
సాక్షి, హైదరాబాద్ : కొత్త ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగిస్తామని దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్) ప్రకటించాయి. 2019–20లో అమలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను ప్రకటిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) విద్యుత్‌టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేసేవరకు చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచకపోవడం వల్ల ఏర్పడే ఆర్థిక లోటును సబ్సిడీల రూపంలో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిస్కంలు శుక్రవారం బహిరంగ ప్రకటన జారీ చేశాయి. టీఎస్‌ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ జనవరి 9న పదవీ విరమణ పొందారు. అంతకుముందే సభ్యులిద్దరూ
పదవీ విరమణ చేయడంతో గత రెండు నెలలుగా కమిషన్ ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కమిషన్ లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి వీలు లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ప్రస్తుత చార్జీలను కొనసాగించాలని డిస్కంలు నిర్ణయించాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం.. డిస్కంలు ఈఆర్సీకి 2019–20కు సంబంధించిన వార్షికాదాయ అవసరాల నివేదికను సమర్పించే అవకాశముంది. అనంతరం విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment