అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం ప్రాజెక్టుకు 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరం రూ.2,890 కోట్లతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశామన్నారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశముందన్నారు. దీనికి తగినట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్ళించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్ శాఖది కీలక పాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు. నిర్ణీ త గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్పూర్తితోనే, లిఫ్టులను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలని, రైతుల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ శాఖ చేసిన పనులు
లోడ్ (మెగా వాట్లు)- 4992.47
పంపులు- 100
మొత్తం సబ్ స్టేషన్లు- 17
400 కె.వి సబ్‌స్టేషన్లు: 6
220 కె.వి సబ్‌స్టేషన్లు: 9
132 కె.వి సబ్‌స్టేషన్లు: 2
మొత్తం లైన్ పొడవు- 1025.3
400 కె.వి లైన్ పొడవు: 521.08 కి.మీ
220 కె.వి లైన్ పొడవు: 461.05 కి.మీ
132 కె.వి లైన్ పొడవు: 43.2 కి.మీ
Comments
Please login to add a commentAdd a comment