విద్యుత్ సౌధ మహాధర్నాలో బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ స్పష్టీకరణ
సీఎం, డిప్యూటీ సీఎం చొరవ తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్‌లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇ చ్చిన పదోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేనిపక్షంలో ఉద్యోగులు సమ్మె చేయడానికి వెనకాడబోరని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గత కొంత కాలంగా తాత్కాలికం (అడ్‌హక్) పేరుతో షరతులతో కూడిన పదోన్నతులు కల్పిస్తూ బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించారని ఆందోళన వ్యక్తం చేసింది. 35 వేల మందికి పైగా ఉన్న బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు కోరినా యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఆందోళనబాట పట్టక తప్పడం లేదని తెలిపింది. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను పునఃసమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో మహాధర్నా జరిగింది.
యాజమాన్యాలకు నోటీసులు అందజేసిన తర్వాత కూడా 3,830 మందికి మళ్లీ అడ్‌హక్ పదోన్నతులు కల్పి0చారని జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన షరతులను పక్కనబెట్టి ఇప్పుడు కొత్త షరతులతో పదోన్నతులు ఇస్తున్నారని, ఇప్పుడు గత ప్రభుత్వం విధించిన షరతులు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు.
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రొనాల్డ్ రాస్ సెలవులో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో పదోన్నతులు కల్పి0చడం బీసీ, ఓసీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగించిందన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎండీ రోనాల్డ్ రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
మాది ఉద్యోగ సానుకూల ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు భట్టిని కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 39 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ నేతలు దేవరకొండ సైదులు, శ్యాంసుందర్, కస్తూరి వెంకట్ తదితరులున్నారు.
యశోద గ్రూప్ రూ.కోటి విరాళం
వరద బాధితుల సహాయార్థం యశోద గ్రూప్ హాస్పిటల్స్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఆసుపత్రి చీఫ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద ఆసుపత్రి చైర్మన్ రవీందర్‌రావు, డైరెక్టర్లు సురేందర్‌రావు, దేవేందర్‌రావులను ఈ సందర్భంగా భట్టి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment