
సాక్షి, అమరావతి: అమరావతి జేఏసీపై ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఫైరయ్యాయి. అమరావతి జేఏసీ చేస్తున్న ఆందోళనలతో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అమరావతి జేఏసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
కాగా, ఏపీ రెవెన్యూ జేఏసీ ఛైర్మన్ దివాకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మేలు చేశారు. అమరావతి జేఏసీ ఒక అబద్ధపు, విష ప్రచారాన్ని చేస్తోంది. అమరావతి జేఏసీ నేతలు గోబెల్స్ లాగా మారారు. ఈ ప్రచారాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ సక్రమంగా జీతాలు రాలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడెనిమిది నెలలు జీతాలే అందేవి కాదు. గతంలో మా ఇబ్బందులు ఎవరూ పట్టించుకోలేదు. అమరావతి జేఏసీ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తోంది.
అమరావతి జేఏసీ సంఘ నేతలకు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు సవాల్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మాకు ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘ నేతలు మాతో చర్చకు సిద్దమా?. అమరావతి జేఏసీ కుట్రలను ఉద్యోగసంఘాలు, ఉద్యోగులు గమనించాలి. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నల్లబ్యాడ్జీలతో అమరావతి జేఏసీ నిరసన చేపట్టింది. అమరావతి జేఏసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.