d prabhakar rao
-
‘కేంద్రం’ నుంచే వివరణ తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని.. రాష్ట్ర విద్యుత్ సంస్థలతో ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై అపోహలుంటే వాటి నుంచే వివరణ తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కోరారు. మంగళవారం ఆయన విద్యుత్‌సౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యుత్ సంస్థలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన ఆరోపణలకు సమాధానాలిచ్చారు. రూ.4.30కు యూనిట్ చొప్పున రాష్ట్రానికి సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్టీపీసీ ఆసక్తి చూపినా, కొనుగోలు చేయకుండా ఇంతకన్నా అధిక ధరతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేశాయని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్టీపీసీ ఆఫర్ చేసిన విద్యుత్ ధరను లక్ష్మణ్ ఒక్కోసారి ఒక్కో విధంగా పేర్కొంటున్నారని, యూనిట్‌కు రూ.4.66 నుంచి రూ.5.19 ధరతో ఎన్టీపీసీ నుంచి 400 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు 2016లో ఒప్పందం చేసుకుని కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం నేరుగా బీహెచ్ఈఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఇండియా బుల్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ విషయంలో అనుమానాలుంటే ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ నుంచి వివరణ తీసుకోవాలని చెప్పారు. ‘టీఆర్ఎస్ కండువా వేసుకున్నారని లక్ష్మణ్ అనడం ఆవేదన కలిగించింది. టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేశాను. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎప్పు డూ ఏ పార్టీ కండువా వేసుకోలేదు ’అని అన్నారు. 10 వేల ఎం.యూ.ల జలవిద్యుత్ కొరత బహిరంగ టెండర్ల ద్వారానే 2015లో సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యూనిట్‌కు రూ.5.79 గరిష్ట ధర పరిమితి లోపే ఈ ఒప్పందాలు జరిగాయి. లక్ష్మణ్ పేర్కొన్న గరిష్ట ధరకు సంబంధించి ఎంఎన్ఆర్ఈ నుంచి మార్గదర్శకాలు రాలేదు. ఈఆర్సీ ఆమోదించిన అంచనాలతో పోల్చితే 4 ఏళ్లలో 10,083 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోవడానికి తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించాం. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారానే ఈ కొనుగోళ్లు జరిగాయి. హరియాణా మినహా అన్ని రాష్ట్రాల డిస్కంలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇక్కడి డిస్కంలే నష్టాల్లో ఉన్నట్లు ఆరోపించడం హాస్యాస్పదం’ అని అన్నారు. -
కాళేశ్వరానికి ‘కరెంట్’ సిద్ధం!
అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం ప్రాజెక్టుకు 4,700 మెగావాట్ల విద్యుత్ అవసరం రూ.2,890 కోట్లతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశామన్నారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశముందన్నారు. దీనికి తగినట్లు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందన్నారు. దీనికోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్ అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామని చెప్పారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్ళించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్ శాఖది కీలక పాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, ఈ ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు. నిర్ణీ త గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్పూర్తితోనే, లిఫ్టులను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలని, రైతుల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ చేసిన పనులు లోడ్ (మెగా వాట్లు)- 4992.47 పంపులు- 100 మొత్తం సబ్ స్టేషన్లు- 17 400 కె.వి సబ్స్టేషన్లు: 6 220 కె.వి సబ్స్టేషన్లు: 9 132 కె.వి సబ్స్టేషన్లు: 2 మొత్తం లైన్ పొడవు- 1025.3 400 కె.వి లైన్ పొడవు: 521.08 కి.మీ 220 కె.వి లైన్ పొడవు: 461.05 కి.మీ 132 కె.వి లైన్ పొడవు: 43.2 కి.మీ -
‘మెగా’ పవర్ ఘనత మనదే!
సాక్షి, హైదరాబాద్: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం–ప్యాకేజీ– 6) మొదటి పంపు వెట్‌రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అందులో రాష్ట్ర విద్యుత్ సంస్థల శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవడానికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అందించడానికి రెండేళ్లకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పని చేసిన విద్యుత్ సిబ్బందిని ప్రభాకర్‌రావు అభినందించారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్తును ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడానికి పునరంకితమవుతామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించిన విద్యుత్ సంస్థలు.. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిలో విద్యుత్ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. విద్యుత్‌శాఖ రికార్డుస్థాయి ఏర్పాట్లు... భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలం గాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతం గా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధా న్యాన్ని మొదట్లోనే గుర్తించిన కేసీఆర్.. దీనికి అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్య ప్రకాశ్)ను నియమించారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వ హించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసు కుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో 5వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేశారు. మొత్తం 15 పంపుహౌజుల వద్ద 15 డెడికేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించారు. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించా రు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపు లు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పం పులు (ప్యాకేజీ 8 – రామగుడు) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు. సముద్రమట్టానికి 550 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నీటిని మళ్లించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు ఇరుసుగా పనిచేస్తున్నాయి. -
ఏడో దశ కేటీపీ‘ఎస్’!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బాయిలర్‌ను తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు బుధవారం ఉదయం 8.46 గంటలకు వెలిగించారు. ఉత్తరాంచల్ రాష్ట్రం హరిద్వార్‌లో బీహెచ్ఈఎల్ తయారు చేసిన భారీ జనరేటర్‌తో బాయిలర్‌ను అనుసంధానం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్లాంట్‌గా కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు నిలవనుంది. రూ.5,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 జనవరి 1న ప్రారంభించారు. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభించిన 48 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడో దశ ఉత్పత్రి ప్రారంభించిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 15 వేల మెగావాట్లు దాటుతుంది. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు రాధాకృష్ణ, సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. 17 వేల మెగావాట్లు: ప్రభాకర్ రావు 28 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వెల్లడించారు. కేటీపీఎస్ ఏడో దశ, భద్రాద్రి ప్లాంట్లను సందర్శించి.. పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రానికి 17 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6,573 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు దాన్ని 14,972 మెగావాట్లకు చేర్చగలిగామని, ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉందన్నారు. మార్చి 31 నాటికి కేటీపీఎస్ నుంచి 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 31 నాటికి 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంటు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి మరింత సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణం లో భాగంగా బాయిలర్‌ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
ఏపీ నుంచి టీ విద్యుత్ ఉద్యోగులు వెనక్కి!
రిలీవ్ చేయకున్నా వెనక్కి తీసుకోవాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వశాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులంతా జూన్ 27 నాటికి ఏపీ కొత్త రాజధాని అమరావతికి రావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమను రిలీవ్ చేయాలంటూ నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అమరావతికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ విద్యుత్ సంస్థలు తమ ప్రాంత ఉద్యోగులను వెనక్కి తీసుకుంటే విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది జూన్ 10న తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ప్రాంత ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులో వేర్వేరుగా విచారణ జరుగుతోంది. త్వరలో ప్రభుత్వానికి చెబుతాం ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేసినా చేయకపోయినా వారిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. 280 మంది తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు ఏపీలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. త్వరలో ప్రభుత్వానికి తెలిపి చర్యలు తీసుకుంటాం. - డి. ప్రభాకర్‌రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ