Employees JAC
-
సమ్మెకు వెనుకాడబోం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్‌లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇ చ్చిన పదోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేనిపక్షంలో ఉద్యోగులు సమ్మె చేయడానికి వెనకాడబోరని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గత కొంత కాలంగా తాత్కాలికం (అడ్‌హక్) పేరుతో షరతులతో కూడిన పదోన్నతులు కల్పిస్తూ బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించారని ఆందోళన వ్యక్తం చేసింది. 35 వేల మందికి పైగా ఉన్న బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు కోరినా యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఆందోళనబాట పట్టక తప్పడం లేదని తెలిపింది. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను పునఃసమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో మహాధర్నా జరిగింది.యాజమాన్యాలకు నోటీసులు అందజేసిన తర్వాత కూడా 3,830 మందికి మళ్లీ అడ్‌హక్ పదోన్నతులు కల్పి0చారని జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన షరతులను పక్కనబెట్టి ఇప్పుడు కొత్త షరతులతో పదోన్నతులు ఇస్తున్నారని, ఇప్పుడు గత ప్రభుత్వం విధించిన షరతులు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ సెలవులో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో పదోన్నతులు కల్పి0చడం బీసీ, ఓసీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగించిందన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎండీ రోనాల్డ్ రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.మాది ఉద్యోగ సానుకూల ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు భట్టిని కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 39 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ నేతలు దేవరకొండ సైదులు, శ్యాంసుందర్, కస్తూరి వెంకట్ తదితరులున్నారు. యశోద గ్రూప్ రూ.కోటి విరాళం వరద బాధితుల సహాయార్థం యశోద గ్రూప్ హాస్పిటల్స్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఆసుపత్రి చీఫ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద ఆసుపత్రి చైర్మన్ రవీందర్రావు, డైరెక్టర్లు సురేందర్‌రావు, దేవేందర్‌రావులను ఈ సందర్భంగా భట్టి అభినందించారు. -
ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: తమకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ తలపెట్టిన ‘బీఆర్టీఎస్ మహా ఆందోళన’ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి మధ్యంతర భృతి అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.70 కోట్లు, సీపీఎస్ ఉద్యోగులకు టీఏ, డీఏల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో రూ.100 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు చెప్పారు. పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్‌లో మార్పులకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరునాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడాన్ని ఖండిస్తూ ఈ నెల 27వ తేదీన జిల్లాల్లో ఏపీ ఎన్జీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శి కేవీ శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
ఏడాది నుంచి ఇదే తంతు.. సిబిల్ స్కోర్ పడిపోతోంది, సారూ.. జీతాలు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. -
‘అమరావతి జేఏసీ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తోంది’
సాక్షి, అమరావతి: అమరావతి జేఏసీపై ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఫైరయ్యాయి. అమరావతి జేఏసీ చేస్తున్న ఆందోళనలతో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అమరావతి జేఏసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కాగా, ఏపీ రెవెన్యూ జేఏసీ ఛైర్మన్ దివాకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో మేలు చేశారు. అమరావతి జేఏసీ ఒక అబద్ధపు, విష ప్రచారాన్ని చేస్తోంది. అమరావతి జేఏసీ నేతలు గోబెల్స్ లాగా మారారు. ఈ ప్రచారాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ సక్రమంగా జీతాలు రాలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడెనిమిది నెలలు జీతాలే అందేవి కాదు. గతంలో మా ఇబ్బందులు ఎవరూ పట్టించుకోలేదు. అమరావతి జేఏసీ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తోంది. అమరావతి జేఏసీ సంఘ నేతలకు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు సవాల్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మాకు ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘ నేతలు మాతో చర్చకు సిద్దమా?. అమరావతి జేఏసీ కుట్రలను ఉద్యోగసంఘాలు, ఉద్యోగులు గమనించాలి. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నల్లబ్యాడ్జీలతో అమరావతి జేఏసీ నిరసన చేపట్టింది. అమరావతి జేఏసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. -
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఉద్యోగ సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ ‘‘గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మేం ముందు వరుసలో ఉండి పనిచేశాం. వ్యాక్సినేషన్ ఇస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పొందే సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ఒకే సమయంలో ఎలా సాధ్యం. మేం వ్యాక్సినేషన్ తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదు. మాకు వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇచ్చాక.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని’’ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.చదవండి: విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: ఏపీ జేఏసీ
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్క్ ఎట్ హోం అవకాశాన్ని కల్పించాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు కోరారు. రెవెన్యూ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదికి మార్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని రెవెన్యూ ఉగ్యోగులు రాత్రింబవళ్లు పనిచేశారన్నారు. రెవెన్యూ కార్యాలయాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చితే కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున సీఎం జగన్ ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చూపి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రమంతటా ఫైళ్లు ఆన్లైన్లో గత అయిదు సంవత్సరాల నుంచి నడుస్తున్నందున కరోనా వైరస్ దృష్టా పది రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఎట్ హోం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు అయినా ఈ అవకాశాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు, అధికారులు అందరూ గత నెల నుంచి కరోనా వ్యాధికి భయపడకుండా ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. -
విద్యుత్ సౌధలో టెన్షన్.. టెన్షన్..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన అంశం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ సంస్థల్లో పని చేస్తున్న స్థానిక ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ చేసి, తెలంగాణ విద్యుత్ సంస్థలకు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఆయా ఉద్యోగులు సోమవారం రిలీవ్ ఆర్డర్లు తీసుకుని తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల వద్దకు చేరుకున్నారు.అప్పటికే అక్కడ భారీగా మోహరించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యుత్ సౌధ సహా మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఎన్.శివాజీ, పి.అంజయ్య, రామేశ్వర్‌శెట్టి, షరీఫ్, వి నోద్, గణేష్, రవికుమార్, వీరస్వామి, పరమేశ్, తిరుపతయ్య, అనిల్ సహా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ఆయా కార్యాలయాల ముందు బైఠాయించారు. ఏపీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయా కార్యాలయాల ప్రధాన గేట్ల ముందు పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఏపీ ఉద్యోగులు లోనికి వెళ్తే..తెలంగాణ ఉద్యోగులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి, ఆ మేరకు అక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.కనీసం ఉద్యోగుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా వారినెలా రిలీవ్ చేస్తారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అం శంలో జస్టిస్ ధర్మాధికారి ఏపీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగే విధంగా కేటాయింపులు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వారిని రిలీవ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. -
మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. సోమవారం ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ సీఎం తొలిసారి ఉద్యోగ సంఘాల నాయకులను కలిసినప్పుడు చెప్పిన మాట ప్రకారం తొలి కేబినెట్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన అనేక సానుకూల నిర్ణయాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. పే రివిజన్ కమిటీ నివేదిక సమర్పించేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం, జులై 1వ తేదీ నుంచి పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు ఎంతో మేలుచేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న సీపీఎస్ రద్దుకు నేడు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసి సాంకేతిక పరమైన తదితర అంశాలపై చర్చించేందుకు కమిటీని నియమించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తూ విధివిధానాలు ఖరారుకు కమిటీ వేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడానికి నిర్ణయించడంతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి నేరుగా జీతం ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల ఆశలకు కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయన్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోన్న నవరత్నాలను, సంక్షేమ పథకాలను ఉద్యోగులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుంటారన్నారు. -
హెల్త్ కార్డులపై ఉద్యోగులకు అరకొర వైద్యం
♦ పూర్తిస్థాయి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోండి ♦ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకు ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై వైద్యం అంతంతమాత్రంగానే అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అరకొర సేవలు మాత్రమే అందుతుంటే.. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. హెల్త్‌కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల జేఏసీ శుక్రవారం ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఈవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్న సంజీవని, తపాలా అధికారులతో పాటు జేఏసీ నేతలు అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. హెల్త్‌కార్డుల పథకం అమలవుతున్న తీరును సమీక్షించారు. వర్క్చార్జ్డ్ ఉద్యోగులు, పలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు.. దాదాపు 40 వేల మందికి వివిధ సాంకేతిక కారణాల వల్ల హెల్త్‌కార్డులు మంజూరు కాలేదని జేఏసీ నేతలు చెప్పారు. వారందరికీ కార్డులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిచేయాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఈనెల 10న ప్యాకేజీ ధరల జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నాయని, ధరలు ఖరారైన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని ఆసుపత్రుల్లో నగదు ప్రమేయం లేని వైద్యం అందుబాటులోకి వస్తుందని సీఈవో చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దీర్ఘకాలిక రోగాలకు ఓపీ సేవలు పొందే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హైల్త్కార్డుల మీద వైద్యం అందించడానికి నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్టీఆర్ వైద్యసేవకు ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్లో చేసేందుకు అవకాశం ఉందన్నారు. -
ఉద్యోగ జేఏసీలో చీలిక..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యోగ జేఏసీలో చీలిక ఏర్పడిందా...? తెలంగాణ ఉద్యమంలో ఇప్పటిదాకా ఐక్యంగా పోరాడిన జేఏసీ చీలిపోయిందా...? గురువారం బంద్ సందర్భంగా వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలను చూసిన ఉద్యోగులకు వచ్చిన సందేహాలివి. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గురువారం బంద్ సందర్భంగా ఉద్యోగ జేఏసీలో విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ సాధన, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి కోసం ఏర్పడిన ఉద్యోగ జేఏసీలో చీలిక వచ్చిన సూచనలు కనిపించాయి. బంద్‌ను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన నేతలు.. గురువారం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి ప్రత్యక్ష బల ప్రదర్శనకు దిగారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ సంఘూలన్నీ కలిసి గత ఎడాది ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, తెలంగాణ సాధన కోసం నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌గా కూరపాటి రంగరాజు, ప్రధాన కార్యదర్శిగా నడింపల్లి వెంకటపతిరాజు, కో-చైర్మన్లుగా ఎస్కె.ఖాజామియా, నాగిరెడ్డి, కోడి లింగయ్య వ్యవహరిస్తున్నారు. చైర్మన్ తమకు కొద్ది రోజులుగా ఏ విషయం చెప్పడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మిగిలిన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బంద్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చైర్మన్ పాల్గొనలేదు. తన శాఖయిన టీఎన్జీఓ సంఘం ప్లకార్డులతో వేరుగా ర్యాలీ నిర్వహించారు. ఇది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో భాగస్వామ్య సంఘాలైన టీజీఓ అసోసియేషన్, టీటీ జేఏసీ, పంచాయతీరాజ్ జేఏసీ, టీ-నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం పాల్గొన్నారు. టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో మరో ప్రదర్శన జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మానవహారం, ఆందోళన జరిగినంతసేపు టీఎన్జీఓ సంఘం ఉద్యోగులు కొందరు, నాయకులు కొద్దిదూరంలో టీఎన్జీఓ సంఘం ప్లకార్డులతో నిల్చున్నారు. ఉద్యోగ జేఏసీ నాయకులు వెళ్లిన కొద్దిసేపటి తరువాత టీఎన్జీఓ సంఘం నాయకులు అదే సెంటర్‌కు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ, టీఎన్జీఓ సంఘం వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఉద్యోగులు అయోమయానికి లోనయ్యారు. ఉద్యోగ సంఘాల నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నాయకుల ఏకపక్ష నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. జేఏసీ పిలుపులో భాగంగా ఏ కార్యక్రమం చేపట్టినా భాగస్వామ్యపక్షాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక నాయకుడు ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకే ఇలా వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. రాజకీయ పక్షాలు సైతం ఆ నాయకుడి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. చైర్మన్ తీరుతో విసిగివేసారిన ఉద్యోగ జేఏసీ నాయకులు వేరేగా ప్రదర్శనలు నిర్వహించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఆ నాయకుడు వేరుగా ప్రదర్శన నిర్వహించడంపై ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'నేను పదవిలో ఉన్నంతకాలం విభజన జరగదు' - ఉద్యోగులతో సీఎం కిరణ్
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించడానికి ఉద్యోగ సంఘాలు నిరాకరించారు. సమైక్య రాష్ట్రంపై ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పదవిలో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు ఉన్నందున్న ప్రభుత్వానికి సహకరించి..సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో మూడు గంటలపాటు జరిగిన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో చర్చలు అనంతరం జేఏసీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ.. తుఫాన్ వస్తే అత్యవసర సేవల్లో పాల్గొంటాం. సమ్మె యధావిధిగా కొనసాగుతుంది. ఈ నెల 11, 12 తేదిన అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తాం అని అన్నారు. -
14, 15 తేదీల్లో తిరుమలకు వాహనాల బంద్
సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని తిరుపతి ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన జేఏసీ సమావేశం ఉద్యమ తీవ్రతను పెంచుతూ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలతో పాటు, ద్విచ క్రవాహనాలను కూడా అనుమతించకూడదని నిర్ణయించింది. తిరుమలకు బంద్‌ను మినహాయించాలని కోరుతూ ఆర్డీవో రామచంద్రారెడ్డితో టీటీడీ అధికారుల సంఘం నేతలు టి.రవి, శేషారెడ్డి, చెంచులక్ష్మి చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమకు తిరుమలకు వచ్చే భక్తులపై వ్యతిరేకత లేదని, ఇక్కడ జరిగే బంద్ ప్రభావం ఢిల్లీకి తెలియూలనే ఉద్దేశంతోనే 48 గంటల పాటు తిరుమల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇందుకు మద్దతు ప్రకటించారని తెలిపారు. తిరుమలకు ఏ వాహనం వెళ్లకుండా ఉండేందుకు ప్రయివేటు టాక్సీల యూనియన్ను కూడా ఈ బంద్‌లో సహకరించాలని కోరనున్నామని చెప్పారు. భక్తులు కూడా ఈ రెండు రోజులు తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. తిరుపతిలో ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు విద్యుత్ సరఫరాను ఆపివేస్తామని, ఈ సమయంలో ప్రజలు కొవ్వొత్తులతో దేవదేవునికి అఖండ జ్యోతిని వెలిగించాలని కోరారు.