకు బదులిస్తూ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు గురువారం యూనియన్ ప్రధాన కార్యదర్శికు లేఖ రాశారు. సమ్మెకు దిగడం, ఇతరులు సమ్మెకు దిగేలా రెచ్చగొడితే సంస్థ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అన్ని రకాల సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగులను విలీనం చేస్తూ గతంలో యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిందని, ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరడం న్యాయస్థానాన్ని ధిక్కరించడమేనని తప్పుపట్టారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి రారని, వారిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు లేదని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. గ్రేడ్–4 ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు.. విద్యుత్ సంస్థల్లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్న గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను వారి విద్యార్హతల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వరుసగా గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4 ఆర్టిజన్లుగా విద్యుత్ సంస్థలు విలీనం చేసుకున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులుగా నైపుణ్యంతో కూడిన పనులు చేసినా సరైన విద్యార్హతలు లేకపోవడంతో విలీన ప్రక్రియలో కొందరు విద్యుత్ ఉద్యోగులను ఆర్టిజన్ గ్రేడ్–4గా నియమించారు. దీంతో వారు కాంట్రాక్టు ఉద్యోగిగా పొందిన వేతనం కంటే విలీనం తర్వాత వారికి వచ్చే వేతనం తగ్గిపోయి తీవ్రంగా నష్టపోయారు. గత వేతనానికి సమానంగా ప్రస్తుత వేతనం పెంచేందుకు గ్రేడ్–4 ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్సును మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లు సైతం వర్తింపజేయనున్నాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
రాష్ట్రంలో కరెంటు కోతలుండవు
- ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు - మండుటెండల్లో నిరంతర విద్యుత్ సరఫరా - రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు హైదరాబాద్: మండుటెండలతో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవ ని, ఇకపై ఉండవని ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు 135 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు చేరుకోగా, గరిష్టంగా 165 ఎంయూల డిమాండును తీర్చగల ‘శక్తి’ సామర్థ్యాలను కలిగి ఉన్నామన్నారు. రాష్ట్రంలో డిమాండు 165 ఎంయూలకు చేరినా నిరంతరాయంగా సరఫరా చేయగలమన్నారు. ఎండలు పదునెక్కిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభాకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పై విషయాలను తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన తెలిపారు. వాతావరణంలో వేడి వల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతోనే అక్కడక్కడ సరఫరాలో అంతరాయం వస్తోందన్నారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో సంతృప్తికర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. అన్ని సబ్స్టేషన్లు వినియోగంలోకి... పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్లను తక్షణమే ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభాకర్‌రావు డిస్కంలను ఆదేశించారు. జంట నగరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించేందుకు ఎర్రగడ్డలోని 220/132 కేవీ సబ్ స్టేషన్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ట్రాన్స్‌కో అధికారులను కోరారు. మరమ్మతు అవసరాల కోసం అదనపు బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బదిలీల నిలుపుదల ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సాధారణ బదిలీలను నిలిపివేయాలని ఎస్పీడీసీఎల్కు ప్రభాకర్‌రావు సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.