
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్‌బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్‌బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
సిబిల్ స్కోర్ అప్‌డేషన్‌లో మార్పులు
ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్‌డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.
తనిఖీ చేస్తే సమాచారం
బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్‌బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.
అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..
ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.
ఉచిత క్రెడిట్ రిపోర్టులు
నిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా లింక్‌ను డిస్‌ప్లే చేయాలి.
నోడల్ అధికారి నియామకం
ఏదైనా బ్యాంక్ కస్టమర్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.
ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారం
ఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment